ప్రపంచంలో చాలామంది అందం కోసం విపరీతంగా తాపత్రయపడుతుంటారు. ఇందుకోసం ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటారు. కొందరు తమ దంతాలు సరిగా లేవంటూ, వాటికి హంగులు సమకూరుస్తారు. ఇటువంటి సందర్బాల్లో చికిత్స చేయించుకున్న కొందరి ముఖాలు భయంకరంగా మారిపోవడాన్ని మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇటువంటి మరో తాజా ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇటీవలే డెంటల్ ట్రీట్‌మెంట్ తీసుకున్న ఒక యువకునికి ఎదురైన చేదు అనుభవం గురించి ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వివరించాడు. జాక్ జేమ్స్ కెమెరాలో అందంగా కనిపించాలనే ఉద్దేశంతో నకిలీ దంతాలు పెట్టించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం బ్రిటన్ నుంచి టర్కీకి వెళ్లాడు. £3,000( సుమారు రూ. 3 లక్షలు) వెచ్చించి నకిలీ దంతాలు పెట్టించుకున్నాడు.
మొదట్లో ఈ దంతాలు అతని ముఖానికి ఎంతో అందాన్నిచ్చాయి. అయితే కొద్ది రోజుల తరువాత అతని దంతాల నుంచి రక్తం కారసాగింది. అలాగే నోటు నుంచి దుర్వాసన కూడా వెలువడసాగింది. దీంతో జాక్ జేమ్స్.. మాంచెస్టర్‌లోని ఒక డెంటిస్ట్‌ను సంప్రదించాడు. ఆ దంతవైద్యుడు పలుపరీక్షలు చేసిన అనంతరం అతని దంతాలు పూర్తిగా పాడయిపోయాయని చెప్పాడు. ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపాడు.
ఆ దంతాలను తిరిగి సరిగా చేసేందుకు £20,000(సుమారు రూ. 20 లక్షలు) ఖర్చవుతాయని తెలిపాడు. ఇంగ్లండ్‌లో ఈ చికిత్సకు ఇంత భారీగా ఖర్చవుతుందని తెలుసుకున్న అతను తిరిగి గతంలో తనకు చికిత్స చేసిన టర్కీలోని డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ డెంటిస్ట్ అతనితో దంత చికిత్సలో తప్పేమీ జరగలేదని, అయితే తిరిగి దంతాలను సరి చేసుకోవాలంటే, మరోమారు చికిత్స చేయించుకోవాలని, ఇందుకు మరింత ఖర్చవుతుందని తెలిపాడు.
మరో మార్గంలేక జాక్ అందుకు అంగీకరించాడు. నకిలీ దంతాలను తొలగించుకుని ఇన్ఫెక్షన్ దూరమయ్యేందుకు చికిత్స తీసుకున్నాడు. తరువాత కొత్తగా టెంపరరీ దంతాలను పెట్టించుకున్నాడు. అయితే అతను ఈ టెంపరరీ దంతాలను శుభ్రం చేసుకుంటున్నప్పుడు, అసలు దంతాలు షార్క్ దంతాలుగా మారిపోవడాన్ని గమనించాడు. అన్ని దంతాల మధ్య గ్యాప్ ఉండటాన్ని గుర్తించాడు.
జాక్ తన దంతాలు చూసుకున్నప్పుడల్లా ఏదో హర్రర్ ఫిల్మ్‌లోని క్యారెక్టర్‌లా ఉన్నానని భావిస్తాడట. దీంతో అతనికి ఈ షార్క్ దంతాలను కూడా తొలగించుకోవాలని అనిపిస్తుందట. ఇందుకోసం మరో వైద్యుడిని సంప్రదించాలని అనుకుంటున్నానని జాక్ తెలిపాడు.
ఇది కూడా చదవండి: తొలి హార్ట్‌ట్రాన్స్ ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆ రోజు జరిగిందిదే!
Comments
Please login to add a commentAdd a comment