ప్రమాద ఘంటికలు
సాక్షి, గుంటూరు: చేతికందే ఎత్తులో వేలాడుతున్న విద్యుత్తు తీగలు.. ఒరిగిపోయి ఎప్పుడు కూలతాయో తెలియని స్తంభాలు.. రక్షణ లేని ట్రాన్సఫార్మర్లు.. తెరచి ఉన్న ఫ్యూజు బాక్సులు..జిల్లాలో ఏ మూల చూసినా ఇవే దృశ్యాలు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వినియోగదారుల నుంచి ముక్కు పిండి బిల్లులు వసూలు చేసే అధికారులు తదనుగుణమైన సేవలు అందించడంలో పూర్తి నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. చిన్నపాటి మరమ్మతులు చే సి సకాలంలో సమస్య పరిష్కరించే వీలున్నా.. సిబ్బంది ఆదిశగా ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మంగళగిరి మండలం కాజలో కిందకు వేలాడుతున్న విద్యుత్తు తీగలను తప్పించబోయి ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన విద్యుత్‌శాఖ నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినా అధికారుల వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. కొత్తగా ఏర్పాటు చేసే స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నాణ్యత లేవని విజిలెన్స్ విభాగం నిర్ధరించి నివేదికలిస్తూనే ఉంది.
గతంలో ట్రాన్స్ఫార్మర్లు దిమ్మెలపై ఉంచి తక్కువ ఎత్తులో ఉంచారు. రోడ్ల అభివృద్ధిలో ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలు కింద వరకు ఉండటంతో వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
పర్యవేక్షణ లేకే ప్రమాదాలు..
జిల్లాలో విద్యుత్తు బిల్లుల రూపేణా నెలకు రూ.169 కోట్ల డిమాండ్ ఉండగా రూ.165 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. కరెంటు బిల్లుల వసూలుపై చూపిస్తున్న శ్రద్ధ సేవలు అందించడంలో మాత్రం కనబర్చడం లేదు. జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 30,058 ఉంటే పది వేల ట్రాన్స్ఫార్మర్లకు అసలు కంచెలే లేవు. 11 కేవీ ఫీడర్లు 584 ఉంటే, వీటిలో ఎక్కువ భాగం నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి. ఫ్యూజు బాక్సులు తెరచి ప్రమాదకరంగా ఉన్నాయి. కార్యాలయాల్లో బాక్సులు ఖాళీగా ఉన్నా వాటిని బిగించేందుకు సిబ్బంది చొరవ చూపడం లేదు. పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించడం, వాటిపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు నగరంతో పాటు, జిల్లాలోని మునిసిపాలిటీల్లో విద్యుత్తు సేవలు అథమంగా ఉన్నాయి.