వాళ్లంతా గ్రేట్‌.. కోచ్‌ చెప్పినట్లే చేశాం.. కానీ: భారత కెప్టెన్‌ | India Beat West Indies In 3rd ODI Clean Sweep Series Harman Lauds Renuka | Sakshi
Sakshi News home page

వాళ్లంతా గ్రేట్‌.. కోచ్‌ చెప్పినట్లే చేశాం.. కానీ: భారత కెప్టెన్‌

Published Fri, Dec 27 2024 6:17 PM | Last Updated on Fri, Dec 27 2024 6:45 PM

India Beat West Indies In 3rd ODI Clean Sweep Series Harman Lauds Renuka

భారత మహిళల క్రికెట్‌ జట్టు అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్‌(India Women vs West Indies Women)తో మూడో వన్డేలోనూ గెలుపొంది.. సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ స్పందిస్తూ.. సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించింది. సమిష్టి ప్రదర్శనతోనే విజయం సాధ్యమైందని పేర్కొంది.

రెండు సిరీస్‌లు భారత్‌వే
కాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు వెస్టిండీస్‌ మహిళా జట్టు భారత్‌ వచ్చింది. తొలుత నవీ ముంబై వేదికగా జరిగిన పొట్టి సిరీస్‌లో హర్మన్‌ సేన.. హేలీ మాథ్యూస్‌ బృందంపై 2-1తో నెగ్గింది. అనంతరం వడోదర వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

చెలరేగిన రేణుక.. దీప్తి విశ్వరూపం
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం నామమాత్రపు మూడో వన్డే జరిగింది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి విండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. పేసర్‌ రేణుకా ఠాకూర్‌ సింగ్‌(Renuka Thakur Singh) నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్‌ దీప్తి శర్మ(Deepti Sharma) ఆరు వికెట్లతో దుమ్ములేపింది.

వెస్టిండీస్ బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ షెమానే కాంప్‌బెల్‌(46), చినెల్లె హెన్రీ(61), అలియా అలెనె(21) మాత్రమే రాణించారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో వెస్టిండీస్‌ 38.5 ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆలౌట్‌ అయింది.

ఆరంభంలో తడబడ్డా.. ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్‌తో 
ఇక స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగినప్పటికీ టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ స్మృతి మంధాన 4 పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్‌ ప్రతికా రావల్‌(18) నిరాశపరిచింది. వన్‌డౌన్‌లో వచ్చిన హర్లీన్‌ డియోల్‌(1) కూడా విఫలమైంది.

ఇలా టాపార్డర్‌ కుదేలైన వేళ.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ధనాధన్‌ దంచికొట్టింది. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసింది. అదే విధంగా.. జెమీమా రోడ్రిగ్స్‌(29), దీప్తి శర్మ(39 నాటౌట్‌) రాణించారు. ఇక ఆఖర్లో రిచా ఘోష్‌ మెరుపులు మెరిపించింది. కేవలం 11 బంతుల్లోనే 23 పరుగులు చేసి.. జట్టును విజయతీరాలకు చేర్చింది.

 

ఆ ముగ్గురూ గ్రేట్‌
ఈ క్రమంలో 28.2 ఓవర్లలోనే టార్గెట్‌ ఛేదించిన భారత్‌.. ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీప్తి శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, రేణుకా సింగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. ‘‘రేణుక అద్బుతంగా బౌలింగ్‌ చేసింది. మానసికంగా మనం ఎంత బలంగా ఉన్నామో ఇలాంటి ప్రదర్శన ద్వారా తెలుస్తుంది.

ఇక దీప్తి శర్మ, జెమీమా బాగా బ్యాటింగ్‌ చేశారు. ఆఖర్లో రిచా అద్భుతమైన ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చింది. అంతా కలిసి కట్టుగా ఉంటే.. ఇలాంటి సానుకూల ఫలితాలు వస్తాయి. జట్టులోని ప్రతి ఒక్కరికీ విజయంలో భాగం ఉంది.

అయితే, ఒక్క తప్పు లేకుండా వంద శాతం ఫలితాలు కావాలని మా ఫీల్డింగ్‌ కోచ్‌ పదే పదే చెప్తారు. కానీ.. ఈరోజు ఒకటీ రెండుసార్లు మేము విఫలమయ్యాం. వచ్చే ఏడాది ఈ తప్పులను పునరావృతం కానివ్వము’’ అని పేర్కొంది.

చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement