పింఛన్ పెంపునకు కృషి చేస్తా
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వికలాంగులందరికీ రూ వెయ్యి నుంచి రూ 1500 వరకు పింఛన్ ఇప్పించే బాధ్యత నాదేనని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వికలాంగుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో అత్యధికంగా వికలాంగులు ఉన్నారని తెలిపారు. వీరిలో కొందరికి పుట్టుకతో వికలత్వం రాగా మరికొందరికి ఫ్లోరైడ్ నీటిని తాగి వైకల్యం వచ్చిందన్నారు. వీరందరికీ పింఛన్ పెంచే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. వికలాంగులమని అధైర్యపడవద్దని, ఆత్మస్థైయిర్యంతో ముందుకుసాగాలని సూచించారు.
ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా వికలాంగులందరికీ వారం రోజుల్లో ట్రైసైకిళ్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాలలోని వికలాంగుల జాబితాను ఎంపీడీఓలకు అందజేయాలని సర్పంచ్‌లకు విజ్ఞప్తి చేశారు. వికలాంగుల శాఖ ఏడీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో తమ సమస్యలు పట్టించుకోవడం లేదని వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు వెంకన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ఏడీతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి.బి. శైలజ, ఏపీఎం వినోద, ఏపీఓ శ్రీలత, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా కన్వీనర్ పనస శంకర్‌గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, వెంకటరెడ్డి పాల్గొన్నారు.