రైళ్లు రద్దయితే.. ఎస్ఎమ్ఎస్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే వ్యవస్థ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి రైళ్లు రద్దయితే.. ఆ తాలుకూ సమాచారాన్ని ప్రయాణీకుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎమ్ఎస్(సంక్షిప్త సమాచారం) ద్వారా అందించనుంది. సంబంధిత రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న రైళ్ల సమాచారం, వేళలు, వాటి రద్దు సమాచారాన్ని పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందించే ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించింది.
ప్రయాణీకుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీనివల్ల రైళ్లు రద్దయితే వారు వెంటనే టిక్కెట్లు రద్దు చేసుకునే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకునే సమయంలో ఏ ఫోన్ నెంబర్ ఇస్తారో దానికి మాత్రమే ఎస్ఎమ్ఎస్ వస్తుంది.