TRS defeat
-
‘ఓడిపోతున్నట్టు కేసీఆర్ అంగీకరించారు’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఓడిపోతున్నట్టు అంగీకరించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోతే ఇంట్లో పడుకుంటామని కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. అలా అయితే ఫలితాల వరకూ ఎదురుచూడటం ఎందుకని, ఇప్పుడే రాజకీయాలకు సెలవు చెప్పి ఇంట్లోనే పడుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఆయన నోటి నుంచి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన రోజే ఆయన రాజకీయ జీవితం అయిపోయిందని నారాయణ పేర్కొన్నారు. మేడ్చల్ సభలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో మహాకూటమి నేతలు వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. సోనియా పర్యటనతో కేసీఆర్ భయాందోళనకు గురువుతున్నారని చెప్పారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలదని, అలాంటి జనాలను మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ‘జన్ ఆక్రోశ్’ర్యాలీకి రాష్ట్ర నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల కల్పన హామీ కలగానే మారిందన్నారు. హామీల అమలులో విఫలమైన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. అలాగే రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని, టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడయ్యాక మొదటిసారి చేపట్టిన ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డీకె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, రాపోలు ఆనందభాస్కర్, మర్రి శశిధర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు రవి, ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తా
మీరూ సిద్ధమేనా అని ఉత్తమ్, రేవంత్‌లకు హరీశ్ సవాల్ పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామాకు సిద్ధమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం రాత్రి మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖేడ్‌లో టీఆర్ఎస్ ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. లేకుంటే పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. 18 నెలల్లో నారాయణఖేడ్‌ను రూ. 500 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి చనిపోక ముందే ఖేడ్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఓడిపోతామనే ఒత్తిడిలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ మంత్రిగా ఉన్నప్పుడు దామోదర రాజనర్సింహ నారాయణఖేడ్‌కు ఒక్క మార్కెట్యార్డునూ ఇవ్వలేదని, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు జానారెడ్డి ఈ ప్రాంతాన్ని ఏమి అభివృద్ధి చే శారో చెప్పాలన్నారు. ప్రజలకు తమపై విశ్వాసం ఉందని, ఆదరిస్తారని అన్నారు. వరంగల్‌లో ఇలాగే మాట్లాడితే అక్కడి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారన్నారు. ఉద్యమాలకు పురిటిగడ్డ సిద్దిపేట అని, దాని గురించి అవహేళనగా మాట్లాడితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, ఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.