షార్జా: అదిరే ఆరంభం... ఆపై నిరాశజనక ప్రదర్శన... తొలి రెండు మ్యాచ్‌ల్లో మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నీ సాగిన తీరిది. కరోనా విరామం తర్వాత భారత మహిళలు తలపడుతోన్న ఈ టోర్నీలో ఊహకందని ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్... అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ట్రయల్ బ్లేజర్స్‌ను నేడు ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది దర్జాగా ఫైనల్‌కు చేరేందుకు స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ పక్కాగా సిద్ధమైంది. లీగ్‌లో నిలవాలంటే గెలవడం తప్ప సూపర్ నోవాస్‌కు మరో దారి లేదు.
ఈ మ్యాచ్‌లో గెలుపొందితే నెట్ రన్‌రేట్ సహాయంతో వెలాసిటీ (–1.869) జట్టును వెనక్కి నెట్టి సూపర్ నోవాస్ (–0.204) ఫైనల్‌కు చేరే అవకాశముంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం పట్టుదలగా ఉంది. చమరి ఆటపట్టు, జెమీమా రోడ్రిగ్స్ సహాయంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించాలని యోచిస్తుంది. మరోవైపు ట్రయల్ బ్లేజర్స్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై సోఫీతో పాటు రాజేశ్వరీ గైక్వాడ్‌ను తట్టుకొని నిలిస్తే సూపర్ నోవాస్ విజయం కష్టమేమీ కాదు. ఇరు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరుగనుంది. బ్యాటర్లు సత్తా చాటిన జట్టునే విజయం వరించడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment