ఫ్రాన్స్ ప్రతీకార దాడులు
♦ సిరియాలోని ఐఎస్ స్థావరాలపై దాడులు
♦ ‘పారిస్’ ఉగ్రవాదుల కోసం ఫ్రాన్స్‌లో, బెల్జియంలో వేట
♦ మృతులకు నివాళిగా మౌనం పాటించిన యూరోప్
పారిస్: పారిస్‌లో మారణహోమం సృష్టించి, 129 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులపై ఫ్రాన్స్ సహా అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందిస్తోంది. అనుమానిత ఉగ్రవాద స్థావరాలు, వ్యక్తులపై సోమవారం ఫ్రాన్స్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ స్థావరాల పై ఆదివారం రాత్రి నుంచి బాంబుల వర్షం కురిపించింది. పారిస్ మృతులకు నివాళిగా ఫ్రాన్స్‌లోనూ, ఇతర యూరప్ దేశాల్లోనూ ప్రజలు సోమవారం మధ్యాహ్నం ఒకే సమయంలో నిమిషం పాటు మౌనం పాటించారు. సార్బాన్ యూనివర్సిటీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ తన కేబినెట్ సహచరులు, విద్యార్థులతో కలసి పారిస్ మృతులకు నివాళులర్పించారు. పారిస్‌పై దాడిలో పాల్గొన్న మరో ఇద్దరిని పోలీసులు గుర్తించారు.
వారిలో గతంలో ఉగ్రవాద కేసును ఎదుర్కొన్న ఫ్రెంచ్ వ్యక్తి ఒకరు కాగా, మరొక ఆత్మాహుతికి పాల్పడిన మరో ఉగ్రవాది వద్ద సిరియా పాస్‌పోర్ట్ లభించింది. ఫ్రాన్స్‌లోని లియన్ నగరంలోని ఓ స్థావరంలో పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దాడుల నేపథ్యంలో 23 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు, ఈ దారుణ దాడుల ప్రభావం నుంచి ఫ్రాన్స్ నెమ్మదిగా తేరుకుంటోంది. స్కూళ్లు, హోటళ్లు, దుకాణ సముదాయాలు తెరుచుకున్నాయి. సిరియాలోని రఖాలో ఉన్న ఐఎస్ శిక్షణా కేంద్రం, ఆయుధాగారం, కమాండ్ పోస్ట్ మొదలైన వాటిపై ఫ్రాన్స్ యుద్ధవిమానాలు దాడులు చేశాయి.
దాడికి రూపకల్పన బెల్జియంలోనే జరిగిందన్న వార్తల నేపథ్యంలో.. బెల్జియం పోలీసులు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో బ్రసెల్స్‌కు చెందిన ముగ్గురు సోదరులు పాలు పంచుకున్నట్లుగా భావిస్తున్నామని, వారిలో ఒకరు ఆత్మాహుతిదాడిలో చనిపోగా, మరొకరిని అరెస్ట్ చేశామని, మూడోవాడైన సలాహ్ అబ్దెల్లామ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. అబ్దెల్లామ్ ఫొటోను విడుదల చేశారు. అబ్దేస్లామ్ను పట్టుకోవడంలో పోలీసులు విఫలమైనట్లు తెలుస్తోంది. పారిస్‌లోని బటాక్లాన్ థియేటర్ వద్ద దాడులకు తెగబడి 89 మంది మృతికి కారణమైన ఉగ్రవాదుల్లో ఇద్దరిని పారిస్‌కు చెందిన ఇస్మాయిల్ మొస్తెఫాయి(29), సామీ అమీమోర్(28) గుర్తించినట్లు తెలిపారు. మొస్తెఫాయి గురించి గతంలో మూడుసార్లు ఫ్రాన్స్‌ను హెచ్చరించామని టర్కీ తెలిపింది. ఫ్రాన్స్ నేషనల్ స్టేడియం వద్ద ఆత్మాహుతికి పాల్పడినఅహ్మద్ మొహమ్మద్ వద్ద సిరియా పాస్‌పోర్ట్ లభించింది. మూడు రోజులుగా మూతపడిన ఈఫిల్ టవర్‌ను మళ్లీ తెరిచారు.
ఐఎస్‌పై మరింత సమన్వయంతో దాడులు
పారిస్ దాడుల ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని జీ 20 దేశాలు మరోసారి స్పష్టం చేశాయి. ఐఎస్‌పై మరింత మెరుగైన సమన్వయంతో దాడులు చేయాలని ఆ దేశాలు నిర్ణయించాయి. జీ 20 సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర యూరోప్ దేశాల నాయకులతో సమావేశమై సిరియాపై, ఐఎస్‌పై చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణను చర్చించారు. భద్రతా చర్యలపై చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ హోం మంత్రులు శుక్రవారం భేటీ కానున్నారు. కాగా, బ్రిటన్‌లో గత నెలల్లో ఏడు ఉగ్రవాద దాడుల కుట్రలను భగ్నం చేశామని ఆ దేశ ప్రధాని కామెరాన్ చెప్పారు. సిక్కు సంతతికి చెందిన కెనడా జర్నలిస్టు వీరీందర్ జబ్బాల్ ఫొటోను పారిస్ దాడులకు పాల్పడిన ఉగ్రవాది ఫొటోగా పేర్కొంటూ లా రజాన్ అనే స్పానిష్ పత్రిక అచ్చేసింది. ఈ ఫొటో మార్పులు చేసిన ఫొటో అని తేలింది. దీంతో పత్రిక క్షమాపణ చెప్పింది.
పట్టుకుని వదిలేశారు..
పారిస్ దాడుల అనంతరం మరో ఇద్దరితో కలసి కారులో బెల్జియం వైపు పారిపోతున్న దాడుల ముఖ్య సూత్రధారి సలేహ్ అబ్దేస్లామ్ను ఫ్రాన్స్ పోలీసులు పట్టుకుని వదిలేశారు. దాడుల తరువాత ఉగ్రవాదులు దేశం విడిచి పారిపోకుండా సరిహద్దుల వద్ద క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ అప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అయినా, అబ్దేస్లామ్ను వారు అదుపులోకి తీసుకోలేదు. అబ్దేస్లామ్ ప్రయాణిస్తున్న కారును ఆపిన స్థానిక పోలీసులు (వీరిని జెండార్మ్స్ అని పిలుస్తారు), వారిని ప్రశ్నించి, వారి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి వదిలేశారు. ఆ తరువాత వారు ఫ్రాన్స్ సరిహద్దులు దాటి బెల్జియం పారిపోయారు. అయితే, ఆ పోలీసుల వద్ద అబ్దేస్లామ్ గురించిన సమాచారం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.