85 పరుగుల ముందు...
సాక్షి, హైదరాబాద్: తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం హైదరాబాద్ చివరి రోజు పోరాడింది. ప్రతీ బ్యాట్స్‌మన్ తన పరిధిలో ధాటిగా ఆడి వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేశారు. ఫలితంగా 93 ఓవర్లలో జట్టు 308 పరుగులు చేయగలిగింది. అయితే త్రిపుర స్కోరును దాటేందుకు ఇది సరిపోలేదు. దాంతో మూడు పాయింట్లు సాధించలేక...ఒక పాయింట్‌కే పరిమితమైంది. ఆలౌట్ కాకుండా జాగ్రత్త పడటంతో ప్రత్యర్థిని కూడా ఒక పాయింట్‌కే నిలువరించింది. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, త్రిపుర మధ్య రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ సోమవారం డ్రాగా ముగిసింది.
నాలుగో రోజు ఆట ముగిసే సరికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 171 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 566 పరుగులు చేసింది. ద్వారకా రవితేజ (325 బంతుల్లో 175; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ సెంచరీ సాధించాడు. త్రిపుర బౌలర్లలో తుషార్ సాహా 5 వికెట్లు పడగొట్టాడు. 2013-14 సీజన్లో గ్రూప్ ‘సి’లో ఐదు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 12 పాయింట్లతో ప్రస్తుతం ఏడో స్థానంలో (మొత్తం 9 జట్లు) నిలిచింది. తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకే నాకౌట్‌కు అర్హత పొందే, వచ్చే సీజన్లో ప్రమోషన్ పొందే అవకాశం లభిస్తుంది. గోవా, జమ్మూ కాశ్మీర్, కేరళ (సొంతగడ్డపై)లతో మాత్రమే మ్యాచ్‌లు మిగిలి ఉన్న హైదరాబాద్ ఇక ఏ మాత్రం పోరాడి ముందంజ వేస్తుందో చూడాలి.
తలా ఓ చేయి...
ఓవర్‌నైట్ స్కోరు 258/1తో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే రవితేజ 218 బంతుల్లో సెంచరీ చేశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతనికి ఇది ఏడో సెంచరీ. అయితే ఆ వెంటనే హైదరాబాద్ అక్షత్ రెడ్డి (251 బంతుల్లో 149; 20 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కోల్పోవడంతో 250 పరుగుల భారీ పార్ట్‌నర్‌షిప్‌కు తెర పడింది. ఈ దశలో విహారి (104 బంతుల్లో 55; 3 ఫోర్లు) తో కలిసి రవితేజ మరో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాక విహారి వెనుదిరిగాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 131 పరుగులు జత చేశారు. 290 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్న రవితేజ, సాహా బౌలింగ్‌లో అవుటయ్యా డు. అంతే...ఆ తర్వాత స్కోరు వేగం మందగిం చింది. సందీప్ (59 బంతుల్లో 41; 4 ఫోర్లు), ఖాద్రీ (52 బంతుల్లో 40; 4 ఫోర్లు) కొద్ది సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. 3 పరుగుల వద్ద కీపర్ టకవాలే స్టం పింగ్ మిస్ చేయడంతో బతికిపోయిన షిండే (96 బంతుల్లో 35 నాటౌట్; 6 ఫోర్లు) క్రీజ్‌లో పాతుకుపోయి జట్టు ఆలౌట్ కాకుండా నిలబెట్టాడు. ఐదు మ్యాచుల్లో ఓడిన త్రిపుర ఆరో మ్యాచ్‌లో ఒక పాయింట్‌తో బోణీ చేయడం విశేషం.