విజయవాడ సిటీ : జిల్లాలోని ఉంగుటూరు మండలం పెద అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన గంధం నాగేశ్వరరావు, ఆయన కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్య హత్య కేసులో ప్రధాన కుట్రదారుడైన భూతం గోవింద్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విదేశాల్లో తలదాచుకున్న గోవింద్‌ను రప్పించేందుకు ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా గోవింద్ ఆచూకీ కోసం ‘రెడ్‌కార్నర్’ నోటీసు జారీ చేసి విదేశీ మీడియా ద్వారా ఫొటోలను విస్తృత ప్రచారం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు, పగిడి మారయ్య, గుంజుడు మారయ్య గత నెల 24న ఏలూరు కోర్టు వాయిదాకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రైవే ట్ వాహనంలో వెళుతుండగా పెదఅవుటుపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై కిరాయి హంతకులు కాల్చి చంపారు. ఈ ఘటనపై నమోదైన కేసులో 20 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏడుగురు సభ్యుల ఢిల్లీ గ్యాంగ్ సహా 10 మందిని అరెస్టు చేశారు. మరో 10మందిని అరెస్టు చేయాల్సి ఉంది.
వీరిలో భూతం గోవింద్‌ను ప్రధాన కుట్రదారుగా పోలీసులు గుర్తించారు. తన సోదరుడు భూతం దుర్గారావు హత్య కేసులో నిందితులను చంపాలని గోవింద్ నిర్ణయించుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం విదేశంలోనే పథకం రూపొందించాడని వారు పేర్కొంటున్నారు. అక్కడి నుంచి తన అనుచరుల ద్వారా ఢిల్లీ కిల్లర్ గ్యాంగ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకుని హత్యలు చేయించినట్లు వారు నిర్ధారించుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా గోవిందు పాత్ర కీలకమని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్న గోవింద్‌ను రప్పించేందుకు సీఐడీ విభాగం ద్వారా సీబీఐకి లేఖ రాయనున్నారు. తద్వారా సీబీఐ వర్గాలు ఇంటర్‌పోల్‌సాయంతో నిందితుణ్ణి విదేశాల నుంచి రప్పించే అవకాశాలున్నాయి. విదేశాల్లో సాధారణ జీవితం గడుపుతున్న గోవింద్‌ను దేశానికి రప్పించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇంటర్‌పోల్ సాయంతో త్వరలోనే పట్టుకుంటామని వారు పేర్కొంటున్నారు.
గోవింద్ చుట్టూ బిగుస్తున్నఉచ్చు
Published Fri, Oct 17 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM
Advertisement
Advertisement