Tribal Man Murder case
-
మంత్రగాడనే అనుమానంతో గిరిజన వృద్ధుడిని..
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): మంత్రగాడనే అనుమానంతో ఓ గిరిజన వృద్ధుడిని హత్య చేసి గోదావరిలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, మంగళవారం పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన దుమ్ముగూడెం మండలం కే మారేడుబాకలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కే మారేడుబాక గ్రామానికి చెందిన కుంజా భీమయ్య(65) మే 12 నుంచి కనిపించడం లేదు. దీనిపై అతడి కుటుంబ సభ్యులు 13న దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం మారేడుబాక గ్రామానికి చెందిన తెల్లం శ్రీను, కుంజా లక్ష్మీనారాయణ, తెల్లం రాజారావు అలియాస్ రాజ్‌కుమార్, మిడియం శ్రీను అనే నలుగురు స్టేషన్‌కు వచ్చి నేరం ఒప్పుకున్నారు. భీమయ్య మంత్రాలు, చేతబడులు చేస్తుంటాడని.. తెల్లం శ్రీను భార్యకు నాలుక మీద పుండ్లు అయ్యాయని, లక్ష్మీనారాయణ పెద్ద కొడుకు రెండు నెలల క్రితం డెంగీ జ్వరంతో చనిపోయాడని, రాజ్‌కుమార్ తల్లికి చాలా రోజుల నుంచి కాళ్లు, చేతుల వాపులు ఉన్నాయని, మిడియం శ్రీను తండ్రి ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయాడని.. వీటన్నింటికీ భీమయ్య కారణమనే కోపంతో మే 12వ తేదీ అర్ధరాత్రి ఉరి వేసి చంపామని తెలిపారు. మృతదేహాన్ని నర్సాపురం గ్రామ శివారులో గల గోదావరి ఒడ్డున పూడ్చిపెట్టామని సీఐకి వివరించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని గోదావరి ఒడ్డుకు వెళ్లి తహసీల్దార్ రవికుమార్ సమక్షంలో శవాన్ని బయటకు తీశారు. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేనంతగా ఉండటంతో వెంటనే పంచనామా నిర్వహించి పోస్టుమార్టం జరిపి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. చదవండి: ఇంజెక్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై -
గిరిజనుడి దారుణ హత్య
డుంబ్రిగుడ(అరకులోయ): కల్లు దుకాణం వద్ద జరిగిన చిన్నపాటి ఘర్షణ హత్యకు దారితీసింది. మండలంలోని కొర్రా పంచాయతీ పెద్దపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి రంగారావు(55) అనే వ్యక్తిని అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ కాకరపాడు గ్రామానికి చెందిన బూర్జ రాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. డుంబ్రిగుడ ఎస్ఐ హిమగిరి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపాడు గ్రామానికి చెందిన రంగారావు డీఆర్‌డీపో డీలర్‌గా చేసేవాడు. కించుమండ సంతబయలు వద్ద జీలుగు కల్లు విషయంలో బుధవారం చిన్నపాటి ఘర్షణ జరిగింది. బూర్జ రాజు కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుండగా, డబ్బులు ఇచ్చి వెళ్లు అన్ని రంగారావు చెప్పాడు. అయితే నువ్వెందుకు డబ్బులు అడుగుతున్నావు అంటూ ఆగ్రహించిన రాజు.. రంగారావుతో ఘర్షణకు దిగి, కత్తితో బలంగా కడుపులో పొడిచాడు. రంగారావు పడిపోవడం గమనించిన స్థానికులు,కుటుంబ సభ్యులు హుటాహుటిన అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో రంగారావు మృతి చెందాడు. మృతదేహాన్ని అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్ఐ తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. మృతునికి భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ప్రొఫెసర్ నందినిపై హత్యకేసు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ నందిని సుందర్ పై హత్యకేసు నమోదయింది. ఛత్తీస్ గఢ్లోని మావోయిస్టు ప్రభావిత జిల్లా సుక్మాలో గిరిజనుడి హత్య కేసులో ఆమెతో పాటు జేఎన్ యూ ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్, మావోయిస్టులపై అభియోగాలు నమోదు చేశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు బస్తర్ రేంజ్ ఐజీ ఎస్ ఆర్పీ కాళ్లూరి తెలిపారు. కుమాకోనెంగ్ గ్రామ పంచాయతీ పరిధిలోని నామా గ్రామానికి చెందిన శ్యామనాథ్ బాగహెల్ ను నవంబర్ 4న సాయుధ మావోయిస్టులు హత్య చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా తమ గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి శ్యామనాథ్ పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాడు. ఈ కారణంగానే అతడిని మావోయిస్టులు హత్య చేశారు. తమకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని పేర్కొంటూ నందినికి వ్యతిరేకంగా మే నెలలో తన భర్త ఫిర్యాదు చేసినట్టు శ్యామనాథ్ భార్య తెలిపింది. నందినితో పాటు తన భర్త హత్యకు కారణమైన మావోయిస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. రిచా కేశవ్ అనే పేరుతో నామా గ్రామానికి వెళ్లి మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టొద్దని నందిని బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. నందిని, అర్చనపై దర్యాప్తు చేపట్టనున్నట్టు డీయూ, జేఎన్ యూ వీసీలకు తెలిపామన్నారు.