అవినీతిలో భారత్ నెంబర్ వన్
బెర్లిన్: భారతదేశం ఎంత అభివద్ధి చెందుతుందో ఏమోగాని అవినీతిలో మాత్రం దూసుకుపోతోంది. 16 ఆసియా పసిఫిక్ దేశాల్లో అవినీతిలో భారతదేశమే అగ్రస్థానంలో ఉందని ‘ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్’ అంతర్జాతీయ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. 0.2 శాతంతో జపాన్ అవినీతిలో ఆఖరి స్థానంలో ఉంది. దేశంలో అవినీతిని నిర్మూలించడమే తమ ప్రథమ కర్తవ్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉండటం ఒకింత ఆశ్చర్యాన్నిస్తోంది.
ప్రభుత్వ పనుల కోసం భారత్‌లో ప్రతి పదిమందిలో ఏడుగురు లంచాలు ఇచ్చినట్లు సర్వేలో తెలిపారు. భారత్, చైనా సహా మొత్తం 16 ఆసియా పసిఫిక్ దేశాల్లో ప్రభుత్వ అధికారులకు 90కోట్ల మంది లంచాలు ఇచ్చారు. అంటే, ప్రతి నలుగురిలో ఒకరు లంచం ఇచ్చే పనులు చేయించుకున్నారు. ఈ 16 దేశాల నుంచి 22వేల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించడం ద్వారా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే చేసింది. ఎప్పటి పరిస్థితో కాకుండా ఇప్పుడు లంచాలిచ్చిన వారి అభిప్రాయలనే పరిగణలోకి తీసుకుంది.
భారత్‌కన్నా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో కూడా అవినీతి ఎక్కువగానే ఉంది. గత మూడేళ్లలో దేశంలో అవినీతి పెరిగిందని, దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని చైనాలో మూడొంతుల మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. అవినీతిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వాలు మంచి చర్యలు తీసుకుంటున్నాయని భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాల ప్రజలు అభిప్రాయపడ్డారు. దక్షిణ కొరియా, హాంకాంగ్, మలేసియా, జపాన్ దేశాల ప్రజలు ఇందుకు భిన్నంగా అభిప్రాయపడ్డారు.
పోలీసుల అవినీతే ఎక్కువ
ఆసియా దేశాల్లో పోలీసుల్లోనే అవినీతి ఎక్కువని అభిప్రాయపడ్డారు. భారత పోలీసు అధికారుల్లో 54శాతం అవినీతి ఉన్నట్లు సర్వేలో తేలగా, అదే చైనాలో 12 శాతం ఉన్నట్లు తేలింది. భారత్‌లో పబ్లిక్ స్కూల్స్‌లో 58 శాతం, ఆరోగ్యరంగంలో 59శాతం అవినీతి ఉన్నట్లు వెల్లడైంది.