వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. భారత బౌలర్ల ధాటికి 38.5 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఆరు వికెట్లతో విజృంభించగా.. రేణుకా ఠాకూర్ నాలుగు వికెట్లు నేలకూల్చింది.
నిప్పులు చెరిగిన రేణుకా
ఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా పేసర్ రేణుకా సింగ్ నిప్పులు చెరిగింది. తొలి బంతికే ఓపెనర్ క్వియానా జోసఫ్‌ను ఔట్ చేసిన రేణుకా.. అదే ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్, కెప్టెన్ హేలీ మాథ్యూస్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. అనంతరం రేణుకా ఐదో ఓవర్‌లో మరో వికెట్ పడగొట్టింది. ఈసారి ఆమె స్టార్ ప్లేయర్ డియాండ్రా డొట్టిన్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో వెస్టిండీస్ 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
దీప్తి శర్మ మాయాజాలం
విండీస్ పతనానికి రేణుకా సింగ్ పునాది వేయగా.. ఆతర్వాత పనిని దీప్తి శర్మ పూర్తి చేసింది. దీప్తి ఏ దశలోనూ విండీస్ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. మధ్యలో షెమెయిన్ క్యాంప్‌బెల్ (46), చిన్నెల్ హెన్రీ (61) నిలకడగా ఆడినప్పటికీ.. ఈ ఇద్దరిని దీప్తి స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపింది. విండీస్ ఇన్నింగ్స్‌లో క్యాంప్‌బెల్, హెన్రీతో పాటు ఆలియా అలెన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
సిరీస్ సొంతం
మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌ను భారత్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ భారీ తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఈ రెండు వన్డేల్లో భారత్ భారీ స్కోర్లు నమోదు చేసింది. వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌ను సైతం భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment