‘నేనూ పెళ్లికి పనికొస్తా.. తల్లినవుతా’
- వ్యక్తితో ట్రాన్స్‌జెండర్ వివాహం
- వేడుకకు భారీగా తరలివచ్చిన జనం
భువనేశ్వర్: నగర మేయర్, బంధుమిత్రులు ఆశీర్వదిస్తుండగా.. వేదమంత్రాలు సాక్షిగా.. మేఘన అనే ట్రాన్స్‌జెండర్ తనకు నచ్చిన వసుదేవ్ అనే వ్యక్తిని మనువాడింది. చట్టరీత్యా చెల్లుబాటు కానప్పటికీ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. దేశంలోనే అరుదైన ఈ సంఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
భువనేశ్వర్‌కు చెందిన వసుదేవ్‌కు ఇదివరకే ఓ మహిళతో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అతని భార్య చెప్పాపెట్టకుండా ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. పిల్లల్ని చూసుకుంటూ కాలం గడుపుతున్న వసుదేవ్‌కు ఫేస్బుక్ ద్వారా ట్రాన్స్‌జెండర్ మేఘన పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారు. మొదట అభ్యంతరం తెలిపినా, చివరికి ఇరు కుటుంబాలూ అంగీకారం తెలపడంతో శుక్రవారం ఘనంగా పెళ్లిచేసుకున్నారు.
‘సమాజంలో ట్రాన్స్జెండర్లను చిన్నచూపు చూస్తున్నారు. పెళ్లికి పనికిరామని, తల్లులం కాలేమని అసహ్యించుకుంటున్నారు. వాళ్లందరికీ ఈ పెళ్లి ద్వారా ఒకటే సమాధానం చెబుతున్నా.. నేనూ పెళ్లికి పనికొస్తా.. వాసుదేవ్ పిల్లలకు తల్లిని అవుతా’ అని పెళ్లికూతురు మేఘన మీడియాతో అన్నారు. తనను కోడలిగా స్వీకరించిన వరుడి కుటుంబానికి మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. భువనేశ్వర్ నగర మేయర్ అనంత నారాయణ్ సహా పలువురు ప్రముఖులు కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ అరుదైన పెళ్లి బరాత్‌లో పెద్ద సంఖ్యలో స్థానిక యువత డ్యాన్సులు చేశారు.
ట్రాన్స్జెండర్లపై మూడేళ్ల కిందట కీలక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఓటరు నమోదు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపుకార్డుల్లో వారికి(ట్రాన్స్జెండర్లకు) ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఈ పెళ్లికి చట్టబద్ధత లేదని ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం పోరాడుతోన్న న్యాయవాది చెప్పారు. ట్రాన్స్జెండర్ల వివాహాలను చట్టబద్ధం అయ్యేలా మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.