
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో జయభేరి మోగించిన రోహిత్ సేన.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో భాగంగా ఆఖరిగా నామమాత్రపు మ్యాచ్‌లో న్యూజిలాండ్(India vs New Zealand)ను ఢీకొట్టనుంది. ఇక కివీస్ కూడా ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. ఇరుజట్లకు నాకౌట్ స్టేజ్ కోసం ఇదొక సన్నాహక మ్యాచ్‌గా ఉండబోతోంది.
ఇదిలా ఉంటే.. ఈ మెగా వన్డే టోర్నమెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లన్నీ ఆడుతోంది.
భారత్ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్ కూడా ఉండటం వల్ల..
ఈ నేపథ్యంలో ఒకే వేదికపై ఆడటం భారత జట్టుకు అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ‘‘టోర్నీ సజావుగా సాగిపోతోంది. అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల టీమిండియాకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.
అయినా ఆ జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. అద్భుతంగా ఆడుతున్నారు. ఒకే వేదికపై ఆడటం మాత్రం అదనంగా ఎంతో కొంత లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు’’ అని యాహూ స్పోర్ట్‌తో కమిన్స్ పేర్కొన్నాడు. కాగా చీలమండ నొప్పి కారణంగా ప్యాట్ కమిన్స్ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆసీస్ ఈ వన్డే టోర్నీ బరిలో దిగింది. గ్రూప్-బిలో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడ్డ కంగారూ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయంతో టోర్నీని ఆరంభించిన స్మిత్ బృందం.. తదుపరి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నెగ్గి సెమీస్ చేరాలనే పట్టుదలతో ఉంది.
ఐపీఎల్‌తో రీఎంట్రీ
ఇదిలా ఉంటే.. కమిన్స్ ఐపీఎల్-2025 ద్వారా పునరాగమనం చేయనున్నాడు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ... ‘‘చీలమండ గాయానికి చికిత్స తీసుకుంటున్నాను. ఏదేమైనా ఇంట్లో ఉండటం, కుటుంబ సభ్యులతో సమయం గడపటం సంతోషంగా ఉంది. వచ్చే వారం నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెడతాను.
వచ్చే నెల నుంచి ఐపీఎల్ ఆరంభం కాబోతోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటన.. ఇలా రానున్న ఆరు నెలలు బిజీబిజీగా గడువబోతోంది’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. కాగా కమిన్స్ ఇటీవలే రెండోసారి తండ్రయ్యాడు. కుమార్తె ఈదికి అతడి భార్య జన్మనిచ్చింది. కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా జట్టు
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెగర్క్, తన్వీర్ సంఘా.
చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
Comments
Please login to add a commentAdd a comment