టీఆర్ఎస్తో సత్సంబంధాలున్నాయ్: జైరాం
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య ఉన్నతస్థాయిలో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్ తెలిపారు. రాజకీయ అంశాల్లో రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. 2004లో యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామిగా ఉందని, ఇప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తు గురించి ప్రస్తుతం తనకేమీ తెలియదని పేర్కొన్నారు. ఏఐసీసీ అధినేత సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనతోనూ అన్నారని చెప్పారు. జైరాం బుధవారం వరంగల్‌లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశాం. చట్టం పక్కాగా ఉంది. రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎవరైనా కోర్టుకు వెళ్లవచ్చు(మాజీ సీఎం కిరణ్‌ను ఉద్దేశించి). తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ వల్లే సాకారమైంది. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే. తెలంగాణను ఏర్పాటు చేస్తూనే సీమాంధ్ర ప్రయోజనాలను కూడా రక్షించాం. కేంద్రంలో ప్రతిపక్ష బీజేపీ తెలంగాణ విషయంలో స్పష్టతతో వ్యవహరించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు తొలుత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లేఖ ఇచ్చి.. తర్వాత పొంతన లేకుండా మాట్లాడారు. కాంగ్రెస్‌లోనూ చిరంజీవి వంటి నేతలు వ్యతిరేకించినా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాం.
నిర్వాసితులకు దేశంలోనే మెరుగైన ప్యాకేజీ...
పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు భవిష్యత్తులో రెండు రాష్ట్రాలకు ఉంటాయని జైరాం స్పష్టంచేశారు. జాతీయ జల సంఘం అనుమతి వచ్చినందునే సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితులకు దేశంలోనే మెరుగైన పునరావాస ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని.. జలయజ్ఞం పథకం సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దీన్ని రూపొందించిందని చెప్పారు.