ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): మంత్రగాడనే అనుమానంతో ఓ గిరిజన వృద్ధుడిని హత్య చేసి గోదావరిలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, మంగళవారం పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన దుమ్ముగూడెం మండలం కే మారేడుబాకలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కే మారేడుబాక గ్రామానికి చెందిన కుంజా భీమయ్య(65) మే 12 నుంచి కనిపించడం లేదు. దీనిపై అతడి కుటుంబ సభ్యులు 13న దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు కొనసాగించారు.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం మారేడుబాక గ్రామానికి చెందిన తెల్లం శ్రీను, కుంజా లక్ష్మీనారాయణ, తెల్లం రాజారావు అలియాస్ రాజ్‌కుమార్, మిడియం శ్రీను అనే నలుగురు స్టేషన్‌కు వచ్చి నేరం ఒప్పుకున్నారు. భీమయ్య మంత్రాలు, చేతబడులు చేస్తుంటాడని.. తెల్లం శ్రీను భార్యకు నాలుక మీద పుండ్లు అయ్యాయని, లక్ష్మీనారాయణ పెద్ద కొడుకు రెండు నెలల క్రితం డెంగీ జ్వరంతో చనిపోయాడని, రాజ్‌కుమార్ తల్లికి చాలా రోజుల నుంచి కాళ్లు, చేతుల వాపులు ఉన్నాయని, మిడియం శ్రీను తండ్రి ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయాడని.. వీటన్నింటికీ భీమయ్య కారణమనే కోపంతో మే 12వ తేదీ అర్ధరాత్రి ఉరి వేసి చంపామని తెలిపారు.
మృతదేహాన్ని నర్సాపురం గ్రామ శివారులో గల గోదావరి ఒడ్డున పూడ్చిపెట్టామని సీఐకి వివరించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని గోదావరి ఒడ్డుకు వెళ్లి తహసీల్దార్ రవికుమార్ సమక్షంలో శవాన్ని బయటకు తీశారు. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేనంతగా ఉండటంతో వెంటనే పంచనామా నిర్వహించి పోస్టుమార్టం జరిపి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment