సింగపూర్.. దుబాయ్.. లండన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విలన్ విదేశాల్లో ఉంటాడు. అతడి ముఠా సభ్యులు స్థాని కంగా వరుస హత్యలకు పాల్పడుతుంటారు. కొంతమంది పోలీసులు విలన్ అడుగులకు మడుగులొత్తుతూ ముఠా సభ్యులకు సహాయపడుతుంటారు. మరోపక్క విలన్ బాధిత కుటుంబం పగ తీర్చుకునే వరకు చనిపోయిన వారి కర్మకాండలు చేసేది లేదని భీషణ ప్రతిజ్ఞ చేస్తుంది. ఇలాంటివన్నీ పక్కా కమర్షియల్ తెలుగు సినిమాల్లో విలనోచిత సన్నివేశాలుగా వెండితెరపై చూస్తుంటాం. కానీ.. పెదవేగి మండలం పినకడిమికి చెందిన వ్యక్తుల హత్యల పరంపర వెనుక సరిగ్గా ఇలాంటి కథే నడిచింది.
ఆరు నెలల క్రితం పినకడిమిలో జరిగిన జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు హత్య కేసులో ప్రధాన నిందితుడైన తూరపాటి నాగరాజు పోలీ సులకు చిక్కినట్టే చిక్కి ఆనక ముంబై పరారయ్యాడు. ఆరు నెలలు దాటినా ఇప్పటికీ పోలీసులు అతని ఆచూకీ కనుగొనలేకపోయారు. ఇక దుర్గారావు హత్యకు ప్రతీకారంగా కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద జరిగిన ట్రిపుల్ మర్డర్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భూతం గోవిందు సింగపూర్, దుబాయ్, లండన్లలో చక్కర్లు కొడుతున్నాడు. ఆగస్టు 3న సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన గోవిందు ఆ తర్వాత అరబ్ ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా లండన్ వెళ్లినట్టు గుర్తించామని విజయవాడ పోలీస్ కమిషనర్
ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు. అతని అరెస్ట్ కోసం ఇంటర్‌పోల్ సాయం కోరామని, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశామని చెప్పారు. అతని ఆచూకీ కోసం విదేశీ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఇంతటి ఘనచరిత్ర నమోదు చేసిన గోవిందుకు ఏలూరు నగరంలో పనిచేసి ఆ తర్వాత బదిలీపై విజయవాడ వెళ్లిన ఓ పోలీసు అధికారి అన్నిరకాలుగా అండదండలు అందించారన్న ఆరోపణలున్నాయి. సదరు పోలీసు అధికారిని ఆరాతీస్తే గోవిందు వ్యవహారాలన్నీ బయటపడతాయని స్వయంగా ఏలూరులోని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నాగరాజుకు ఒకరు.. గోవింద్‌కు మరో పోలీస్ అండ
పినకడిమికి చెందిన వ్యక్తుల హత్య కేసుల్లో ప్రధాన నింది తులు ఇప్పటికీ పోలీసులకు పట్టుబడలేదు. తూరపాటి నాగరాజుకు ఏలూరులోని వన్‌టౌన్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి మొదటి నుంచీ అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించారన్న ఆరోపణలున్నాయి. లక్షలాది రూపాయలు తీసుకుని స్టేషన్ నుంచే పరారీకి సహకరించారన్న ఆరోపణలపై ఇప్పుడు పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది. అయితే గోవిందుకు సహకరించిన మరో పోలీస్ అధికారి వ్యవహార శైలిపైనా ఇప్పుడు ఉన్నతాధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
గతంలో ఏలూరులో సీఐగా పనిచేసి ఆ తర్వాత పదోన్నతిపై విజయవాడ వెళ్లిన ఓ అధికారి పాత్రపైనా విచారణ చేస్తున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏలూరులోని అశోక్‌నగర్‌లో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్న సదరు అధికారి ఇంటికి గోవింద్ రెండుసార్లు వచ్చాడని అంటున్నారు. ంటి నిర్మాణానికి తనవంతు సాయం అందించాడని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సదరు అధికారి సెల్‌ఫోన్ కాల్ డీటెయిల్స్ ఆరా తీస్తే ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో బయటపడుతుందని అంటున్నారు. ఇలా రూ.లక్షలు తీసుకుని నాగరాజుకు ఓ అధికారి, గోవింద్‌కు మరో పోలీస్ అధికారి సహకరించారన్న వార్తలు పోలీసు శాఖ పరువును మంటగలుపుతున్నాయని స్వయంగా ఆ శాఖ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
భద్రత కల్పించారా.. దగ్గరుండి హత్య చేయించారా?
పెదఅవుటపల్లి వద్ద హత్యలు జరగడానికి ముందు హతుల నుంచి సొమ్ము తీసుకుని బందోబస్తుకు వెళ్లిన పోలీసుల తీరుపై హతుడు గంధం నాగేశ్వరరావు భార్య యాదగిరమ్మ ఆరోపణలు చేస్తోంది. ఏలూరు పోలీసుల ప్రోద్బలంతోనే హత్యలు జరిగాయని వాదిస్తోంది. ఏలూరు టూ టౌన్ పోలీ సులు కాసుల కోసం కక్కుర్తిపడి హతులకు బందోబస్తు ఇచ్చినట్టు నమ్మించారా లేక నాగేశ్వరరావు భార్య ఆరోపిస్తున్నట్టు నేరస్తులతో చేతులు కలిపి దగ్గరుండి మరీ హత్యలు చేయి ంచారా అన్న విషయంపైనా పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
సీబీఐ దర్యాప్తు చేపట్టాలి : యాదగిరమ్మ
పినకడిమి వాసుల హత్యోదంతంలో పోలీసు అధికారుల పాత్ర ఉందని, విచారణ నిష్పక్షపాతంగా సాగాలంటే అత్యున్నత విచారణ సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని మృతుడు గంధం నాగేశ్వరరావు భార్య యాదగిరమ్మ డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు పోలీసులపై తనకు నమ్మకం లేదంటూ ఇప్పటికే విజయవాడ పోలీసులను ఆశ్రయించిన ఆమె గురువారం తనను కలిసిన విలేకరుల వద్ద సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. హత్యల పరంపర ఆగిపోవాలంటే అసలు నేరస్తులు పట్టుపడాలని, సీబీఐ రంగప్రవేశం చేస్తేనే ఈ కేసులు ఓ కొలిక్కి వస్తాయని ఆమె వాదిస్తున్నారు.
క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం : ఎస్పీ
పినకడిమికి చెందిన వ్యక్తుల హత్యల పరంపరలో పోలీసుల పాత్రపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ కె.రఘురామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అదనపు ఎస్పీ ఎన్.చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో చేపట్టిన విచారణ ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిందని చెప్పా రు. హత్యలతో పోలీసులకు సంబంధముందా లేక ఆర్థిక లావాదేవీలకే పరిమితం అయ్యూరా అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల సెల్‌ఫోన్ కాల్స్ వివరాలతోపాటు బ్యాంకు లావాదేవీలను సైతం పరి శీలిస్తున్నామని వివరించారు. ఆరోపణలు రుజువైతే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. దుర్గారావు హత్య కేసులో నిందితుల పరారీపై అప్పట్లోనే పోలీసులు సీరియస్‌గా స్పందిస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని ఎస్పీ వ్యాఖ్యానించారు.