ప్రొఫెసర్ నందినిపై హత్యకేసు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ నందిని సుందర్ పై హత్యకేసు నమోదయింది. ఛత్తీస్ గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత జిల్లా సుక్మాలో గిరిజనుడి హత్య కేసులో ఆమెతో పాటు జేఎన్ యూ ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్, మావోయిస్టులపై అభియోగాలు నమోదు చేశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు బస్తర్ రేంజ్ ఐజీ ఎస్ ఆర్పీ కాళ్లూరి తెలిపారు.
కుమాకోనెంగ్ గ్రామ పంచాయతీ పరిధిలోని నామా గ్రామానికి చెందిన శ్యామనాథ్ బాగహెల్ ను నవంబర్ 4న సాయుధ మావోయిస్టులు హత్య చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా తమ గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి శ్యామనాథ్ పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాడు. ఈ కారణంగానే అతడిని మావోయిస్టులు హత్య చేశారు. తమకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని పేర్కొంటూ నందినికి వ్యతిరేకంగా మే నెలలో తన భర్త ఫిర్యాదు చేసినట్టు శ్యామనాథ్ భార్య తెలిపింది. నందినితో పాటు తన భర్త హత్యకు కారణమైన మావోయిస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది.
రిచా కేశవ్ అనే పేరుతో నామా గ్రామానికి వెళ్లి మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టొద్దని నందిని బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. నందిని, అర్చనపై దర్యాప్తు చేపట్టనున్నట్టు డీయూ, జేఎన్ యూ వీసీలకు తెలిపామన్నారు.