ఎనీటైమ్ వాటర్..!
గ్రేటర్‌లోని 250 ప్రాంతాల్లో ఎనీటైమ్ నీటి యంత్రాలు
♦ రూ.1కే లీటర్ స్వచ్ఛమైన తాగునీరు.. ఫిబ్రవరిలో ప్రారంభం
♦ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లలో ఏర్పాటు
♦ అనుమతులు, వసతుల కల్పన బాధ్యతలు జీహెచ్‌ఎంసీకి
♦ నీటిసరఫరా బాధ్యత జలమండలిదే..
సాక్షి, హైదరాబాద్: బస్టాండ్లు.. రైల్వేస్టేషన్లు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో గుక్కెడు మంచినీళ్లు లభించడం గగనమే. మినరల్ వాటర్ కొనుగోలు చేయాలంటే లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20. ఇంత రేటు పెట్టి నీరు కొనలేక.. దాహార్తితో చాలామంది సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులకు చెక్ పడనుంది. గ్రేటర్ పరిధిలో రద్దీ ప్రాంతాలైన బస్టాండ్లు.. రైల్వేస్టేషన్లు.. ప్రభుత్వాసుపత్రుల్లో రూ.1కే లీటర్ స్వచ్ఛమైన మంచినీరు లభించనుంది. ఏటీఎంల తరహాలో ఎనీటైమ్ వాటర్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం గ్రేటర్ పరిధిలో 250 ఎనీటైమ్ వాటర్(ఏటీడబ్ల్యూ) యంత్రాలను ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ, జలమండలి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు అవసరమైన స్థలాల కేటాయింపు, ఇతర అనుమతుల జారీ ప్రక్రియను జీహెచ్‌ఎంసీకి.. ఈ యంత్రాలకవసరమైన నీటిని సమీప పైపు లైన్లు లేదా ట్యాంకర్లతో సరఫరా చేసే బాధ్య తను జలమండలికి అప్పగించారు. ఇప్పటికే జనజల్ సంస్థ ప్రయోగాత్మకంగా ఇందిరా పార్క్ వద్ద ఏటీడబ్ల్యూ యంత్రాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా జోసబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా ఈ యంత్రాల ఏర్పాటుకు ముందుకు రావడం విశేషం.
ఎనీటైమ్ వాటర్‌తో ప్రయోజనాలివే..
ప్రైవేటు సంస్థలు లీటర్ బాటిల్ నీటిని రూ.20–రూ.25కు విక్రయిస్తుండగా.. రూ.1కే లీటరు స్వచ్ఛమైన తాగునీరు పొందవచ్చు.
ఒక్కో యంత్రం ద్వారా ప్రాంతాన్ని, డిమాండ్‌ను బట్టి 500 నుంచి వెయ్యి లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించవచ్చు.
కలుషిత తాగునీరు తాగి జనం రోగాల పాలయ్యే దుస్థితి తప్పుతుంది.
దూరప్రాంత ప్రయాణికులు, నిరుపేదలు, అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన తాగునీరు పొందవచ్చు.
ఈ యంత్రాల్లో జియోలైట్ మినరల్ సాంకేతికత, రివర్స్ ఆస్మోసిస్, అల్ట్రా వయోలెట్ ఫిల్ట్రేషన్ ద్వారా ఎలాంటి బ్యాక్టీరియా ఆనవాళ్లు.. దేహానికి హాని కలిగించే లోహాలను నీటిలో లేకుండా చేసే అవకాశం ఉంటుంది.
నీటి వృథాను అరికట్టవచ్చు. కాయిన్ వేసిన వెంటనే లీటరు నీరు వచ్చి నల్లా ఆగిపోతుంది.
తక్కువ ఖర్చు. సుమారు రూ.50–75 వేల ఖర్చుతో ఈ యంత్రాలు ఏర్పాటు చేయవచ్చు.
ఈ యంత్రాల్లో సహజసిద్ధంగా దొరికే మినరల్స్‌నే వినియోగిస్తున్నందున నీటి నాణ్యతకు భరోసా ఉంటుంది.
గ్రేటర్ తాగునీటి ముఖచిత్రం ఇలా..
గ్రేటర్ విస్తీర్ణం: 625 చదరపు కిలోమీటర్లు
జనాభా: సుమారు కోటి
నివాస సముదాయాలు: సుమారు 20 లక్షలు
గ్రేటర్‌లో మురికివాడలు: 1,470
మొత్తం నల్లా కనెక్షన్లు: 9.05 లక్షలు
రోజువారీ నీటి సరఫరా: 380 మిలియన్ గ్యాలన్లు
వ్యక్తికి రోజువారీగా తలసరి నీటిలభ్యత.. ప్రధాననగరం(120 లీటర్లు).. శివారు ప్రాంతాలు (80 లీటర్లు)
గ్రేటర్‌లో నీటిసరఫరా వ్యవస్థ
లేని కాలనీలు, బస్తీలు: సుమారు 870
రోజూ గ్రేటర్‌లో ప్యాకేజి,
మినరల్ నీటి వ్యాపారం: సుమారు 3.50 కోట్లు
నీటి యంత్రాలు ఏర్పాటు చేసే ప్రదేశాలివే..
ఆస్పత్రులు: గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్, నయాపూల్ మెటర్నిటీ, సరోజినీ ఐ ఆస్పత్రి, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి
బస్టాండ్లు: ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్
రైల్వే స్టేషన్లు: సికింద్రాబాద్, నాంపల్లి, కాచీగూడ.
రద్దీ ప్రాంతాలు: హైటెక్‌సిటీ, కొండాపూర్, శిల్పారామం, కోఠి, కేబీఆర్‌పార్క్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, చందానగర్, టోలిచౌకి.. నీటి డిమాండ్‌ను బట్టి ప్రాంతాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఏటీడబ్ల్యూ యంత్రాల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలు: జనజల్, జోసబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ప్రస్తుతం ఏటీడబ్ల్యూ యంత్రాలున్న ప్రాంతాలు: ఇందిరా పార్క్(జనజల్ సంస్థ ఏర్పాటు చేసింది), కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో బొల్లారం, బోయిన్‌పల్లి, పికెట్ పార్క్ ప్రాంతాల్లో..