వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024 టోర్నీ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా కేవలం ఎనభై పరుగులకే బంగ్లా కథ ముగిసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా టీ20 కప్‌లో గ్రూప్-ఏలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ క్రమంలో గ్రూప్-ఏ టాపర్‌గా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు.. బంగ్లాదేశ్ గ్రూప్-బి సెకండ్ టాపర్‌గా నిలిచింది.
ఫలితంగా తొలి సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాతో పోటీకి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో డంబుల్లా వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత పేసర్ రేణుకా సింగ్ ఆది నుంచే నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లను తిప్పలు పెట్టింది.
తన బౌలింగ్ నైపుణ్యాలతో టాపార్డర్‌ను కుదేలు చేసింది. రేణుక దెబ్బకు ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8) పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు.
నిగర్ కెప్టెన్ ఇన్నింగ్స్
జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా పట్టుదలగా నిలబడింది. 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ బౌలింగ్‌లో నిగర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఆ తర్వాత టపా టపా వికెట్లు పడ్డాయి. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ మిగిలిన పని పూర్తి చేశారు. బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్‌లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ అత్యధికంగా మూడేసి వికెట్లు దక్కించుకోగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ టోర్నీలో భారత బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విధించిన 81 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళా జట్టు తేలికగానే ఛేదించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment