జ్ఞాన్ వాపి మసీదును వివాదాస్పద స్థలంగా మార్చడానికి గతంలోనూ ప్రయత్నించారు. 1991వ సంవత్సరం నుంచి మత స్థలాల ప్రతిపత్తికి చెందిన విస్పష్టమైన చట్టం అమలులో ఉన్నప్పటికీ ముస్లింల చేతుల్లోంచి మసీదును లాక్కోవాలనే డిమాండుకు హేతువును జొప్పించడానికి నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు.
వారణాసిలో జ్ఞాన్ వాపి మసీదులో సర్వేని కొనసా గించడానికి అనుమతించడం ద్వారా భారత అత్యున్నత న్యాయస్థానం కొన్ని విమర్శలకు తావిచ్చింది. జ్ఞాన్ వాపి మసీదులో సర్వే జరపాలని వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశంతో అక్కడ ఒక సంక్షోభం ఏర్పడింది. మసీదులో ఒక భాగాన్ని మూసివేయాలనీ, అక్కడికి ఎవరినీ అనుమతించవద్దనీ ఆదేశించడం ద్వారా న్యాయస్థానం మసీదు స్వరూపాన్నే మార్చి పడేసింది. ఈ అంశంలో కోర్టు ఎంత వేగంగా స్పందించిందంటే, మన న్యాయ స్థానాలు నిదానంగా వ్యవహరించే తీరుకు పూర్తి భిన్నంగా కనిపించింది. ఇది జరిగిన 3 రోజులకు అంటే మే 20 నాటికి కోర్టుకు సీల్డ్ కవర్లో పంపించిన వీడియో సర్వే వివరాలు దేశం మొత్తానికీ తెలిసిపోయాయనుకోండి!
జ్ఞాన్ వాపి మసీదును వివాదాస్పద స్థలంగా మార్చడానికి గతంలోనూ అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే అలాంటి ప్రతి సందర్భంలోనూ అలహాబాద్ హైకోర్టు ఆ ప్రయత్నాలను నిలువరించింది. 1991 నుంచి మత స్థలాల ప్రతిపత్తికి చెందిన విస్పష్టమైన చట్టం అమలులో ఉన్నప్పటికీ ముస్లింల చేతుల్లోంచి మసీదును లాక్కోవాలనే డిమాండుకు హేతువును జొప్పించడానికి నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. 1947 ఆగస్టు 15 నాటికి ఉనికిలో ఉంటున్న మతస్థలాల ప్రతిపత్తిని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చకూడదని ఆ చట్టం స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి ప్రక్రియను అను మతించినట్లయితే అది తప్పకుండా ఏదో ఒక మతానికి సంబంధించిన రూపాన్ని లేక లక్షణాన్నైనా మార్చివేయడానికే దారితీస్తుందని ఆ చట్టం సూచిస్తోంది.
బాబ్రీ మసీదును ఈ ప్రార్థనా స్థలాల చట్టం పరిధిలోకి తేలేదు. కాబట్టే దాన్ని ధ్వంసం చేశారు, ఆ భూమిని కూడా (న్యాయబద్ధంగా) లాక్కు న్నారు. అయితే ఆ ప్రయత్నంలో కూడా, మత స్థలాల ప్రతిపత్తికి సంబంధించి 1991 చట్టం చెప్పినదాన్ని కచ్చితంగా పాటించాలని సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీనర్థం ఏమి టంటే, మతస్థలం స్వరూపాన్ని ప్రశ్నించే ఏ చర్యనూ ప్రోత్సహించకూడదనే! హిందూ సెంటి మెంట్లను ఈ దేశంలో ఏ కోర్టూ నిర్లక్ష్యం చేయదు. కాబట్టే తాము పూజించే దేవతల విగ్రహాలు మసీదు ఆవరణలో ఉన్నందున వాటిని పూజించే హక్కు తమకుందని భక్తులు వాదిస్తే కోర్టులు వారి వాదనను తప్పక వింటాయి. వెంటనే ఇదే అంశంపై అలహాబాద్ హైకోర్టు సమన్వయ బెంచ్ ఇచ్చిన స్టే ఆర్డర్లను కూడా సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. అంతే కాకుండా మసీదు రూపం ఎలా ఉందో నిర్ధారించుకోవడానికి మసీదు సర్వేపై ఆదే శాలు జారీ చేసింది. ఈ క్రమంలో మసీదు స్వరూపమే వివాదాస్పదంగా మారిపోయింది.
హిందూ సభ్యులతో కూడిన ఆ సర్వే టీమ్ మసీదులోని వజూఖానాలో ఒక శివ లింగాన్ని కనుక్కుంది. ముస్లింలు అది లింగం కాదు ఫౌంటైన్ అని ప్రకటించారు. ఇదే మరింత ఆమోద నీయంగా కనిపిస్తోంది. తాము ప్రార్థనలు జరిపే ముందు కాళ్లూ చేతులు కడుక్కునే స్థలమే అదని ముస్లింలు మొత్తుకుంటున్నా, భూమి ఉపరితలం పైన శివలింగాన్ని తాము చూశామని చెబు తున్న హిందువులతో ఎవరు విభేదించగలరు? మసీదు లోపల శిలకు ఎరుపురంగు రాసింది చూశామనీ, ఆ ఇమేజ్ ‘హనుమాన్’ అనీ సర్వే టీమ్ ప్రకటిం చింది. ఈ వార్త వెల్లడయ్యాక సర్వే టీమ్ లేదా దాని హిందూ సభ్యులు కోర్టుకు పరుగెత్తారు.
బీజేపీ శ్రేణులకు ఇది అమితానందం కలిగించే విషయమే. 1949లో కాళరాత్రి వేళ అతి రహస్యంగా జరిపిన చర్యలో విగ్రహాలను బాబ్రీ మసీదులోకి తరలించారు. సుప్రీంకోర్టు ఆనాడే దాన్ని నేరపూరిత చర్య అని పిలిచింది. 73 ఏళ్ల తర్వాత మరో నేరపూరిత చర్య జరిగింది. పట్ట పగలు న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో ఆ నేరం జరిగిపోయింది.
అలహాబాద్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గోవింద్ మాధుర్ ఒక వ్యాసంలో, ఈ ప్రార్థనా స్థలాల ప్రతి పత్తిపై చట్టం ఉద్దేశం... మరో బాబ్రీమసీదు తరహా విధ్వంస చర్య, ఆక్రమణ చర్య జరగకూడ దనేదేనని చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? ఉద్దేశపూర్వకంగా, తెలిసి తెలిసీ ఘర్షణకు దారితీసే ప్రక్రియను ప్రారంభించడమే కదా! సుప్రీంకోర్టు వారణాసి కోర్టు నిర్ణయాన్ని తోసి పుచ్చి 2022 మే 16కి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించిన ట్లయితే అలాంటి హింసాత్మక పరిణామం జరగకుండా ఇప్పటికైనా నిలిపి వేయవచ్చు. (చదవండి: ఇది ఎదురుకాల్పుల కనికట్టు కథ!)
అయితే 1991 నాటి చట్టాన్ని సవాలు చేస్తున్న పిటిషన్‌ని విచారించడానికి సుప్రీకోర్టు సంసిద్ధత తెలపడంవల్ల మనకు ఒక విషయం బోధపడుతుంది. అదేమిటంటే, ఈ దేశంలో ముస్లింల శాంతి, సామరస్యం, న్యాయం, గౌరవం వంటి వన్నీ ఏదో ఒక విస్తృతమైన లక్ష్యం కోసం ఎల్లప్పుడు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ లక్ష్యం ఏమిటో ఊహించడం ఇప్పుడు ఏమంత కష్టమైన పని కాదు. (చదవండి: మతం, మార్కెట్ కలిసిన రాజకీయం)
- అపూర్వానంద్
హిందీ అధ్యాపకుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయం
Comments
Please login to add a commentAdd a comment