వివరాలు వెల్లడించాల్సిందే!
అధికారులకు సంబంధించిన వివరాలపై సీఐసీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా రాజకీయ కార్యనిర్వాహక వ్యవస్థకు, అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు వెల్లడించాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఉద్ఘాటించింది. హరియాణాకు చెందిన ప్రజావేగు (విజిల్ బ్లోయర్) ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది విషయంలో సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకు, ప్రధాని కార్యాలయానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను వెల్లడించాల్సిందిగా కేంద్రాన్ని ఓ ఉత్తర్వులో ఆదేశించింది. వ్యక్తిగత విషయాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావన్న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వాదనలను కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ తిరస్కరించారు.
ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగ్రవాల్ పిటిషన్ విచారణ సందర్భంగా.. నిజాయతీగా పనిచేసే అధికారులు ఎదుర్కొనే రాజకీయ ఒత్తిళ్లను బహిర్గతం చేయాల్సిందేనని, ఇది వారి రక్షణకు సంబంధించిన విషయమని సీఐసీ స్పష్టం చేసింది. హరియాణా ప్రభుత్వం నుంచి చతుర్వేది వేధింపులకు గురయినట్లు అగ్రవాల్ పేర్కొన్నారు. అయితే ఈ అంశానికి సంబంధించిన సమాచారం బహిర్గత పరిచేందుకు నిరాకరించడం చట్ట వ్యతిరేకమని పేర్కొంది. ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారిగా ఉన్న చతుర్వేదిని వైద్యశాఖ తొలగించింది. ఝాంఝర్లోని హెర్బల్ పార్క్ కుంభకోణంలోని అధికారుల పాత్రను బయట పెట్టినందుకే ఉద్యోగం నుంచి తొలగించారని క్యాట్ ముందు వాపోయారు.