Treat ment
-
అత్యంత అరుదైన వ్యాధి నెమలైన్ మయోపతి
అత్యంత అరుదైన వ్యాధి నెమలైన్ మయోపతితో తన కూతుళ్లు అనుభవిస్తున్న బాధల గురించి భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ‘వైకల్యాలతో బాధపడుతూ జీవనం సాగిస్తున్న చిన్నారుల హక్కుల’పై ఏర్పాటైన తొమ్మిదో వార్షిక జాతీయ కన్సల్టేషన్’ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన కూతుళ్లు, అలాంటి వాళ్ల సమస్యలతో ఆ కుటుంబాల వాళ్లు ఎదుర్కొనే వాస్తవ సమస్యలూ, ఉద్వేగభరితమైన సవాళ్ల గురించి తెలియజేశారు. ‘‘మా పిల్లలు ‘నెమలైన్ మయోపతి’ అనే సమస్యతో పుట్టారు. మయోపతి సమస్య గురించి డాక్టర్లకే పూర్తిగా తెలియదంటే... ఇక వాళ్ల తల్లిదండ్రులూ, వారికి సేవలందించే వాళ్ల గురించి పెద్దగా చెప్పేదేముంటుంది. చాలా కుటుంబాల వాళ్లు దీని గురించి పెద్దగా ఆలోచించకుండా అంతా బాగుందనే భ్రమల్లో జీవిస్తుంటారు. మన దేశంలోని పెద్ద పెద్ద వైద్యవిజ్ఞాన సంస్థల్లోనూ ఈ కండిషన్‌కు నిర్వహించే పరీక్షలూ, నిర్ధారణ పరీక్షల సౌకర్యాలూ పెద్దగా లేవు. ఈ నెమలైన్ మయోపతీనే ‘రాడ్ మయోపతి’ అని కూడా అంటారు. ఇది పుట్టుకతోనే వచ్చే చాలా అరుదైన సమస్య. ఇందులో కండరాలు (స్కెలెటల్ మజిల్స్) క్రమంగా బలహీనంగా మారిపోతాయి. జన్యుపరమైన ఉత్పరివర్తనాల (జెనెటిక్ మ్యుటేషన్స్) కారణంగా వచ్చే ఈ సమస్యలో ముఖం, మెడ, ఛాతీలో కండరాలన్నీ క్రమంగా బలహీన పడుతూపోతాయి. (ఈ లోపం మినహా నా పిల్లలు ఇతర ఏ చిన్నారులతో ΄ోల్చినా తీసి΄ోనంత చురుకైన, మంచి తెలివితేటలు కలవారు). ఈ లోపం కారణంగా చిన్నారులకు ఆహారం తీసుకోవడంలో... శ్వాస తీసుకోవడంలో... ఇలా ప్రతి అంశంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. కండరాలన్నీ బలహీనపడటంతో ఏ పనీ చేసుకోలేని వైకల్యాలు ఏర్పడతాయి’’ అంటూ ఉద్వేగభరితమైన ప్రసంగంలో తెలిపారు.ఈ వ్యాధిని ఎదుర్కొనే తీరిది... ‘‘ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్స అందుబాటులో లేదు. ఇప్పుడున్న చికిత్స ప్రక్రియలు కేవలం లక్షణాలను తగ్గించడానికి మాత్రమే సహాయం చేస్తాయి. కండరాలు ఉన్నంతలో బాగా పనిచేసేందుకు ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ లాంటి వాటిని మాత్రమే డాక్టర్లు సూచిస్తుంటారు. దీనికితోడు వాళ్లు తమ ఆహారాన్ని తామే తీసుకునేవిధంగా, ఉచ్చారణ బాగుండేందుకు కొంత స్పీచ్ థెరపీ, ఉన్నంతలో వాళ్ల పనులు వాళ్లే చేసుకునే విధంగా వాళ్ల జీవన నాణ్యత మెరుగుపరచడం కోసం కొన్ని ఉపకరణాలు సహాయం తీసుకోవడం... ప్రస్తుతానికి ఇవి మాత్రమే అందుబాటులో ఉన్న పద్ధతులు. వీటి సహాయం తీసుకోవాలంటూ డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు’’ అని తెలిపారు చంద్రచూడ్.మరింత అవగాహన కావాలి... ఈ వ్యాధిపై ఇంకాస్త ఎక్కువ అవగాహన కావాలనీ, ప్రజల్లో దీని గురించి తెలియాల్సిన అవసరముందని చంద్రచూడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నెమలైన్ మయోపతి లాంటి వ్యాధుల విషయంలో మరింతగా మెరుగైన నిర్ధారణ పద్ధతులు రావాల్సిన అవసరముందని తెలిపారు. ఆయనా, ఆ కుటుంబ సభ్యులు, అమాయకులైన ఆ చిన్నారుల వెతలతో సహానుభూతి చెందిన వారెవరైనా... ఇలాంటి వ్యాధుల విషయంలో మరింత అవగాహన, వైద్యచికిత్సా పద్ధతుల్లో మరింత పురోగతి అవసరముందంటూ తప్పక చెబుతారనే అభి్ర΄ాయాలు సర్వత్రా వెల్లడవుతున్నాయి.నా చెల్లెలికి ఈ పరీక్ష వద్దు నాన్నా... నెమలైన్ మయోపతి గురించి వివరించే క్రమంలో దీని నిర్ధారణ కోసం తన కూతుళ్లకు ఎదురైన అత్యంత వేదనాభరితమైన క్షణాలను ఇలా వివరించారాయన. ‘‘ఈ వ్యాధిని నిర్ధారణ చేయాలంటే శరీర కణజాలంలోని చిన్న ముక్కను బయాప్సీ ద్వారా సేకరించాలి. ఇది అత్యంత బాధాకరమైన ప్రోసీజర్. ఇదెంత బాధాకరమంటే ఆ సందర్భంగా నా కూతురు నాతో అన్న మాటలు ఇప్పటికీ నన్ను ఆవేదనకు గురిచేస్తాయి.‘నాన్నా... నాకు నిర్వహిస్తున్న ఈ సీజర్ చెల్లెలికి ఎప్పటికీ చేయవద్దు నాన్నా’’ అంటూ అభ్యర్థించిన నా కూతురి మాటలు నా చెవుల్లో, హృదయంలో ప్రతిధ్వనిస్తుంటాయి’’ అని చెబుతూ ఉద్వేగానికి గురయ్యారాయన. ఇదే కాకుండా భౌతికంగా నిర్వహించే పరీక్షలూ, జన్యుపరమైన పరీక్షలూ, కండరాల బయాప్సీ (కండరపు ముక్క సేకరించి చేసే పరీక్ష)... వీటన్నింటి సహాయంతో నెమలైన్ మయోపతిని నిర్ధారణ చేస్తారని వివరించారు. (చదవండి: చేపలు మాత్రమే తింటు..ఏకంగా 15 కిలోల బరువు తగ్గిన మహిళ..!) -
అందం కోసం కొత్త దంతాలు.. ‘షార్క్’లా మారిన యువకుడు!
ప్రపంచంలో చాలామంది అందం కోసం విపరీతంగా తాపత్రయపడుతుంటారు. ఇందుకోసం ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటారు. కొందరు తమ దంతాలు సరిగా లేవంటూ, వాటికి హంగులు సమకూరుస్తారు. ఇటువంటి సందర్బాల్లో చికిత్స చేయించుకున్న కొందరి ముఖాలు భయంకరంగా మారిపోవడాన్ని మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇటువంటి మరో తాజా ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవలే డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్న ఒక యువకునికి ఎదురైన చేదు అనుభవం గురించి ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వివరించాడు. జాక్ జేమ్స్ కెమెరాలో అందంగా కనిపించాలనే ఉద్దేశంతో నకిలీ దంతాలు పెట్టించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం బ్రిటన్ నుంచి టర్కీకి వెళ్లాడు. £3,000( సుమారు రూ. 3 లక్షలు) వెచ్చించి నకిలీ దంతాలు పెట్టించుకున్నాడు. మొదట్లో ఈ దంతాలు అతని ముఖానికి ఎంతో అందాన్నిచ్చాయి. అయితే కొద్ది రోజుల తరువాత అతని దంతాల నుంచి రక్తం కారసాగింది. అలాగే నోటు నుంచి దుర్వాసన కూడా వెలువడసాగింది. దీంతో జాక్ జేమ్స్.. మాంచెస్టర్‌లోని ఒక డెంటిస్ట్‌ను సంప్రదించాడు. ఆ దంతవైద్యుడు పలుపరీక్షలు చేసిన అనంతరం అతని దంతాలు పూర్తిగా పాడయిపోయాయని చెప్పాడు. ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపాడు. ఆ దంతాలను తిరిగి సరిగా చేసేందుకు £20,000(సుమారు రూ. 20 లక్షలు) ఖర్చవుతాయని తెలిపాడు. ఇంగ్లండ్‌లో ఈ చికిత్సకు ఇంత భారీగా ఖర్చవుతుందని తెలుసుకున్న అతను తిరిగి గతంలో తనకు చికిత్స చేసిన టర్కీలోని డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ డెంటిస్ట్ అతనితో దంత చికిత్సలో తప్పేమీ జరగలేదని, అయితే తిరిగి దంతాలను సరి చేసుకోవాలంటే, మరోమారు చికిత్స చేయించుకోవాలని, ఇందుకు మరింత ఖర్చవుతుందని తెలిపాడు. మరో మార్గంలేక జాక్ అందుకు అంగీకరించాడు. నకిలీ దంతాలను తొలగించుకుని ఇన్ఫెక్షన్ దూరమయ్యేందుకు చికిత్స తీసుకున్నాడు. తరువాత కొత్తగా టెంపరరీ దంతాలను పెట్టించుకున్నాడు. అయితే అతను ఈ టెంపరరీ దంతాలను శుభ్రం చేసుకుంటున్నప్పుడు, అసలు దంతాలు షార్క్ దంతాలుగా మారిపోవడాన్ని గమనించాడు. అన్ని దంతాల మధ్య గ్యాప్ ఉండటాన్ని గుర్తించాడు. జాక్ తన దంతాలు చూసుకున్నప్పుడల్లా ఏదో హర్రర్ ఫిల్మ్‌లోని క్యారెక్టర్లా ఉన్నానని భావిస్తాడట. దీంతో అతనికి ఈ షార్క్ దంతాలను కూడా తొలగించుకోవాలని అనిపిస్తుందట. ఇందుకోసం మరో వైద్యుడిని సంప్రదించాలని అనుకుంటున్నానని జాక్ తెలిపాడు. ఇది కూడా చదవండి: తొలి హార్ట్ట్రాన్స్ ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆ రోజు జరిగిందిదే! -
పాంక్రియాటైటిస్ నుంచి కోలుకోవడం సాధ్యమే..
పాంక్రియాటైటిస్ అంటే పాంక్రియాస్ గ్రంథి అనారోగ్యం పాలుకావడం, ఇరిటేషన్‌కు, వాపుకు లోను కావడం అన్నమాట. పాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి. మనకు చిరపరిచితమైన డయాబెటిస్ వ్యాధి ఈ గ్రంథి పనితీరు లోపించడం వల్లనే వస్తుంది. పాంక్రియాస్ పనితీరు లోపం నుంచి పాంక్రియాటైటిస్‌కు దారి తీయడానికి అనేక కారణాలుంటాయి. వాటిలో ఆల్కహాలు సేవనం మితిమీరడం వల్ల కలిగే గాల్‌స్టోన్స్ ప్రధాన కారణం. అయితే ఇది అప్పటికప్పుడు ఎదురయ్యే అనారోగ్య సూచన కాదు, దీర్ఘకాలికంగా కొనసాగడంతో పాంక్రియాస్ పూర్తిగా దెబ్బతినడం వల్ల ఎదురయ్యే సమస్య. పాంక్రియాటైటిస్... వస్తే ఏమవుతుంది? జీర్ణరసాలలోని ఆమ్లగుణాల కారణంగా పాంక్రియాస్ టిస్యూలు దెబ్బతింటాయి. పాంక్రియాస్ అతి సున్నితమై (ఓవర్ సెన్సిటైజ్), ఎర్రగా మారుతుంది. ఈ స్థితిలోకి మారిన పాంక్రియాస్ ఆమ్ల స్వభావం కలిగిన కణాలను, విషపూరితమైన వ్యర్థాలను విడుదల చేస్తుంది. అవి ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండెకు హాని కలిగిస్తాయి. పాంక్రియాటైటిస్‌లో అక్యూట్, క్రానిక్ దశలుంటాయి. ఎవరెవరికి వస్తుంది? పాంక్రియాటైటిస్ సమస్యను ఎక్కువగా దీర్ఘకాలంగా డయాబెటిస్తో బాధపడుతున్న మగవారిలోనే చూస్తుంటాం. గాల్‌స్టోన్స్ ఉన్న వారికి, మద్యపానం మితిమీరి తీసుకునే వారికి, ధూమపానం చేసేవారికి రిస్క్ ఎక్కువ. అలాగే ఒబేసిటీ, రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ ఉన్న వారికి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. పాంక్రియాటైటిస్‌ను గుర్తించడం ఎలా? అక్యూట్ పాంక్రియాటైటిస్ని నిర్ధారించడానికి రక్తపరీక్ష చేస్తారు. ఇందులో జీర్ణక్రియకు దోహదం చేసే అమిలేజ్, లిపేజ్ అనే ఎంజైమ్‌ల స్థాయులను గుర్తిస్తారు. ఈ స్థాయులు ఎక్కువగా ఉంటే అక్యూట్ పాంక్రియాటైటిస్‌గా పరిగణిస్తారు. ∙అల్ట్రా సౌండ్ స్కానింగ్ లేదా కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ స్కాన్) ఇమేజ్ ద్వారా పాంక్రియాస్ ఆకారాన్ని, సంభవించిన మార్పులను, గాల్ బ్లాడర్, బైల్ డక్ట్ (పైత్యరస నాళాలు)లను, వాటిలో ఏర్పడిన అపసవ్యతలను గమనిస్తారు. క్రానిక్ పాంక్రియాటైటిస్‌లో... సెక్రెటిన్: పాంక్రియాస్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించే పరీక్ష ►ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ : ఇది పాంక్రియాస్ డ్యామేజ్ అయిందనే సందేహం వచ్చినప్పుడు చేస్తారు. చక్కెర స్థాయులను పాంక్రియాస్ ఎలా నిర్వహిస్తుందో తెలుసుకోవడం కోసం చక్కెర ద్రవం తాగక ముందు ఒకసారి, తాగిన తర్వాత ఒకసారి పరీక్షిస్తారు. స్టూల్ టెస్ట్ : ఆహారం ద్వారా అందిన కొవ్వులను కణాలుగా విభజించడంలో దేహం నిర్వీర్యమవుతున్నట్లు సందేహం కలిగినప్పుడు చేస్తారు. ∙ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ : దీనినే ఎండోసోనోగ్రఫీ అని కూడా అంటారు. ఎండోస్కోప్ పరికరాన్ని గొంతులో నుంచి కడుపు, చిన్న పేవులు, పాంక్రియాస్ వరకు పంపిస్తారు. దానికి అమర్చిన కెమెరా ద్వారా పాంక్రియాస్, ట్యూబులు, లివర్, గాల్ బ్లాడర్, పైత్యరస నాళాలను పరిశీలిస్తారు. ∙ఈఆర్సీపీ (ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ) : ఇది కూడా ఎండోస్కోపీలాగానే చేస్తారు. అయితే ఇందులో పరీక్షతోపాటు పాక్షికంగా చికిత్స కూడా జరిగిపోతుంది. ఈ పరీక్షలో పాంక్రియాస్, వాటి ట్యూబుల లోపలి భాగాలను కూడా పరిశీలిస్తారు. పాంక్రియాస్లో కానీ బైల్ డక్ట్‌లో కానీ ఏదైనా అడ్డంకులు కనిపిస్తే వాటిని పరీక్ష సమయంలోనే తొలగిస్తారు. నివారణ ఎలా? ఆరోగ్యకరమైన జీవనవిధానమే ప్రధానం. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, మందులు తీసుకుంటూ ధూమపానం, మద్యపానం మానేస్తే క్లోమం తిరిగి ఆరోగ్యవంతం అవుతుంది. పాంక్రియాస్... ఎక్కడ ఉంటుంది? ఇది పొట్టకు పై భాగంలో చిన్న పేగు మొదలయ్యే చోట ఉంటుంది. ఈ గ్రంథికు అనుసంధానమై ఉండే ట్యూబ్ ద్వారా జీర్ణరసాలు చిన్నపేగులోకి ప్రవహిస్తాయి. ఇది ఏయే పనులు చేస్తుంది? దీని ప్రధాన కర్తవ్యం జీర్ణరసాలను ఉత్పత్తి చేసి విడుదల చేయడం, ఇన్సులిన్ హార్మోన్‌ను విడుదల చేయడం. జీర్ణ రసాలు ఆహారంలోని కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వును వేరు చేసి జీర్ణప్రక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తాయి. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధం చేస్తుంది. దేహానికి శక్తిని విడుదల చేస్తూ కొంత శక్తిని నిల్వ చేసుకుంటుంది. పాంక్రియాటైటిస్ లక్షణాలు ఇలా... పాంక్రియాటైటిస్ రకాన్ని బట్టి (అక్యూట్, క్రానిక్) లక్షణాలు కొద్దిగా మారుతుంటాయి. అక్యూట్ పాంక్రియాటైటిస్‌లో... ∙పొట్ట పై భాగం (అప్పర్ అబ్డామిన్)లో ఒక మోస్తరు నుంచి తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి వెన్ను వరకు పాకుతుంది. ∙నొప్పి ఒక్కోసారి అకస్మాత్తుగా వచ్చి తగ్గుతుంది. కొన్నిసార్లు కొద్దిరోజులు కొనసాగుతుంది -
COVID-19: టెస్టుకు ముందే చికిత్స బెస్ట్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ లక్షణాలుంటే వెంటనే నిర్ధారణ పరీక్ష చేసి ఫలితం ఆధారంగా చికిత్స మొదలుపెట్టడం ఇప్పటివరకు అనుసరించిన పద్ధతి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతున్న తరుణంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షకు ముందే హోం ఐసోలేషన్‌లో ఉండి.. లక్షణాల ఆధారంగా చికిత్స మొదలుపెట్టడం సరైన పద్ధతని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ఛ్) స్పష్టం చేసింది. కరోనా టెస్ట్‌లపై ఒత్తిడి పెరిగినందున పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో జాప్యం నెలకొంటున్న దృష్ట్యా ఈమేరకు సూచించింది. యాంటిజెన్ పరీక్షలో ఫలితం నెగెటివ్ వస్తుండగా, ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వస్తున్న సందర్భాలు అనేకం. అయితే ఆర్టీపీసీఆర్ పరీక్షలకు సంబంధించి నమూనాల సేకరణ, పరీక్ష, ఫలితాల వెల్లడికి మూడు నుంచి ఐదురోజులు పడుతోంది. ఇంతలో ఎలాంటి చికిత్స ప్రారంభించకుండా అలక్ష్యం చేయడంతో ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న ఘటనలు పునరావృతమవుతున్నందున ఐసీఆఎంఆర్తో పాటు వైద్య,ఆరోగ్య శాఖ సైతం స్పష్టం చేసింది. లక్షణాలకు తగినట్లుగా మెడిసిన్ కరోనా వైరస్ సోకిన వారిలో అత్యంత సాధారణంగా కనిపించే లక్షణాలు జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, తలతిరగడం, వాసన, రుచి కోల్పోవడం, జలుబు, దగ్గు తదితరాలు. వీటితోపాటు వాంతులు, విరేచనాలు రావడాన్ని కూడా ఇటీవల చేర్చారు. ఇందులో అన్ని లక్షణాలు కాకుండా ఒకట్రెండు లక్షణాలు మాత్రం తప్పకుండా ఉంటున్నాయి. రెండ్రోజులకు పైబడి ఈ లక్షణాలుంటే కోవిడ్ అని ప్రాథమికంగా నిర్ధారించాల్సిందే. దీంతో జ్వరం వస్తే డోలో–650 వేయాల్సిందే. ఇలా లక్షణాలకు అనుగుణంగా మందులను కోర్సు రూపంలో వాడితే ఆరోగ్యం విషమించే అవకాశం తక్కువ. ఈ లక్షణాలుండి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సొంతవైద్యం వద్దు కోవిడ్ లక్షణాలున్నవారికి రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మందులను సూచించింది. క్షేత్రస్థాయిలో అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా కరపత్రాలను పంపిణీ చేస్తోంది. లక్షణానికి తగిన మందుగోలీలు ఎన్నిరోజులు వాడాలనే అంశంపై స్పష్టత ఇస్తూ సూచనలు చేసింది. మందుల పేర్లను నిర్దేశించినప్పటికీ సొంత వైద్యం వద్దని హెచ్చరిస్తోంది. ఫోన్ ద్వారా వైద్యున్ని సంప్రదించిన తర్వాతే మందులు వినియోగించాలి. పేషెంట్ హిస్టరీ, స్థితి తదితర అంశాలను ప్రమాణికంగా తీసుకున్న తర్వాతే వైద్యలు మోతాదును నిర్ధారిస్తారని ఐసీఎంఆర్ సైతం సూచించింది. పేషెంట్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా స్టెరాయిడ్ల వాడకాన్ని సైతం సూచించినప్పటికీ వైద్యుల సమక్షంలోనే ఈ చికిత్స జరగాలి. పేషెంట్ హిస్టరీ ప్రకారమే చికిత్స కరోనా పాజిటివ్ అనగానే అన్నిరకాల మందులు వాడాల్సిన అవసరం ఉండదు. పేషెంట్ హిస్టరీ ఆధారంగా లక్షణాలకు తగినట్లు మందులు వాడాలి. పేషెంట్‌కు షుగర్, బీపీ ఉంటే ఒక రకమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యలున్నవారు, ఎలర్జీలున్న వారికి ఒక విధంగా.. సాధారణ స్థితిలో ఉన్న వారికి మరోలా మందులు, డోసులను నిర్ధారిస్తారు. లక్షణాల తీవ్రతకు తగినట్లు స్పందించాలి. ఒక్కసారిగా ఎక్కువ డోసున్న మాత్రలు వేసుకున్నా, ఏదిపడితే ఆ టాబెట్లు వాడినా మరిన్ని దుష్ప్రభావాలు ఎదురవుతాయి. కనుక వైద్యుడిని సంప్రదిస్తే మందులు వాడకంపై స్పష్టత వస్తుంది. సొంత వైద్యం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. – డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, ఎండీ, జనరల్ ఫిజీషియన్ పిల్లలకు తల్లిదండ్రుల సమక్షంలోనే చికిత్స చిన్నపిల్లల్లో కరోనా వస్తే ఆందోళన చెందకుండా తగిన చికిత్సను తల్లిదండ్రుల సమక్షంలోనే ఇవ్వాలి. ఇప్పటివరకు పరిశీలించినంతవరకు పిల్లలకు సాధారణ లక్షణాలే కనిపిస్తున్నాయి. జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలు రావడం చూస్తున్నాం. వాటికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఫోన్లో వైద్యుడిని సంప్రదించి మందులు, డోస్‌ను నిర్ధారించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుతానికి పిల్లల్లో కోవిడ్ వస్తే తక్షణ స్పందనతో వందశాతం రికవరీ ఉంది. – డాక్టర్ కిశోర్ ఈగ, పీడియాట్రిక్స్, నెల్లూరు లక్షణాలుంటే పాజిటివే.. లక్షణాలు ఉండి యాంటీజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చినా చికిత్సకు వెళ్లడమే మంచిది. యాంటీజెన్ పరీక్ష కేవలం 60 శాతం మాత్రమే కరెక్ట్. తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించాలి. దీని రిపోర్టు కోసం వేచిచూడకుండా అంతలోనే లక్షణాలకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. స్వల్ప లక్షణాలున్న వాళ్లు హోం ఐసోలేషన్‌లో ఉంటూ కనీసం ఐదురోజుల పాటు యాంటిబయాటిక్స్‌తో పాటు లక్షణానికి తగిన మందులు వాడాలి. తొలి ఐదురోజుల్లోనే తీవ్రత ఎంతుందో తెలుస్తుంది. మందులు వాడకుంటే లక్షణాలు తీవ్రమై చికిత్స మరింత కష్టంగా మారుతుంది. అందువల్ల వేగంగా స్పందించడం చాలా మంచిది. - డాక్టర్ జలగం తిరుపతిరావు, అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్ విభాగం, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల థర్మామీటర్ వెంట ఉంటే మంచిది కరోనా సోకిన వారికి జ్వరం తరుచుగా, తీవ్రంగా వస్తుంది. అందుకే థర్మామీటర్ అందుబాటులో ఉంచుకోవాలి. జ్వరం ఉంటే వెంటనే పారాసిటమల్ వేసుకోవచ్చు. అదేవిధంగా కోవిడ్ పేషెంట్ ఆక్సిజన్ స్థాయి, గుండె వేగాన్ని సైతం పరిశీలించేందుకు ఆక్సీమీటర్‌ను కూడా అందుబాటులో ఉంచుకుంటే మంచిది. ఆక్సీమీటర్ అందుబాటులో లేకుంటే 20సెకన్ల పాటు ఊపిరి బిగపట్టి వదలాలి. ఈ సమయం తగ్గితే ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించి మెరుగైన చికిత్స తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. - డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ యూనిట్ హెచ్ఓడీ, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల -
ఆస్పత్రులు కిటకిట వ్యాధుల విజృంభణ
జిల్లాలో సీజనల్ వ్యాధులు పంజావిసుతున్నాయి. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు పక్షం రోజులుగా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. వర్షాలు కురుస్తుండడంతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ప్రతి ఇంటికీ ఒకరు చొప్పునవ్యాధుల బారిన పడుతున్నారు. వీటితో పాటు మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధుల లక్షణాలతో పలు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని చెపుతున్నప్పటికీ మారుమూల గ్రామాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. నల్లగొండ టౌన్ : జిల్లాలోని పలు ఏరియా ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న రెఫరల్ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డు, ప్లేట్లెట్లను ఎక్కించే సౌకర్యం ఉండడంతో పాటు స్పెషలిస్టు డాక్టర్లు ఉండడం వలన ఇన్‌పేషంట్, అవుట్‌పేషంట్ల సంఖ్య బాగా పెరిగింది. నేలపైనే రోగులకు చికిత్స జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో 250 పడకల సామర్థ్యం ఉన్నప్పటికీ పెరుగుతున్న రోగులకు అనుగుణంగా సౌకర్యాలు లేవు. దీంతో నేలపైనే పడుకొబెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజు అత్యవసర వైద్యసేవలతో పాటు సీజనల్, మలేరియా, డెంగీ స్వైన్‌ఫ్లూ, వ్యాధుల లక్షణాలతో జిల్లా ఆస్పత్రికి ఇన్‌పేషంట్లు వంద మంది, ఇవుట్పేషంట్లు సుమారు ఐదు వందల మంది దాకా వస్తున్నారు. రోగుల తాకిడి కారణంగా స్త్రీ, పురుష, మెడికల్ వారుల్డు, ఐసోలేషన్, జనరల్ వార్డులు పూర్తిగా నిండిపోయాయి. చేసేది లేక నేలపేనే చాపలను పరిచి వాటిపై పడుకోబెట్టి వైద్య సేవలు అందించాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. సెలెన్ ఎక్కించే స్టాండ్లు సైతం సరిపోక ఒక్కో స్టాండ్‌కు ముగ్గురికి ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు కిటికీలకు కట్టి కూడా సెలెన్ ఎక్కిస్తుండడం ప్రస్తుతం నిత్యకృత్యమైంది. అదనపు బ్లాక్‌ను ప్రారంభిస్తే.. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి అదనంగా 150 పడకల సామర్థ్యం కలిగిన అదనపు బ్లాక్‌ను రూ.4 కోట్లతో ని ర్మించారు. అయితే నిర్మాణం పూర్తయై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇదే బ్లాక్ ప్రారంభించి ఉంటే సీజన్ల్ వ్యాధులతో వచ్చే రోగులకు తిప్పలు తప్పేవి. అదే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉండేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికైనా జిల్లా మంత్రి స్పందించి వెంటనే ఆదనపు బ్లాక్‌ను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఆగస్టు నుంచి నమోదైన కేసులు ఇలా.. జిల్లాలో సీజన్ ప్రారంభమైన ఆగస్టు నుంచి డెంగీ 2, స్వైన్‌ఫ్లూ 3, మలేరియా 3 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ అనధికారికంగా డెంగీ 20, స్వైన్‌ఫ్లూ 6, మలేరియా 18 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే వారందరూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయినట్లు, మరణాలు మాత్రం జరగలేదని తెలిసింది. ‘మిర్యాల’లో స్వైన్ ఫ్లూ కలకలం మిర్యాలగూడ : మిర్యాలగూడలో స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. మిర్యాలగూడలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి ఇటీవల జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని చికిత్స నిర్వహించారు. ఆయనకు ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. అదే విధంగా మిర్యాలగూడలోని డాక్టర్స్ కాలనీలో జ్వరాలతో వచ్చిన రోగులకు సుమారుగా పది మందికి కూడా డెంగీ లక్షణాలు ఉండటం వల్ల హైదరాబాద్‌లకు పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు మాత్రం ప్రతి కాలనీలో ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలో ఎక్కువగా సుందర్‌నగర్, బంగారుగడ్డ, ఇస్లాంపుర, సీతారాంపురం, ప్రకాశ్‌నగర్, రాంనగర్, తాళ్లగడ్డ ప్రాంతాలలో ప్రజలు ఎక్కువగా జ్వరాల భారిన పడుతున్నారు. -
'నాన్నను, పిన్నిని కఠినంగా శిక్షించాలి'
హైదరాబాద్: కన్నతండ్రి, పిన్ని చేతిలో ఘోరంగా చిత్రహింసలు అనుభవించిన ప్రత్యూష తొలిసారి వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఎల్బీ నగర్‌లోని అవేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష శుక్రవారం సాక్షితో మాట్లాడింది. తాను వాళ్లకు పుట్టలేదనే కారణంతో ఏడాది కాలంగా తనను టార్చర్ పెడుతూ వచ్చారని వాపోయింది. తనను ప్రతిక్షణం మానసికంగా, శారీరకంగా చాలా రోజుల నుంచి వేధిస్తున్నారని ప్రత్యూష వెల్లడించింది. తన పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయో కూడా తెలియదని, తనలాంటి దుస్థితి మరెవరికి రాకూడదని కన్నీరు మున్నీరైంది. ఇంత ఘోరంగా వేధించిన తన నాన్నకు, పిన్నికి కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఏడాది కాలంగా గదిలో నిర్బంధించి తండ్రి చిత్ర హింసలు పెట్టడంతో తీవ్రగాయాలయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను రీనల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. -
సమీక్షలతో సరి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘పారిశుద్ధ్యలోపంపై యుద్ధ ప్రకటిద్దాం..పిచ్చిమొక్క లు పీకేసి, మురుగు తొలిగింపు కోసం నాలుగైదు రోజుల్లో కార్యాచరణ రూపొందిద్దాం..పచ్చతోరణం కింద మండలానికి లక్ష చొప్పున మొక్కలు నాటుదాం.. ఇక ఆస్పత్రుల్లో వై ద్యం అందక మరణించడానికి వీల్లేదు. ముఖ్యంగా అన్ని ఆ స్పత్రుల్లో వార్మోడ్లో(యుద్ధ ప్రాతిపదికన) పాముకాటు కు మందులు అందుబాటులో ఉంచాలి. నకిలీ ఎరువులు, న కిలీ విత్తనాలు అనే మాటే వినపడొద్దు. అలాంటి వారి మీ ద కఠిన చర్యలు తీసుకోండి’ ఈ నెల 4న గజ్వేల్ పట్టణంలో జ రిగిన నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అధికారులకు చేసిన సూచనలివి. నాణేనికి ఒక వైపు... రోజులు గడిచి పోతున్నాయి... అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గజ్వేల్ చుట్టే చక్కర్లు కొట్టి వస్తున్నారు. ఒక్కరు... ఇద్దరు అధికారులు కాదు.. అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా 60 శాఖల అధిపతులది అదే పని. పొద్దున లేస్తే సారొళ్లంతా చెరువులో చేపలు ఎదురెక్కినట్టే గజ్వేల్ నియోజకవర్గం మండలాల్లో తిరుగుతూ కనిపించారు. ప్రజా సేవ చేస్తామంటూ పోటీ పడ్డారు. దీంతో జిల్లా జనమంతా అదృష్టమంటే గజ్వేల్ నియోజకవర్గం ప్రజలదే అనుకున్నారు. అభివృద్ధి ‘వార్ మోడ్’లో జరిగిపోతోందని భావించారు. నాణేనికి రెండవ వైపు.... అధికారులు ఇంత వరకు సమీక్షలు, సమావేశాలతోనే కాలయాపన చేశారు. కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినా గజ్వేల్ పట్టణంలో కనీసం పిచ్చిమొక్కలను కూడా తొలగించలేదు. గజ్వేల్ పట్టణం హైదరాబాద్‌కు దగ్గర్లో ఉంటుంది కాబట్టి అధికారులు సమీక్షల పేరుతో ఇటు వైపునకు టూర్లు వేసుకుంటున్నారు. పనిలో పనిగా కిందిస్థాయి సిబ్బంది మీద చిందులు వేసి తాపీగా ఇళ్లకు వెళ్తున్నారు. అంతా హడావుడి అధికారులంతా గజ్వేల్ చుట్టే చక్కర్లు కొడుతున్నా... చేసిందేమీ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగడం లేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు ‘సాక్షి’ విలేకరుల బృందం బుధవారం గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మూడేసి గ్రామాల చొప్పున పర్యటించింది. ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇచ్చిన పారిశుద్ధ్య నిర్వాహణ తీరుపై పరిశీలన చేయగా, అధికారుల్లో చిత్తశుద్ధి కనిపించలేదు. ఈనెల 12 నుంచి 19 వరకు గ్రామాల్లో చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలు కూడా మొక్కుబడిగానే ముగిసినట్లు తేలింది. ‘సాక్షి’ పరిశీలనలో తేలిన మరిన్ని వాస్తవాలు ఇలా ఉన్నాయి పారిశుద్ధ్యం పాత పాటే.... గజ్వేల్ నగర పంచాయతీలో పారిశుద్ధ్యలోపం తాండవిస్తోంది. పట్టణంలోని 20 వార్డుల్లోనూ పారిశుద్ధ్య లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రదానంగా బీడీ కాలనీ, రాజిరెడ్డిపల్లి, లక్ష్మీప్రసన్ననగర్ కాలనీలు, ప్రజ్ఞాపూర్, క్యాసారం గ్రామాల్లో ఇళ్ల మధ్యన మురుగు నిలిచిపోయింది. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలోని బుడగ జంగాల కాలనీ దుర్గంధంతో అల్లాడుతోంది. ఈ కాలనీలో మురుగు తీసే వారే కరువయ్యారు. అదేవిధంగా గ్రామ ప్రధాన రహదారి ఇరుపక్కల ఉన్న డ్రైనేజీల్లో మురుగు నిండిపోయింది. ఇక్కడ పిచ్చిమొక్కల తొలగింపు కూడా జరగలేదు. కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో మోరీలు తీయలేదు. ఫలితంగా దుర్గంధం వెదజల్లుతోంది. మినీ ట్యాంకులను సైతం శుభ్రం చేయడంలేదు. వర్గల్ మండలం నాచారం, మజీద్‌పల్లి గ్రామాల్లో మురుగు తొలగింపు సక్రమంగా సాగలేదు. ఫలితంగా మోరీలు మురుగుతో కూరుకుపోయాయి. ములుగు మండలం అడవిమజీద్ గ్రామంలో పిచ్చిమొక్కల తొలగింపు కార్యక్రమం జరగలేదు. గ్రామంలోని వీధుల్లో పిచ్చిమొక్కలు దర్శనమిచ్చాయి. జగదేవ్‌పూర్ మండలం వర్దరాజ్‌పూర్, చాట్లపల్లి, చేబర్తి, రాయవరం, పీటీ వెంకటాపూర్, ఇటిక్యాల గ్రామాల్లో స్పెషల్‌డ్రైవ్ కార్యక్రమం సక్రమంగా సాగలేదు. పాటు కాటుకు మందే లేదు వైద్యం అందక ఏ ఒక్కరు కూడా మరణించాడానికి వీలులేదని ముఖ్యమంత్రి ఆదేశించిన సరిగ్గా వారంరోజులకే నియోజకవర్గంలోని వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో తొమ్మిదేళ్ల బాలుడు గొలుసు అనిల్ పాముకాటుతో మరణించారు. ఇంట్లో నిద్రిస్తున్న బాలున్ని రాత్రివేళలో పాము కరిచింది. వర్గల్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు నగరంలోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించారు. నియోజకవర్గంలోని ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితిని చూస్తే ఏ ఒక్క చోట కూడా పాముకాటు మందు సరిగ్గా అందుబాటులో లేదు. జగదేవ్‌పూర్‌లో కేవలం ఒక డోస్, తీగుల్ పీహెచ్సీలో రెండు డోసులు, వర్గల్, ములుగు, సింగన్న గూడలో కేవలం రెండే రెండు డోసుల పాముకాటు మందు ఉంది. అయితే ఉన్న మందును సైతం బాధితులకు అందించేందుకు వైద్యులు అందుబాటులో లేరు. నియోజవర్గంలో 22 ఏఎన్ఎం పోస్టులు, మహిళా ఆరోగ్య సహాయకురాలు పోస్టులు 20, ఆరోగ్య సహాయకురాలు పోస్టులు 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గజ్వేల్ ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ రెండున్నర ఏళ్ల కిందటే జీవో విడుదలైంది. కానీ ఇప్పటి వరకు దాని అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఇప్పుడైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్తే ప్రజలకు ప్రభుత్వం వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఈనెల 6న ఇన్చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ పద్మ నియోజకవర్గంలో తనిఖీలు చేసినా, సామాన్యులకు ఏ మాత్రం ప్రయోజనం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు అప్పులు చేసి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. బీటీ విత్తనాల అక్రమ దందా ఇక్కడే బీటీ పత్తి విత్తనాల అక్రమ దందాకు గజ్వేల్ అడ్డాగా మారింది. ఇక్కడి నకిలీ విత్తనాలు ముఠాలు పని చేస్తాయి. విషయం ముందే తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీటీ పత్తి విత్తనాలు, ఎరువుల పంపిణీలో బ్లాక్ మార్కెట్‌ను సహించేదిలేదని ఈనెల 4న గజ్వేల్‌లో నిర్వహించిన సమీక్షలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ ఈనెల 13న గజ్వేల్‌లోని సత్య ఫంక్షన్‌హాలులో సమీక్ష నిర్వహించి వ్యాపారులకు హెచ్చరికలు కూడా చేశారు. అంతకు ముందు వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ హుక్యానాయక్తోపాటు పలువురు అధికారులు సైతం తనిఖీలు నిర్వహించి హెచ్చరికలు చేశారు. అయినా కూడా బీటీ విత్తనాలు అక్రమంగా విక్రయిస్తున్న ముఠా ఈనెల 18న గజ్వేల్‌లో బయట పడింది. రూ.500కు మాత్రమే విక్రయించాల్సిన హైబ్రీడ్ బీటీ విత్తన ప్యాకెట్‌ను బీజీ-2గా చలామణి చేస్తూ రూ. 1000కి, 125 గ్రాముల కందుల మిశ్రమంతో ఉన్న బీజీ ప్యాకెట్‌ను రూ. 862కు విక్రయించాల్సి ఉండగా రూ. 930 విక్రయిస్తున్నారు. రైతులు సమాచారం అందించే వరకు అధికారులు ఈ మోసాన్ని పసిగట్టలేకపోయారు. రైతు సమాచారంతో తనిఖీలు చేయగా ఈ వ్యాపారం వెలుగు చూసింది. రైతు ఆత్మహత్యలూ ఎక్కువే ముఖ్యమంత్రి బ్యాంకర్లతో సమావేశమైన తర్వాత జిల్లాలో దాదాపు 9 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటిలో గజ్వేల్ నియోజకవర్గంలోనే ముగ్గురు రైతులు అప్పుల బాధతో బలవన్మరణం చెందారు. ఈనెల 14 గజ్వేల్ నగర పంచాయితీ పరిధిలోని ముట్రాజ్‌పల్లిలో చీర్ల యాదయ్య, ఈనెల 17న జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామంలో బీనమైన ముత్యాలు అనే రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామంలో ఫిరంగి ఎల్లయ్య అప్పుల బాధతో ఉరి వేసుకొని చనిపోయారు. నియోజవర్గంలో పరుగులు తీస్తున్న అధికారులు ఏ ఒక్కరైతుకు ధైర్యం ఇవ్వలేకపోవడంతోనే ఈ దారుణాలన్నీ జరిగాయి. సాగు విధానం, సస్యరక్షణ పద్ధతులపై కూడా అధికారులు రైతులకు సూచనలి సలహాలివ్వడం లేదు. ‘‘ముఖ్యమంత్రి చెప్పారు కదా.. అని కారులో కూర్చొని కాలు కిందపెట్టకుండా తిరిగితే ప్రయోజనం ఏమీ ఉండదని, అధికారులు చిత్తశుద్ధితో సేవ చేసినప్పుడే ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందుతాయి’ అని గజ్వేల్వాసులు అంటున్నారు.