సికింద్రాబాద్ ఒలిఫెంటా సమీపంలో ఉక్కు వంతెనపై మెట్రోరైలు పరుగులు
సికింద్రాబాద్ ‘రైళ్లబాద్’ అయింది. ఈ ప్రాంతంలో ఎటు చూసినా రైళ్లేకన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 16 రైల్వేస్టేషన్ల నుంచి రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఇందులో రెండు సాధారణ, 8 మెట్రో, 6 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్ల నుంచి సగటున 3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్టు ఒక అంచనా. త్వరలో జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మెట్రో కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో జేబీఎస్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీఆసుపత్రి కేంద్రాలుగా మరో మూడు రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.క్రమేణా సికింద్రాబాద్ ప్రాంతం రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల సమాహారంగామారుతుంది.
సికింద్రాబాద్ :స్వాతంత్య్రానికి పూర్వం సైనిక బలగాల స్థావరాలతో సికింద్రాబాద్ విరాజిల్లింది. లష్కరులకు (జవాన్లకు) కేంద్రంగా ఉండడంతో ఈ ప్రాంతానికి లష్కర్ అనే పేరువచ్చింది. నాడు కంటోన్మెంట్ పరిధిలో రెజిమెంటల్ బజార్, బోట్స్ క్లబ్, ట్యాంక్‌బండ్, బేగంపేట్ ప్రాంతాలు సైనిక స్థావరాలకు కేంద్రాలుగా ఉండేవి. స్వాతంత్య్రానంతరం ఇక్కడి సైనిక స్థావరాలు శివారు ప్రాంతాలకు తరలించారు. ఆ తరువాత జనావాసాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా మారిన సికింద్రాబాద్ ప్రాంతం క్రమేణా రైల్వేస్టేషన్లకు కేంద్రంగా మారింది. సికింద్రాబాద్ ప్రతిష్టాత్మక రైల్వేస్టేషన్‌కు అనుబంధంగా 6 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఆవరించి ఉన్నాయి. సబర్బన్ రైళ్లకోసం లాలాగూడలో మరో రైల్వేస్టేషన్ ఉంది. తాజాగా ఎనిమిది మెట్రో స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి.
ఆరు ఎంఎంటీఎస్ స్టేషన్లు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఇరువైపుల 6 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఒకవైపు జామైఉస్మానియా, ఆర్ట్స్ కళాశాల, సీతాఫల్‌మండి మరొకవైపు జేమ్స్‌స్ట్రీట్, సంజీవయ్యపార్కు, బేగంపేట ఎంఎంటీఎస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న 130 వరకు ఎంఎంటీఎస్ రైళ్లలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా, లింగంపల్లి, హైదరాబాద్ మార్గాలకు ఈ స్టేషన్ల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న లాలాగూడ రైల్వేస్టేషన్ నుంచి సబర్బన్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి.
ఎనిమిది మెట్రో స్టేషన్లు
తార్నాక మొదలుకొని బేగంపేట వరకు తాజాగా మెట్రో రైళ్ల కోసం ఎనమిది మెట్రో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ ఈస్ట్, పరేడ్‌గ్రౌండ్, రసూల్‌పుర, ప్రకాశ్‌నగర్, బేగంపేట కేంద్రాలుగా మెట్రోస్టేషన్లు ఏర్పాటయ్యాయి. త్వరలో జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో జేబీఎస్, సికింద్రాబాద్ స్టేషన్, గాంధీ ఆసుపత్రి కేంద్రాలుగా మరో మూడు మెట్రో స్టేషన్లు అందుబాటులోకి
రానున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా వంతెనలు
సికింద్రాబాద్‌లో మెట్రో నిర్మాణాలు వినూత్న పద్ధతుల్లో ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతానికి కొత్తరూపు తెచ్చాయి. అంతేకాదు ప్రయాణికులకు కనువిందు చేస్తున్నాయి.
♦ సికింద్రాబాద్ రెతిఫైల్ బస్‌స్టేషన్ పక్కన ఒలిఫెంటా వంతెన ఉంది. వంతెన కిందినుంచి వాహనాలు, మీదినుంచి రైళ్ల రాకపోకలు ఉంటున్నాయి. ఈ వంతెనపై నుంచి కొత్తగా ఎత్తైన మెట్రోరైలు వంతెనను ఏర్పాటు చేశారు. ఒలిఫెంటా వంతెన పైన మరింత ఎత్తులో స్టీలు వంతెనను అమర్చి రెండు మార్గాలను అనుసంధానం చేశారు.
♦ సికింద్రాబాద్ వైఎంసీఏ కూడలి. ఇక్కడ వాహనాల రాకపోకల కోసం హరిహర కళాభవన్ ఫ్లై ఓవర్ ఉంది. వైఎంసీఏ నుంచి నాగోల్–అమీర్‌పేట్ వెళ్లే మెట్రోరైళ్ల కోసం ఇక్కడి ఫ్లై ఓవర్‌కు సమాంతరంగా మెట్రో కారిడార్‌ను నిర్మించారు. రెండు సమాంతర వంతెనలు ఉండగానే ఫలక్‌నుమా–జేబీఎస్‌కు మెట్రోరైళ్లు రాకపోకల కోసం రెండు వంతెనల పై నుంచి మరో మెట్రో కారిడార్‌ను నిర్మించారు.
♦ మెట్టుగూడ–సికింద్రాబాద్ మెట్రో కారిడార్‌ను ఆలుగడ్డబావి రైల్వే వంతెన మీదుగా నిర్మించారు. ఎత్తైన పొడవాటి పిల్లర్లతో నిర్మించిన ఇక్కడి మెట్రో కారిడార్ ఆకట్టుకుంటుంది.
ఎటు చూసినా పరుగులే...
సికింద్రాబాద్‌లో ఏ రహదారికి వెళ్లినా రైల్వేస్టేషన్లు నెలకొని ఉన్నాయి. అంతేకాదు ఈ ప్రాంతంలోని వంతెనలపై మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్ల పరుగులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మెట్రో సెకండ్ ఫేజ్ కారిడార్ల నిర్మాణం పూర్తయి రైళ్లరాకపోకలు ప్రారంభం అయితే...మూడు రకాల రైళ్ల రాకపోకలకు ఈ ప్రాంతం నిలయంగా మారుతుంది. సాధారణ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్లు ఈ ప్రాంతంలోని లెవల్ క్రాసింగ్‌లు, వంతెలనపై ప్రతినిత్యం పరుగులు తీస్తున్నాయి. కొత్తగా సికింద్రాబాద్ నగరానికి వస్తున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రైళ్ల పరుగులు ముచ్చటగొలుపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment