Women Asia Cup 2022 India Vs Pak: Pakistan Beat India By 13 Runs - Sakshi
Sakshi News home page

Ind Vs Pak T20: దాయాది చేతిలో భారత్‌కు తప్పని భంగపాటు.. అప్పుడు అలా! ఇప్పుడిలా!

Published Fri, Oct 7 2022 4:49 PM | Last Updated on Fri, Oct 7 2022 6:24 PM

Women Asia Cup 2022 India Vs Pak: Pakistan Beat India By 13 Runs - Sakshi

భారత జట్టు మహిళా జట్టు (PC: BCCI Women Twitter)

Womens Asia Cup T20 2022- India Vs Pakistan: మహిళల ఆసియా కప్‌- 2022 టీ20 టోర్నీలో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రీతిలో సాగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేనకు భంగపాటు తప్పలేదు. 13 పరుగుల తేడాతో గెలుపొందిన పాక్‌ మహిళా జట్టు.. సుదీర్ఘకాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌లో భారత్‌పై తొలి విజయం నమోదు చేసింది.

ఆదుకున్న నిదా
బంగ్లాదేశ్‌లోని సెల్హెట్‌ వేదికగా శుక్రవారం భారత్‌- పాకిస్తాన్‌ మహిళా జట్లు ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్లు దీప్తి శర్మ మూడు వికెట్లు, పూజా వస్త్రాకర్‌ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్‌ 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

కెప్టెన్‌ బిస్మా మరూఫ్‌ 32 పరుగులతో రాణించగా.. ఆల్‌రౌండర్‌ నిదా దర్‌ 56 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో దీప్తికి మూడు, పూజాకు రెండు, రేణుకకు ఒక వికెట్‌ దక్కాయి.

ఒకరిద్దరు మినహా
భారత ఓపెనర్లు సబ్బినేని మేఘన 15, స్మృతి మంధాన 17 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించారు. మూడో స్థానంలో వచ్చిన జెమీమా(2) పూర్తిగా నిరాశపరచగా.. హేమలత 20 పరుగులతో రాణించింది. మిగతా వాళ్లలో దీప్తి 16, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 12, రిచా ఘోష్‌ 26 పరుగులు(13 బంతుల్లో) మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోరు చేయగలిగారు.

దీంతో 19.4 ఓవర్లలో 124 పరుగులకే భారత జట్టు ఆలౌట్‌ అయింది. పాక్‌ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాట్‌తోనూ, బంతితోనూ రాణించిన నిదా దర్‌(37 బంతుల్లో 56 పరుగులు, రెండు వికెట్లు)ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకుంది. 

అప్పుడలా.. ఇప్పుడిలా
కాగా టీ20 ఫార్మాట్‌లో ఇరుజట్లు 13 సార్లు తలపడగా భారత మహిళా జట్టుపై పాక్‌ టీమ్‌కు ఇది మూడో విజయం. 2016 తర్వాత ఇదే తొలి గెలుపు. ఇక ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో హర్మన్‌ప్రీత్‌ బృందం మూడింట గెలిచింది. మరోవైపు పాక్‌కు ఇది రెండో విజయం.

ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్‌-2022 ఈవెంట్‌లో లీగ్‌ దశలో పాక్‌పై గెలుపొందిన రోహిత్‌ సేన.. కీలకమైన సూపర్‌-4 దశలో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. ఫైనల్‌ చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది ఈ డిఫెండింగ్‌ చాంపియన్‌.

చదవండి: T20 WC 2022: ప్రపంచకప్‌ టోర్నీ.. ప్రాక్టీసు​ మొదలుపెట్టిన టీమిండియా
IND vs SA: 'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం! సంజూ గ్రేట్‌'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement