train stations
-
రష్యాకు ఊహించని ఝలక్..రైల్వేస్టేషన్లో దాడులకు సంబంధించిన ఫోటోల ప్రదర్శన
24 Wae Images Set Up On The Platform: ఉక్రెయిన్ పై రష్యా నిరవధిక పోరు కొనసాగిస్తునే ఉంది. రష్యా ఏ మాత్రం తగ్గేదేలే అంటూ ఉక్రెయిన్ పై బాంబుల మోత మోగిస్తూనే ఉంది. ప్రత్యేక సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌ని అల్లకల్లోలం చేస్తోంది. దీంతో లక్షలాది మంది ఉక్రెయిన్‌ని విడిచి వలస వెళ్లగా..వేలాది మంది పౌరులు ఈ యుద్ధంలో విగత జీవులుగా మారారు. మరోవైపు ఉక్రెయిన్ కూడా ఏ విధంగానైనా రష్యా దురాక్రమణకు అడ్డుకట్టే వేసేలా తనదైన శైలిలో శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులతో ఏ విధంగా విరుచుకుపడుతున్నయో వివరించే చిత్రాల ప్రదర్శనను లిథువేనియాలోని రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసింది. లిథువేనియా, ఐరోపా సమాఖ్య, రష్యా ప్రత్యేక ఏర్పాటు ప్రకారం బాల్టిక్ రాష్ట్రం నెలకు 100 రైళ్లను కాలినిన్గ్రాడ్ ఎక్స్క్లేవ్ నుంచి రష్యన్ ప్రయాణీకులను రవాణా చేయడానికి అనుమతిస్తుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైనప్పటీ నుంచి రష్యాకు వ్యతిరేకంగా విమాన ప్రయాణంపై అనేక ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ లుథువేనియాలో ఈ రవాణా ఏర్పాటు కొనసాగుతూనే ఉంది. అయితే లిథువేనియన్ రాజధాని విల్నియస్‌లోని రైల్వే స్టేషన్లో ఈయూ ప్రయాణీకులు రైలు నుంచి దిగడానికి అనుమతి ఉంది కానీ రష్యన్ ప్రయాణీకులకు లేదు. ఈ మేరకు రష్యాన్ ప్రయాణికులకు పుతిన్ దురాగతాలు తెలిసేలే ఉక్రెయిన్ అధికారులు యుద్ధానికి సంబంధించిన దాదాపు 24 చిత్రాలను లిథువేనియా రైల్వేస్టేషన్‌లోని ప్లాట్ట్పారమ్పై ఏర్పాటు చేశారు. పైగా ఆ చిత్రాలను క్యారేజ్ కిటికిల ఎత్తులో ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ చిత్రాలలో శాంతియుత దేశంలోని జనాభా పై దాడులు నిర్వహించి గాయపరిచారు, మా ప్రజల స్వేచ్ఛ యుత జీవనానికి భంగం కలిగించారు వంటి సందేశాలు కూడా ఉన్నాయని లిథువేనియన్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ క్లబ్ అధిపతి జోనాస్ స్టాసెలిస్ అన్నారు. నిజానికి ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణను ఖండిస్తూ..రష్యన్ వాసులు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇటీవల ఒక రష్యన్ టీవీ ఛానల్లో న్యూస్ రీడర్ వెనుక ఒక జర్నలిస్ట్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని రావడంతో ఆమెను రష్యా అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు కూడా. ఈ మేరకు పుతిన్‌కి సొంత దేశంలోనే పూర్తి వ్యతిరేకత వచ్చేలా ఉక్రెయిన్ తనదైన వ్యూహంతో పావులు కదుపుతోంది. (చదవండి: ఫస్ట్ స్టేజ్ మిలటరీ ఆపరేషన్ ఫినిష్... అదే మా లక్ష్యం!) -
సికింద్రాబాద్.. కాదు ట్రెయిన్‌బాద్!
సికింద్రాబాద్ ‘రైళ్లబాద్’ అయింది. ఈ ప్రాంతంలో ఎటు చూసినా రైళ్లేకన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 16 రైల్వేస్టేషన్ల నుంచి రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఇందులో రెండు సాధారణ, 8 మెట్రో, 6 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్ల నుంచి సగటున 3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్టు ఒక అంచనా. త్వరలో జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మెట్రో కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో జేబీఎస్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీఆసుపత్రి కేంద్రాలుగా మరో మూడు రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.క్రమేణా సికింద్రాబాద్ ప్రాంతం రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల సమాహారంగామారుతుంది. సికింద్రాబాద్ :స్వాతంత్య్రానికి పూర్వం సైనిక బలగాల స్థావరాలతో సికింద్రాబాద్ విరాజిల్లింది. లష్కరులకు (జవాన్లకు) కేంద్రంగా ఉండడంతో ఈ ప్రాంతానికి లష్కర్ అనే పేరువచ్చింది. నాడు కంటోన్మెంట్ పరిధిలో రెజిమెంటల్ బజార్, బోట్స్ క్లబ్, ట్యాంక్‌బండ్, బేగంపేట్ ప్రాంతాలు సైనిక స్థావరాలకు కేంద్రాలుగా ఉండేవి. స్వాతంత్య్రానంతరం ఇక్కడి సైనిక స్థావరాలు శివారు ప్రాంతాలకు తరలించారు. ఆ తరువాత జనావాసాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా మారిన సికింద్రాబాద్ ప్రాంతం క్రమేణా రైల్వేస్టేషన్లకు కేంద్రంగా మారింది. సికింద్రాబాద్ ప్రతిష్టాత్మక రైల్వేస్టేషన్‌కు అనుబంధంగా 6 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఆవరించి ఉన్నాయి. సబర్బన్ రైళ్లకోసం లాలాగూడలో మరో రైల్వేస్టేషన్ ఉంది. తాజాగా ఎనిమిది మెట్రో స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆరు ఎంఎంటీఎస్ స్టేషన్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఇరువైపుల 6 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఒకవైపు జామైఉస్మానియా, ఆర్ట్స్ కళాశాల, సీతాఫల్మండి మరొకవైపు జేమ్స్‌స్ట్రీట్, సంజీవయ్యపార్కు, బేగంపేట ఎంఎంటీఎస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న 130 వరకు ఎంఎంటీఎస్ రైళ్లలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా, లింగంపల్లి, హైదరాబాద్ మార్గాలకు ఈ స్టేషన్ల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న లాలాగూడ రైల్వేస్టేషన్ నుంచి సబర్బన్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. ఎనిమిది మెట్రో స్టేషన్లు తార్నాక మొదలుకొని బేగంపేట వరకు తాజాగా మెట్రో రైళ్ల కోసం ఎనమిది మెట్రో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ ఈస్ట్, పరేడ్‌గ్రౌండ్, రసూల్‌పుర, ప్రకాశ్‌నగర్, బేగంపేట కేంద్రాలుగా మెట్రోస్టేషన్లు ఏర్పాటయ్యాయి. త్వరలో జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో జేబీఎస్, సికింద్రాబాద్ స్టేషన్, గాంధీ ఆసుపత్రి కేంద్రాలుగా మరో మూడు మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా వంతెనలు సికింద్రాబాద్‌లో మెట్రో నిర్మాణాలు వినూత్న పద్ధతుల్లో ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతానికి కొత్తరూపు తెచ్చాయి. అంతేకాదు ప్రయాణికులకు కనువిందు చేస్తున్నాయి. ♦ సికింద్రాబాద్ రెతిఫైల్ బస్‌స్టేషన్ పక్కన ఒలిఫెంటా వంతెన ఉంది. వంతెన కిందినుంచి వాహనాలు, మీదినుంచి రైళ్ల రాకపోకలు ఉంటున్నాయి. ఈ వంతెనపై నుంచి కొత్తగా ఎత్తైన మెట్రోరైలు వంతెనను ఏర్పాటు చేశారు. ఒలిఫెంటా వంతెన పైన మరింత ఎత్తులో స్టీలు వంతెనను అమర్చి రెండు మార్గాలను అనుసంధానం చేశారు. ♦ సికింద్రాబాద్ వైఎంసీఏ కూడలి. ఇక్కడ వాహనాల రాకపోకల కోసం హరిహర కళాభవన్ ఫ్లై ఓవర్ ఉంది. వైఎంసీఏ నుంచి నాగోల్–అమీర్‌పేట్ వెళ్లే మెట్రోరైళ్ల కోసం ఇక్కడి ఫ్లై ఓవర్‌కు సమాంతరంగా మెట్రో కారిడార్‌ను నిర్మించారు. రెండు సమాంతర వంతెనలు ఉండగానే ఫలక్‌నుమా–జేబీఎస్‌కు మెట్రోరైళ్లు రాకపోకల కోసం రెండు వంతెనల పై నుంచి మరో మెట్రో కారిడార్‌ను నిర్మించారు. ♦ మెట్టుగూడ–సికింద్రాబాద్ మెట్రో కారిడార్‌ను ఆలుగడ్డబావి రైల్వే వంతెన మీదుగా నిర్మించారు. ఎత్తైన పొడవాటి పిల్లర్లతో నిర్మించిన ఇక్కడి మెట్రో కారిడార్ ఆకట్టుకుంటుంది. ఎటు చూసినా పరుగులే... సికింద్రాబాద్‌లో ఏ రహదారికి వెళ్లినా రైల్వేస్టేషన్లు నెలకొని ఉన్నాయి. అంతేకాదు ఈ ప్రాంతంలోని వంతెనలపై మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్ల పరుగులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మెట్రో సెకండ్ ఫేజ్ కారిడార్ల నిర్మాణం పూర్తయి రైళ్లరాకపోకలు ప్రారంభం అయితే...మూడు రకాల రైళ్ల రాకపోకలకు ఈ ప్రాంతం నిలయంగా మారుతుంది. సాధారణ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్లు ఈ ప్రాంతంలోని లెవల్ క్రాసింగ్‌లు, వంతెలనపై ప్రతినిత్యం పరుగులు తీస్తున్నాయి. కొత్తగా సికింద్రాబాద్ నగరానికి వస్తున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రైళ్ల పరుగులు ముచ్చటగొలుపుతున్నాయి. -
ఎనీటైమ్ వాటర్..!
గ్రేటర్‌లోని 250 ప్రాంతాల్లో ఎనీటైమ్ నీటి యంత్రాలు ♦ రూ.1కే లీటర్ స్వచ్ఛమైన తాగునీరు.. ఫిబ్రవరిలో ప్రారంభం ♦ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లలో ఏర్పాటు ♦ అనుమతులు, వసతుల కల్పన బాధ్యతలు జీహెచ్ఎంసీకి ♦ నీటిసరఫరా బాధ్యత జలమండలిదే.. సాక్షి, హైదరాబాద్: బస్టాండ్లు.. రైల్వేస్టేషన్లు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో గుక్కెడు మంచినీళ్లు లభించడం గగనమే. మినరల్ వాటర్ కొనుగోలు చేయాలంటే లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20. ఇంత రేటు పెట్టి నీరు కొనలేక.. దాహార్తితో చాలామంది సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులకు చెక్ పడనుంది. గ్రేటర్ పరిధిలో రద్దీ ప్రాంతాలైన బస్టాండ్లు.. రైల్వేస్టేషన్లు.. ప్రభుత్వాసుపత్రుల్లో రూ.1కే లీటర్ స్వచ్ఛమైన మంచినీరు లభించనుంది. ఏటీఎంల తరహాలో ఎనీటైమ్ వాటర్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం గ్రేటర్ పరిధిలో 250 ఎనీటైమ్ వాటర్(ఏటీడబ్ల్యూ) యంత్రాలను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు అవసరమైన స్థలాల కేటాయింపు, ఇతర అనుమతుల జారీ ప్రక్రియను జీహెచ్ఎంసీకి.. ఈ యంత్రాలకవసరమైన నీటిని సమీప పైపు లైన్లు లేదా ట్యాంకర్లతో సరఫరా చేసే బాధ్య తను జలమండలికి అప్పగించారు. ఇప్పటికే జనజల్ సంస్థ ప్రయోగాత్మకంగా ఇందిరా పార్క్ వద్ద ఏటీడబ్ల్యూ యంత్రాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా జోసబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా ఈ యంత్రాల ఏర్పాటుకు ముందుకు రావడం విశేషం. ఎనీటైమ్ వాటర్‌తో ప్రయోజనాలివే.. ప్రైవేటు సంస్థలు లీటర్ బాటిల్ నీటిని రూ.20–రూ.25కు విక్రయిస్తుండగా.. రూ.1కే లీటరు స్వచ్ఛమైన తాగునీరు పొందవచ్చు. ఒక్కో యంత్రం ద్వారా ప్రాంతాన్ని, డిమాండ్‌ను బట్టి 500 నుంచి వెయ్యి లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించవచ్చు. కలుషిత తాగునీరు తాగి జనం రోగాల పాలయ్యే దుస్థితి తప్పుతుంది. దూరప్రాంత ప్రయాణికులు, నిరుపేదలు, అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన తాగునీరు పొందవచ్చు. ఈ యంత్రాల్లో జియోలైట్ మినరల్ సాంకేతికత, రివర్స్ ఆస్మోసిస్, అల్ట్రా వయోలెట్ ఫిల్ట్రేషన్ ద్వారా ఎలాంటి బ్యాక్టీరియా ఆనవాళ్లు.. దేహానికి హాని కలిగించే లోహాలను నీటిలో లేకుండా చేసే అవకాశం ఉంటుంది. నీటి వృథాను అరికట్టవచ్చు. కాయిన్ వేసిన వెంటనే లీటరు నీరు వచ్చి నల్లా ఆగిపోతుంది. తక్కువ ఖర్చు. సుమారు రూ.50–75 వేల ఖర్చుతో ఈ యంత్రాలు ఏర్పాటు చేయవచ్చు. ఈ యంత్రాల్లో సహజసిద్ధంగా దొరికే మినరల్స్‌నే వినియోగిస్తున్నందున నీటి నాణ్యతకు భరోసా ఉంటుంది. గ్రేటర్ తాగునీటి ముఖచిత్రం ఇలా.. గ్రేటర్ విస్తీర్ణం: 625 చదరపు కిలోమీటర్లు జనాభా: సుమారు కోటి నివాస సముదాయాలు: సుమారు 20 లక్షలు గ్రేటర్లో మురికివాడలు: 1,470 మొత్తం నల్లా కనెక్షన్లు: 9.05 లక్షలు రోజువారీ నీటి సరఫరా: 380 మిలియన్ గ్యాలన్లు వ్యక్తికి రోజువారీగా తలసరి నీటిలభ్యత.. ప్రధాననగరం(120 లీటర్లు).. శివారు ప్రాంతాలు (80 లీటర్లు) గ్రేటర్లో నీటిసరఫరా వ్యవస్థ లేని కాలనీలు, బస్తీలు: సుమారు 870 రోజూ గ్రేటర్లో ప్యాకేజి, మినరల్ నీటి వ్యాపారం: సుమారు 3.50 కోట్లు నీటి యంత్రాలు ఏర్పాటు చేసే ప్రదేశాలివే.. ఆస్పత్రులు: గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్, నయాపూల్ మెటర్నిటీ, సరోజినీ ఐ ఆస్పత్రి, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి బస్టాండ్లు: ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ బస్‌స్టేషన్ రైల్వే స్టేషన్లు: సికింద్రాబాద్, నాంపల్లి, కాచీగూడ. రద్దీ ప్రాంతాలు: హైటెక్‌సిటీ, కొండాపూర్, శిల్పారామం, కోఠి, కేబీఆర్పార్క్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, చందానగర్, టోలిచౌకి.. నీటి డిమాండ్‌ను బట్టి ప్రాంతాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏటీడబ్ల్యూ యంత్రాల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలు: జనజల్, జోసబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం ఏటీడబ్ల్యూ యంత్రాలున్న ప్రాంతాలు: ఇందిరా పార్క్(జనజల్ సంస్థ ఏర్పాటు చేసింది), కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో బొల్లారం, బోయిన్పల్లి, పికెట్ పార్క్ ప్రాంతాల్లో..