OTT: హాలీవుడ్ మూవీ ‘ట్రబుల్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ట్రబుల్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.వినోదానికి భాష, ప్రాంతం ముఖ్యం కాదు. ప్రాంతాల సరి హద్దులు చెరిపేసి, భాషల హద్దులు మరిచి నవరసాల్లో హాస్యరసానికి పెద్ద పీట వేసే దర్శకులు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. అందుకే వారు రూపొందించిన సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువ. స్వీడిష్ దర్శకుడు జాన్ హాంబర్గ్ ఇటీవల తీసిన ‘ట్రబుల్’ సినిమా ఇందుకు ఓ ఉదాహరణ. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. ఒక ఎలక్ట్రానిక్స్ షాపులో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్న కాణీకి సంబంధించిన కథ ఈ ‘ట్రబుల్’. కాణీకి ఒక్కటే కూతురు. భార్య విడాకులిచ్చింది. కాణీకి సాధారణంగా సమస్యలు రావు, అయితే సమస్యలను తానే కొని తెచ్చుకునే కన్ఫ్యూజ్డ్ పర్సన్. కానీ కాణీ మంచి తెలివైనవాడు. ఓ టీవీని అమర్చేందుకు ఒకరి ఇంటికి వెళ్లినప్పుడు ఇతగాడి అత్యుత్సాహం ఓ హత్య కేసులో ఇరుక్కునేలా చేస్తుంది. కోర్టు అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. జైల్లో వేరేవాళ్లు తవ్విన సొరంగం గుండా బయటపడి తన సమస్యను ఎలా అధిగమించుకుంటాడో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ట్రబుల్’లోనే చూడాలి. ఈ సినిమాలో కాణీ పాత్రకు ప్రముఖ నటుడు ఫిలిప్ బర్గ్ ప్రాణం పోశారు. తన కన్ఫ్యూజింగ్ భావాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తాడు. అలాగే హీరోయిన్ ప్రాత్రలో ఎమీ, విలన్ పాత్రలో ఇవా తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. పైన చెప్పినట్టు పేరుకు స్వీడిష్ సినిమా అయినా చక్కగా మన తెలుగులో డబ్ అయి ఉంది. వీకెండ్ మూవీ వాచర్స్‌కు మంచి హ్యూమరస్ మూవీ ఇది. ఈ ‘ట్రబుల్’ చూసి కాసేపు మీ ట్రబుల్స్ మరిచిపోకండి. – ఇంటూరు హరికృష్ణ