మహిళల టీ20 ప్రపంచకప్-2024లో తమ తొలి మ్యాచ్‌లో గెలిచిన పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు జోష్‌లో ఉంది. గ్రూప్-ఏలో భాగమైన శ్రీలంకను 31 పరుగులతో ఓడించి తొలి విజయం అందుకుంది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఆదివారం పోటీకి సిద్ధమైంది.
దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దాయాది జట్ల మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు హర్మన్‌ప్రీత్ సేనతో పాక్ మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. అన్ని మ్యాచ్‌లలాగే టీమిండియాతోనూ ఆడతామని పేర్కొంది.
దూకుడైన క్రికెట్ ఆడుతున్నాం
‘‘మేము ఒత్తిడికి లోనవ్వము. అయితే, ప్రేక్షకుల ఉత్సాహం కారణంగా మా వాళ్లు కాస్త అలజడి చెందే అవకాశం ఉంది. అయితే, వీలైనంత ఎక్కువగా కామ్‌గా, కూల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఒత్తిడికి లోనైతే మాత్రం ఫలితం మాకు అనుకూలంగా రాదని తెలుసు.
మేము గత కొంతకాలంగా దూకుడైన క్రికెట్ ఆడుతున్నాం. ప్రత్యర్థి ఎవరన్న అంశంతో సంబంధం లేకుండా నిర్భయంగా అటాకింగ్‌కి దిగుతున్నాం. తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయడానికి సిద్ధపడుతున్నాం. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చితకబాదడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.
అందుకు తగ్గట్లుగానే ఇక్కడా ఫలితం రాబడతామని విశ్వాసంతో ఉన్నాము’’ అని ఫాతిమా సనా గెలుపుపై ధీమా వ్యక్తం చేసింది. కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఫాతిమా ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో అదరగొట్టింది. 30 పరుగులు చేయడంతో పాటు.. రెండు వికెట్లు తీసింది.
భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ తాజా ఎడిషన్లో గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా బోణీ కొట్టగా.. భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే కివీస్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓడింది.
ఈ క్రమంలో ఇక ముందు ఆడనున్న ప్రతీ మ్యాచ్ హర్మన్‌సేనకు అగ్నిపరీక్షగా మారింది. పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక జట్లపై ఘన విజయాలు సాధించడం సహా ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తేనే సెమీస్‌కు మార్గం సుగమం అవుతుంది. లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే.
ఇక పాకిస్తాన్ మహిళా జట్టుపై కూడా భారత్‌దే పైచేయి. ఇప్పటి వరకు ఇరుజట్లు టీ20లలో 15 సందర్భాల్లో తలపడగా.. భారత్ 12 సార్లు, పాక్ మూడు సార్లు గెలిచింది. చివరగా ఆసియా వుమెన్స్ కప్-2024లోనూ హర్మన్ సేన పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
చదవండి: అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండి: పాక్ బ్యాటర్లపై కోచ్ ఫైర్!
Comments
Please login to add a commentAdd a comment