COVID-19: టెస్టుకు ముందే చికిత్స బెస్ట్‌  | Pre Test Treatment Is Best Coronavirus | Sakshi
Sakshi News home page

కోవిడ్‌-19:టెస్టుకు ముందే చికిత్స బెస్ట్‌ 

Published Fri, May 7 2021 1:43 AM | Last Updated on Fri, May 7 2021 9:13 AM

Pre Test Treatment Is Best Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ లక్షణాలుంటే వెంటనే నిర్ధారణ పరీక్ష చేసి ఫలితం ఆధారంగా చికిత్స మొదలుపెట్టడం ఇప్పటివరకు అనుసరించిన పద్ధతి. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతమవుతున్న తరుణంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షకు ముందే హోం ఐసోలేషన్‌లో ఉండి.. లక్షణాల ఆధారంగా చికిత్స మొదలుపెట్టడం సరైన పద్ధతని ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్ఛ్‌) స్పష్టం చేసింది.

కరోనా టెస్ట్‌లపై ఒత్తిడి పెరిగినందున పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో జాప్యం నెలకొంటున్న దృష్ట్యా ఈమేరకు సూచించింది. యాంటిజెన్‌ పరీక్షలో ఫలితం నెగెటివ్‌ వస్తుండగా, ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్‌ వస్తున్న సందర్భాలు అనేకం. అయితే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు సంబంధించి నమూనాల సేకరణ, పరీక్ష, ఫలితాల వెల్లడికి మూడు నుంచి ఐదురోజులు పడుతోంది. ఇంతలో ఎలాంటి చికిత్స ప్రారంభించకుండా అలక్ష్యం చేయడంతో ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న ఘటనలు పునరావృతమవుతున్నందున ఐసీఆఎంఆర్‌తో పాటు వైద్య,ఆరోగ్య శాఖ సైతం స్పష్టం చేసింది. 

లక్షణాలకు తగినట్లుగా మెడిసిన్‌ 
కరోనా వైరస్‌ సోకిన వారిలో అత్యంత సాధారణంగా కనిపించే లక్షణాలు జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, తలతిరగడం, వాసన, రుచి కోల్పోవడం, జలుబు, దగ్గు తదితరాలు. వీటితోపాటు వాంతులు, విరేచనాలు రావడాన్ని కూడా ఇటీవల చేర్చారు. ఇందులో అన్ని లక్షణాలు కాకుండా ఒకట్రెండు లక్షణాలు మాత్రం తప్పకుండా ఉంటున్నాయి. రెండ్రోజులకు పైబడి ఈ లక్షణాలుంటే కోవిడ్‌ అని ప్రాథమికంగా నిర్ధారించాల్సిందే. దీంతో జ్వరం వస్తే డోలో–650 వేయాల్సిందే. ఇలా లక్షణాలకు అనుగుణంగా మందులను కోర్సు రూపంలో వాడితే ఆరోగ్యం విషమించే అవకాశం తక్కువ. ఈ లక్షణాలుండి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
సొంతవైద్యం వద్దు 
కోవిడ్‌ లక్షణాలున్నవారికి రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మందులను సూచించింది. క్షేత్రస్థాయిలో అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా కరపత్రాలను పంపిణీ చేస్తోంది. లక్షణానికి తగిన మందుగోలీలు ఎన్నిరోజులు వాడాలనే అంశంపై స్పష్టత ఇస్తూ సూచనలు చేసింది. మందుల పేర్లను నిర్దేశించినప్పటికీ సొంత వైద్యం వద్దని హెచ్చరిస్తోంది. ఫోన్‌ ద్వారా వైద్యున్ని సంప్రదించిన తర్వాతే మందులు వినియోగించాలి. పేషెంట్‌ హిస్టరీ, స్థితి తదితర అంశాలను ప్రమాణికంగా తీసుకున్న తర్వాతే వైద్యలు మోతాదును నిర్ధారిస్తారని ఐసీఎంఆర్‌ సైతం సూచించింది. పేషెంట్‌ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా స్టెరాయిడ్‌ల వాడకాన్ని సైతం సూచించినప్పటికీ వైద్యుల సమక్షంలోనే ఈ చికిత్స జరగాలి.   

పేషెంట్‌ హిస్టరీ ప్రకారమే చికిత్స 
కరోనా పాజిటివ్‌ అనగానే అన్నిరకాల మందులు వాడాల్సిన అవసరం ఉండదు. పేషెంట్‌ హిస్టరీ ఆధారంగా లక్షణాలకు తగినట్లు మందులు వాడాలి. పేషెంట్‌కు షుగర్, బీపీ ఉంటే ఒక రకమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యలున్నవారు, ఎలర్జీలున్న వారికి ఒక విధంగా.. సాధారణ స్థితిలో ఉన్న వారికి మరోలా మందులు, డోసులను నిర్ధారిస్తారు. లక్షణాల తీవ్రతకు తగినట్లు స్పందించాలి. ఒక్కసారిగా ఎక్కువ డోసున్న మాత్రలు వేసుకున్నా, ఏదిపడితే ఆ టాబెట్లు వాడినా  మరిన్ని దుష్ప్రభావాలు ఎదురవుతాయి. కనుక వైద్యుడిని సంప్రదిస్తే మందులు వాడకంపై స్పష్టత వస్తుంది. సొంత వైద్యం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. 
– డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, ఎండీ, జనరల్‌ ఫిజీషియన్‌ 

పిల్లలకు తల్లిదండ్రుల సమక్షంలోనే చికిత్స 
చిన్నపిల్లల్లో కరోనా వస్తే ఆందోళన చెందకుండా తగిన చికిత్సను తల్లిదండ్రుల సమక్షంలోనే ఇవ్వాలి. ఇప్పటివరకు పరిశీలించినంతవరకు పిల్లలకు సాధారణ లక్షణాలే కనిపిస్తున్నాయి. జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలు రావడం చూస్తున్నాం. వాటికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఫోన్‌లో వైద్యుడిని సంప్రదించి మందులు, డోస్‌ను నిర్ధారించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుతానికి పిల్లల్లో కోవిడ్‌ వస్తే తక్షణ స్పందనతో వందశాతం రికవరీ ఉంది. 
– డాక్టర్‌ కిశోర్‌ ఈగ, పీడియాట్రిక్స్, నెల్లూరు 

లక్షణాలుంటే పాజిటివే.. 
లక్షణాలు ఉండి యాంటీజెన్‌ పరీక్షలో నెగిటివ్‌ వచ్చినా చికిత్సకు వెళ్లడమే మంచిది. యాంటీజెన్‌ పరీక్ష కేవలం 60 శాతం మాత్రమే కరెక్ట్‌. తర్వాత ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించాలి. దీని రిపోర్టు కోసం వేచిచూడకుండా అంతలోనే లక్షణాలకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. స్వల్ప లక్షణాలున్న వాళ్లు హోం ఐసోలేషన్లో ఉంటూ కనీసం ఐదురోజుల పాటు యాంటిబయాటిక్స్‌తో పాటు లక్షణానికి తగిన మందులు వాడాలి. తొలి ఐదురోజుల్లోనే తీవ్రత ఎంతుందో తెలుస్తుంది. మందులు వాడకుంటే లక్షణాలు తీవ్రమై చికిత్స మరింత కష్టంగా మారుతుంది. అందువల్ల వేగంగా స్పందించడం చాలా మంచిది.
- డాక్టర్‌ జలగం తిరుపతిరావు, అసోసియేట్‌ ప్రొఫెసర్, జనరల్‌ మెడిసిన్‌ విభాగం, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల 

థర్మామీటర్‌ వెంట ఉంటే మంచిది 
కరోనా సోకిన వారికి జ్వరం తరుచుగా, తీవ్రంగా వస్తుంది. అందుకే థర్మామీటర్‌ అందుబాటులో ఉంచుకోవాలి. జ్వరం ఉంటే వెంటనే పారాసిటమల్‌ వేసుకోవచ్చు. అదేవిధంగా కోవిడ్‌ పేషెంట్‌ ఆక్సిజన్‌ స్థాయి, గుండె వేగాన్ని సైతం పరిశీలించేందుకు ఆక్సీమీటర్‌ను కూడా అందుబాటులో ఉంచుకుంటే మంచిది. ఆక్సీమీటర్‌ అందుబాటులో లేకుంటే 20సెకన్ల పాటు ఊపిరి బిగపట్టి వదలాలి. ఈ సమయం తగ్గితే ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించి మెరుగైన చికిత్స తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ హెచ్‌ఓడీ, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement