ఇదే కదా సుపరిపాలన
సాక్షి, విశాఖపట్నం : ‘ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2.18 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. ప్రజలకవసరమైన అన్ని సేవలనూ అందుబాటులోకి తెచ్చారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. విలేజి/అర్బన్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటుచేశారు. ఫ్యామిలీ డాక్టర్ సదుపాయాన్ని కల్పించారు. పారిశ్రామికంగానూ ఎంతో అభివృద్ధి చేశారు.
ఇవేకాదు.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు ఇంకెన్నో సంక్షేమ పథకాలను అవినీతికి ఆస్కారంలేకుండా అందజేస్తున్నారు. ఇదేకదా సుపరిపాలన అంటే?’.. అని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం చెప్పారు. విశాఖలోని ఓ హోటల్లో ఆదివారం జరిగిన ‘ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్’ అనే సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక 17 వైద్య కళాశాలలు వస్తే ఇప్పుడు 17 ఏర్పాటుకానున్నాయని.. ఇందులో ఐదింటి నిర్మాణం, అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిపాలన, చేపట్టిన సంస్కరణలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అజేయ కల్లాం చెప్పారు.
ప్రభుత్వోద్యోగుల జీతాలు ఇక్కడే ఎక్కువ..
దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వోద్యోగుల జీతాలు ఏపీలోనే ఎక్కువని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పోలిస్తే 30 శాతం అధికమని ఆయన తెలిపారు. ఏపీలో 2014లో ప్రభుత్వోద్యోగుల జీతాల చెల్లింపులు రూ.18,709 కోట్లుంటే 2023–24లో అది రూ.57,222 కోట్లకు పెరిగిందన్నారు. ఏపీకంటే రెట్టింపు ఉన్న మధ్యప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల జీతాలు రూ.48 వేల కోట్లేనని చెప్పారు. ఉద్యోగుల అలవెన్సులు, పెండింగ్ క్లియరెన్సుపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని అజేయ కల్లాం తెలిపారు.
2.18 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు..
ఇక ఈ ఐదేళ్లలో 2.18 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు వచ్చాయని, వీరిలో 1.35 లక్షల మంది సచివాలయాల ఉద్యోగులేనన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 13 వేల మందికే ఉద్యోగ నియామకాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ ఊరూరా సచివాలయాలను ఏర్పాటుచేసి రాష్ట్రస్థాయి సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకొచ్చారన్నారు.
ఈ వ్యవస్థలో జరుగుతున్న అద్భుతాలను చూసి తమిళనాడు, కేరళ సహా మరికొన్ని రాష్ట్రాలు అమలుకు సన్నాహాలు చేస్తున్నాయని.. పాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటుజరుగుతోందన్నారు. అలాగే.. సుదీర్ఘకాలంగా ఉన్న భూ వివాదాల పరిష్కారానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్టును అమలుచేస్తున్నారన్నారు. ఇప్పుడు మరో 12 రాష్ట్రాలు దీని అమలుకు ప్రయత్నిస్తున్నాయని అజేయ కల్లాం చెప్పారు. ఈ విషయంలో కొంతమంది న్యాయవాదులు సృష్టిస్తున్న ఆపోహలను నమ్మొద్దని ఆయన కోరారు.
31లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు..
ఇదిలా ఉంటే.. మరే రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, పథకాలు అందజేస్తున్న ఘనత ఒక్క మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు, హార్బర్లు, ఐటీలు, పరిశ్రమలు వస్తున్నాయని.. మరే రాష్ట్రానికి రాని విధంగా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీలో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని అజేయ కల్లాం చెప్పారు. ఇలాఅన్నిటా గత ప్రభుత్వాలకంటే ఎన్నో రెట్లు మెరుౖగెన సుపరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరుగుతోందని.. ఈ సుపరిపాలనపై ప్రజలే మంచి తీర్పునిస్తారన్నారు. ఈ సదస్సులో సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ బాలమోహన్దాస్, డా.బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ సుధాకర్, కార్తీక్, పలువురు మేధావులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
రైతుల ఆత్మహత్యలే ఆలోచింపజేశాయి
‘1997లో ఏపీలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరి ఆత్మహత్యలకు కారణాలపై అప్పటి ముఖ్య కార్యదర్శి జన్నత్ హుస్సేన్ నేతృత్వంలో జరిపిన దర్యాç³#్తలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైతు పంట పెట్టుబడికి రూ.10 వేలు అప్పుచేస్తే రూ.3 లక్షలు చెల్లించాల్సి వస్తోందని, అప్పుల భారంతో పిల్లలను చదివించలేకపోతున్నారని, ఆరోగ్య సమస్యలకు రూ.వేలల్లో, పిల్లల పెళ్లిళ్లకు లక్షల్లో అప్పులు చేయాల్సి వస్తోందని, వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. ఈ వాస్తవాలను మహానేత వైఎస్ గుర్తించారు. సీఎం అయ్యాక దీనిపై ఆలోచించి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటివి అమలుచేశారు’ అని అజేయ కల్లాం వివరించారు.