టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తా
మీరూ సిద్ధమేనా అని ఉత్తమ్, రేవంత్‌లకు హరీశ్ సవాల్
పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓడిపోతే రాజీనామాకు సిద్ధమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం రాత్రి మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖేడ్‌లో టీఆర్‌ఎస్ ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. లేకుంటే పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. 18 నెలల్లో నారాయణఖేడ్‌ను రూ. 500 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు.
ఎమ్మెల్యే కిష్టారెడ్డి చనిపోక ముందే ఖేడ్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఓడిపోతామనే ఒత్తిడిలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ మంత్రిగా ఉన్నప్పుడు దామోదర రాజనర్సింహ నారాయణఖేడ్‌కు ఒక్క మార్కెట్‌యార్డునూ ఇవ్వలేదని, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు జానారెడ్డి ఈ ప్రాంతాన్ని ఏమి అభివృద్ధి చే శారో చెప్పాలన్నారు. ప్రజలకు తమపై విశ్వాసం ఉందని, ఆదరిస్తారని అన్నారు. వరంగల్‌లో ఇలాగే మాట్లాడితే అక్కడి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారన్నారు. ఉద్యమాలకు పురిటిగడ్డ సిద్దిపేట అని, దాని గురించి అవహేళనగా మాట్లాడితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, ఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.