ఆశ్రమ బడిలో అన్నీ సమస్యలే
సమస్యలతో గిరిజన ఆశ్రమ పాఠశాలల
కనీస సదుపాయాలకు దూరంగా విద్యార్థులు
పట్టింపులేని ప్రజాప్రతినిధులు, అధికారులు
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలు నిర్వహణలోపంతో కునారిల్లుతున్నాయి. అరకొర సిబ్బం ది.. అంతంతమాత్రంగా తరగతి గదులు.. నిర్వహణలోపంతో నిరుపయోగంగా మారిన మరుగుదొడ్లు, మూత్రశాలలు.. వెరసి విద్యార్థులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల దుస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఎక్కడ పడితే అక్కడే
ఏటూరునాగారం : ఏజెన్సీలోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిం చేందుకు ప్రభుత్వం నెలకొల్పిన ఆశ్రమ పాఠశాలలు సమస్యలకు లోగిళ్లుగా మా రాయి. ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనం, అధికారుల నిర్లక్ష్యంతో ఆయా పాఠశాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఏటూరునాగారం, చెల్పాక పాఠశాలల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి.
ఇవీ సమస్యలు
ఏటూరునాగారం ఆశ్రమ పాఠశాలలో గణితం, హిందీ, పీఈటీ పోస్టులు మూడేళ్ల నుంచి ఖాళీగా ఉంటున్నాయి.ఇక్కడి పాఠశాలలో డైనింగ్ హాల్, కిచెన్, అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తికాకపోవడంతో విద్యార్థులు వరండాల్లోనే కూర్చుని చదువుకుంటున్నారు. శిథిలమైన వరండాల కిందనే సిబ్బంది వంటలు చేస్తున్నారు. వర్షం కురిసిన సమయంలో తరగతులు నిర్వహించడం లేదు. ఇప్పటి వరకు విద్యార్థులకు స్కూల్ డ్రెస్‌లు, ట్రంకుబాక్సులు, ప్లేట్లు రాలేదు. చెల్పాక పాఠశాలలో అదనపు గదులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు పడుకునే గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి పాఠశాలలో నూతనంగా నిర్మించిన భవనంలోని మరుగుదొడ్ల వ్యర్థపు పైపును కాంట్రాక్టర్ కొన్ని రోజుల క్రితం పగులగొట్టారు. దీంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా ఉన్నాయి. కొత్తగా నిర్మించిన వాటర్‌ట్యాంకు అడుగు భాగంలో పగుళ్లు ఏర్పడడంతో ఎప్పుడూ కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు లేకపోవడంతో విద్యార్థులు రాత్రివేళలో దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. వంట గది లేకపోవడంతో హాస్టల్ సిబ్బంది ఆరుబయటనే వంటలు వండుతున్నారు.
హామీలు.. బుట్టదాఖలు
నల్లబెల్లి : మండలంలోని మూడుచెక్కలపల్లి గిరిజ న బాలికల ఆశ్రమ పాఠశాలలో రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి పాఠశాలలో 502 మంది విద్యార్థినులు చదువుకుంటున్నప్పటికీ వారికి తగిన సదుపాయాలు కల్పించడంలేదని తెలుస్తోంది. గతేడాది పాఠశాలకు చెందిన విద్యార్థినులు బానోతు భూమిక, బానోతు ప్రియాంక అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సమయంలో అధికారులు రక్షణ చర్యలు చేపడుతామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చినా నేటివరకు అమలు కాకపోవడం గమనార్హం.
ఇవీ సమస్యలు
పాఠశాలలో సెక్యూరిటీ గార్డులను నియమించకపోవడంతో రాత్రివేళలో విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు.పాఠశాల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సందర్శకుల రాకపోకలను గమనిస్తామని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ హామీ ఇచ్చినా నేటివరకు అమలుకాలేదు. గతేడాది ఇదే పాఠశాలలో చదువుకున్న విద్యార్థినులకు 80 శాతం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్స రంలో ప్రవేశం పొందిన 240 మందికి ఇప్పటివరకు పుస్తకాలు ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రహరీ లేక పరేషాన్
కురవి : మండలంలోని కంచర్లగూడెం తండాలోని డీఎన్‌టీపీఎస్ (డీనోటిఫైడ్ ట్రైబల్ ప్రైౖమరీ స్కూల్) సమస్యలతో సతమవుతోంది. పాఠశాల విద్యార్థుల పరిరక్షణను పట్టించుకునే నాథుడే కరువవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇవీ సమస్యలు
కంచర్లగూడెం డీఎన్టీపీఎస్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు మహబూబాబాద్–డోర్నకల్ ప్రధాన రహదారి పక్కన ఉన్న చేతి పంపు వద్దకు వెళ్తున్నారు. స్కూల్‌కు ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.
అయితే మాకేంటి..!
కొత్తగూడ : మండలంలోని సాధిరెడ్డిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సమస్యలకు నిలయంగా మారిం ది. ఈ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలకు పంపిస్తున్నారు. ఏజెన్సీ పాఠశాలల నిర్వహణను అధికారులు పట్టించు కోవడంలేదని చెప్పేందుకు ఈ బడి నిదర్శనంగా నిలుస్తుంది.
ఇవీ సమస్యలు
సాధిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అంతంత మాత్రంగా భోజనం అందిస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు స్కూల్ భవనంపై పెద్ద చెట్టు కూలిపడినా దానిని ఇప్పటివరకు తొలగించలేదు. దీంతో విద్యార్థులు భయపడుతున్నారు.పాఠశాల వంట గది రేకులు గాలి దుమారానికి లేచిపోయినా కొత్తవాటిని ఏర్పాటు చేయలేదు. స్కూల్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సాధిరెడ్డిపల్లి నుంచి పొగుళ్లపల్లి జెడ్పీ పాఠశాలకు పంపిస్తున్నారు.
ఉన్నా ఉట్టిగనే..
మహబూబాబాద్ రూరల్ : మండలంలోని రెడ్యాల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. 1976లో ఇక్కడ ఏహెచ్ఎస్ ప్రారంభమైనప్పటికీ విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడంలేదు. ఫలితంగా వారు నిత్యం సమస్యలతో సహవాసం చేయాల్సి వస్తుంది. ఈ పాఠశాలలో 3 నుంచి 10 తరగతుల వరకు ఇంగ్లిష్, తెలుగు మీడియంలో విద్యాబోధన చేస్తున్నారు. 601 మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో హెచ్ఎం, 12 మంది ఉపాధ్యాయులు, 10 మంది సీఆర్టీలు పనిచేస్తున్నారు.
ఇవీ సమస్యలు
పాఠశాల బావిలోని నీరు నల్లగా ఉండడంతో విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. 21 మరుగుదొడ్లు, 8 స్నానాల గదులకు నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. స్నానాల గదులకు నీటి వసతి లేకపోవటంతో విద్యార్థులు ఆరుబయటనే చేస్తున్నారు. బకెట్లతో నీళ్లు పట్టుకుని బహిర్భూమికి వెళ్తున్నారు. మరుగుదొడ్ల నిర్వహణకు పారిశుద్ధ్య సిబ్బంది లేరు.విద్యార్థులకు అవసరమైన బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, స్పోర్స్ మెటీరియల్ లేవు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ పాఠశాలకు ఏఎన్ఎంను కేటాయించలేదు.పాఠశాల ఆవరణలో ఉన్న ఒక చేతి పంపు సరిగా పని చేయటం లేదు.
విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు మీడియం పాఠ్య పుస్తకాలు చాలా వరకు రావాల్సి ఉంది. పాఠశాలలో గ్రౌండ్ లెవలింగ్ లేకపోవడంతో వర్షం కురిసినప్పుడు పరిసరాల్లో మురుగునీరు నిలుస్తుంది.
అధ్వానం.. అస్తవ్యస్తం
మహబూబాబాద్ : పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల అసౌకర్యాలకు నిలయం గా మారింది. ఏళ్ల తరబడి విద్యార్థినులను సమస్య లు పట్టిపీడిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యా రు. ఫలితంగా వారు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పాఠశాల సమస్యలు పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ సమస్యలు
పాఠశాలలో గదుల కొరత తీవ్రంగా ఉంది.ఇక్కడ 25 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా.. 19 మంది మాత్రమే పనిచేస్తున్నారు.15 మంది సీఆర్టీలుండగా నలుగురు రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. తరగతి గదుల కొరతతో చెట్ల కిందనే కొన్ని క్లాసులను నిర్వహిస్తున్నారు. మరికొన్నింటిని డైనింగ్ హాల్లో నిర్వహిస్తున్నారు.పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది.మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండడం తో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు.