మార్చిలో ‘ముచ్చుమర్రి’ ప్రారంభోత్సవం
- ట్రయల్ రన్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని మార్చిలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకం నుంచి ట్రయల్ రన్ ద్వారా కేసీ కాలువకు నీటి విడుదలను డిప్యూటీ సీఎంతోపాటు, ఎమ్మెల్యే వై. ఐజయ్య, కలెక్టర్ విజయమోహన్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ..ఎత్తిపోతల పథకంలో ఇప్పటికి రెండు పంప్‌లను పూర్తి చేసి ట్రయల్‌రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కేసీ కాలువకు నాలుగు పంప్‌ల ద్వారా నీరు ఇవ్వడం వల్ల 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. అలాగే హంద్రీనీవా కాలువ ద్వారా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు 5 వేల క్యూసెక్కులు నీరు అందించనున్నట్లు తెలిపారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాయలసీమ సస్యశ్యామం చేయబోతుందని కలెక్టర్ విజయ్‌మోహన్ అన్నారు. సిద్దాపురం, పులికనుమ ప్రాజెక్ట్‌లను కూడా త్వరలోనే పూర్తి చేయిస్తామని వెల్లడించారు. ఆర్డీవో రఘుబాబు, డీఎస్పీ సుప్రజ, సీఐ శ్రీనా«థ్‌రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ ఆశయం నెరవేరింది
- ఎమ్మెల్యే ఐజయ్య
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయం నెరవేరిందని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య పేర్కొన్నారు. ఈ పథకం 2006లో పురుడు పోసుకుందని.. 2016 చివరికి ఒక కొలిక్కి రావడం రాయలసీమ ప్రజల అదృష్టమన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ చూపిన కృషిని మరువలేమన్నారు. ప్రస్తుతం రెండు పంప్‌లు ట్రయల్‌రన్‌కు సిద్ధంగా ఉన్నాయని.. మిగిలిన రెండు పంప్‌ల పనులను కూడా పూర్తి చేసి కేసీకాలుకు 4 పంప్‌ల ద్వారా నీరు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మల్యాల నుంచి కేసీ కాలువలోకి రెండు పంప్‌ల ద్వారా నీటి విడుదల యథాతథంగా కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. ముచ్చుమర్రి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని పలుమార్లు ప్రభుత్వంపై ఒత్తిడి చేశామని ఎమ్మెల్యే అన్నారు. అసెంబ్లీలోనూ ప్రస్తావించానని.. ఎట్టకేలకు ట్రయల్‌రన్ సక్సెస్ కావడంతో పగిడ్యాల, పాములపాడు, జూపాడుబంగ్లా మండలాలతో పాటు గడివేముల మండలంలోని రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అనంతరం ఆయా గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఉప ముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి, ఎమ్మెల్యే వై. ఐజయ్య, కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్, టీడీపీ నియోజకర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.