transco emplayee
-
కోరిక తీరిస్తే.. అండగా ఉంటా!
అనంతపురం క్రైం: ఓ వితంతువుపై ట్రాన్స్‌కో ఉద్యోగి కన్నేశాడు. తన కోరిక తీరిస్తే కుటుంబానికి అండగా ఉంటానంటూ వెంటపడుతున్నాడు. తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటానే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగే ప్రసక్తే లేదని ఆమె తెగేసి చెప్పింది. అయినా ఆ ఉద్యోగి వేధింపులు ఆపడం లేదు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను అనంతపురం టూటౌన్ సీఐ రాఘవన్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. శారదనగర్‌లో ఉంటున్న ఓ మహిళ భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. భర్త మరణానంతరం కుటుంబ భారం ఆమెపై పడింది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారికి సపర్యలు చేసి.. వచ్చే సంపాదనతో పిల్లలను పోషించుకుంటోంది. నడిమివంక ప్రాంతంలో నివాసముంటున్న వితంతు తల్లికి నాలుగోరోడ్డులో నివాసముంటున్న ట్రాన్స్‌కో కార్యాలయ అటెండర్ అబ్దుల్ నబీసాబ్ పరిచయముంది. అలా అన్ని విషయాలూ తెలుసుకున్న ఇతడు వితంతువుపై మోజుపడ్డాడు. తన కోరిక తీరిస్తే ఆమె కుటుంబ బాగోగులు చూసుకుంటానని నమ్మబలికాడు. ఇందుకు వితంతువును ఒప్పించే విషయంలో తల్లి కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఇందుకు వితంతువు ససేమిరా ఒప్పుకోలేదు. నెల రోజుల క్రితం అబ్దుల్ నబీసాబ్ వితంతువు ఇంటికి వెళ్లి ఒప్పుకోవాలంటూ బలవంతపెట్టాడు. ఆమె ఈసారి ఘాటుగానే సమాధానమిచ్చింది. తాను ఇళ్లల్లో పని చేసుకునైనా పిల్లలను పోషించుకుంటాను తప్ప నీలాంటి వాడితో ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మరోసారి వెంటపడి వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. అయినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ వేధింపులకు దిగుతుండటంతో వితంతువు టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రాఘవన్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు ఎస్ఐ అల్లా బకాష్ విచారణ చేపట్టిన అనంతరం ట్రాన్స్‌కో ఉద్యోగి అబ్దుల్ నబీసాబ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వితంతు తల్లిపైనా కేసు నమోదు చేశారు. (చదవండి: ఆహార భద్రత చట్టం అమలు బాధ్యత అధికారులదే..) -
మీరు ఫైన్ వేస్తే..మేము లైన్ కట్ చేస్తాం
పెద్దపల్లి: ఎవరి అధికారం వారిది. ఎవరి డ్యూటీ వారిదేనంటూ ట్రాఫిక్ పోలీసులు, ట్రాన్స్‌కో ఉద్యోగులు నిరూపించుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రలో ట్రాఫిక్ పోలీసు, ట్రాన్స్‌కో ఉద్యోగుల మధ్య శుక్రవారం విధి నిర్వహణ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఓ ట్రాన్స్‌కో ఉద్యోగికి ట్రాఫిక్ పోలీసులు నిబంధనల పేరిట రూ.2 వేల జరిమానా విధించారు. తాను ఉద్యోగిని అంటూ చెప్పినప్పటికీ పోలీసులు జరిమానా విధించారు. దీంతో ఆగ్రహించిన ట్రాన్స్‌కో ఉద్యోగి.. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మరీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ బకాయి సంగతేందంటూ నిలదీశాడు. వెంటనే ట్రాన్స్‌కో సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బకాయి చెల్లించండి సార్ అంటూ ప్రశ్నించారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని, కరెంట్ స్తంభం ఎక్కి లైన్‌కట్ చేసి వెళ్లారు. పైఅధికారులు ట్రాన్స్‌కో సిబ్బందిని మందలించడంతో తిరిగి సాయంత్రం వరకు ట్రాఫిక్ ఠాణాలో లైట్లు వెలిగాయి. ఈ విషయమై ట్రాఫిక్ సీఐ బాబురావు వివరణ ఇస్తూ.. కరెంటు పాత వైరు మార్చివేసి కొత్త వైరు ఏర్పాటు చేశారని, ఇందులో అపోహాలకు తావులేదన్నారు. -
ట్రాన్స్‌కో ఉద్యోగి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: నగరంలో హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న ట్రాన్స్‌కో చిరుద్యోగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. ట్రాన్స్‌కోలో పోల్ టూ పోల్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సుధాకర్(35) ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలం నుంచి సుధాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టడంతో అప్పులపాలయ్యాడు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.