TRS leadership
-
మండలి ప్రచారానికి గులాబీ దండు
9వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా పర్యటనలు మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో ప్రచారపర్వం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనమండలి ఎన్నికలను గులాబీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునేందుకు పార్టీ అగ్రనేతలను మోహరిస్తోంది. మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 22న జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి వ్యూహాత్మకంగా కదులుతోంది. టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన ఉద్యోగసంఘాల నేత దేవీప్రసాద్‌ను గెలిపించే బాధ్యతను నెత్తినెత్తుకున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈనెల 9వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా జరిగే ప్రచారపర్వంలో పాల్గొననున్నారు. కేటీఆర్ సహా జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొనే ఈ ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ శుక్రవారం ప్రకటించారు. 9న వికారాబాద్, తాండూరు, 10న చేవెళ్ల, పరిగి, 12న రాజేంద్రనగర్, మహేశ్వరం, 14న ఎల్బీ నగర్, 15న మల్కాజిగిరి, ఉప్పల్, 18న కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, 19న ఇబ్రహీంపట్నం, మేడ్చల్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొంటారని తెలిపారు. -
సైకిల్! టాప్‌గేర్ లో కారు
గులాబీ నాయకత్వం మాంచి ఊపుమీదుంది. పూర్తి స్థాయిలో బలోపేతం కావడంపై దృష్టి సారించింది. జిల్లాలో తెలుగుదేశంపార్టీని నామరూపాలు లేకుండా చేసే వ్యూహం కనిపిస్తోంది. దీనికి తగినట్లే, ఇక లాభం లేదనుకుంటున్న టీడీపీ నాయకులు కొందరు టీఆర్ఎస్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్వైపు .. టీడీపీ నేతల చూపు - ముఖ్యనేతలూ వలస వెళ్లే అవకాశం - ఇప్పటికే జరిగిన మాటాముచ్చట సాక్షిప్రతినిధి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత సాగర్ ఆయకట్టు నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందన్న తుది అభిప్రాయానికి టీఆర్ఎస్ నాయకత్వం వచ్చినట్లే కనిపిస్తోంది. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు, మొత్తంగా జిల్లాలో పూర్తిస్థాయిలో బలోపేతమయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే ముందు టీడీపీని వాష్‌ఔట్ చేసేపనిలో గులాబీ నాయకత్వం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే చేరికల ద్వారా బలపడే పనిలో టీఆర్ఎస్ ఉన్నట్లు ఇట్టే తెలిసిపోతుంది. తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న ఆయా పార్టీల నాయకుల స్థాయి, ఆయా నియోజకవర్గాల్లో వారికున్న బలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కోదాడ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు టీఆర్ఎస్కు వలసపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో మాటాముచ్చట కూడా జరిగిందని, ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరగణం, మరికొందరు నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం టీఆర్ఎస్లో చేరడానికి నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. నల్లగొండ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ నుంచి ఓ నేత సస్పెండ్ అయ్యారు. ఇటీవలే టీడీపీ నాయకత్వం ఆ నేతపై సస్పెన్షన్ ఎత్తివేసింది. అయినా, జిల్లాలో టీడీపీకి ఇక భవిష్యత్ లేదన్న తుది నిర్ణయానికి వచ్చిన ఆ నేత కారెక్కడానికి రెడీగా ఉన్నారని సమాచారం. అయితే, నల్లగొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్లో ఉన్న వివిధ సమీకరణాల నేపథ్యంలో కొద్దిగా ఆలస్యం జరిగినట్లు చెబుతున్నారు. పార్టీలోని సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి సహా పలువురు పట్టణ నాయకులు గులాబీ కండువాలు కప్పుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి కూడా కొద్ది మంది నాయకులు టీఆర్ఎస్ చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే, ఇతర పార్టీల కంటే టీడీపీ నుంచే ఎక్కువగా వలసలు ఉండే అవకాశం కనిపిస్తోంది. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి అనూహ్యంగా నార్కట్‌పల్లి ఎంపీపీ కావడంతో టీడీపీ నేతల్లో ఆలోచన మొదలైనట్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కోదాడ, హుజూర్నగర్ నియోజవకర్గాల నుంచి పలువురు నాయకులు గులాబీ జెండాలు కప్పుకునేందుకు తహతహలాడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన మరో ముఖ్య నాయకుడు సైతం టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, నల్లగొండ నియోజకవర్గాలను టీఆర్ఎస్ కోల్పోయింది. ఇప్పుడు ఇదే నియోజకవర్గాల నుంచి టీడీపీకి చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరడానికి సుముఖంగా ఉండి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు వినికిడి. ఎలాంటి కండీషన్లు పెట్టకుండా పార్టీ కోసం పనిచేయడానికి వచ్చే వారిని ఆహ్వానించాలని గులాబీ నాయకత్వం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి చేరికలు ఉపకరిస్తాయన్న ఆలోచనలో టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఉందని అంటున్నారు. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే జిల్లాలో టీడీపీ మనుగడ, ఉనికి ప్రశ్నార్థకం కానున్నాయి. -
హంగ్.. కింగ్
పాగా వేసేందుకు దృష్టి సారించిన టీఆర్ ఎస్ - ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలపై కన్ను - అధికార పార్టీ అని ఇండిపెండెంట్ల మొగ్గు - 10 మండలాలపై కన్నేసిన గులాబీ నేతలు సాక్షిప్రతినిధి, నల్లగొండ, ప్రాదేశిక ఎన్నికలు ముగిశాక, వెలువడిన ఫలితాలతో టీఆర్ఎస్ శ్రేణులు ఒకింత నిరాశకే గురయ్యాయి. అటు జెడ్పీ, ఇటు ఎంపీపీల విషయంలో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. 59 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా 43చోట్ల గెలిచింది. టీఆర్ఎస్ 13 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన సీట్లు 30 కాగా, కాంగ్రెస్‌కు అదనంగా మరో 13 సీట్లు చేతిలో ఉన్నాయి. దీంతో జెడ్పీ పీఠాన్ని తారుమారు చేసే అవకాశం ఎవరికీ కనిపించడం లేదు. కానీ, మండలాల్లో అధ్యక్ష పదవులను కైవసం చేసుకోవడానికి ఇప్పుడు టీఆర్ఎస్కు అవకాశం కలిసొచ్చింది. వాస్తవానికి 59 మండలాలకు గాను కాంగ్రెస్ 25 చోట పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి ఆయా మండలాల్లో అవసరమైన మెజారిటీ సాధిచింది. కాగా, టీఆర్ఎస్ కేవలం 3 మండలాల్లోనే పాలకవర్గాలను ఏర్పాటు చేసేంత మెజారిటీ పొందింది. కానీ, 28 మండలాల్లో ఏ పార్టీకి అవసరమైన మెజారిటీ రాక హంగ్ ఏర్పడింది. ఇపుడదేఁహంగ్ మండలాలను తన ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన తుంగతుర్తి, ఆలేరు, మునుగోడు మండలాల్లోని అత్యధిక మండలాలను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇండిపెండెంట్ల సాయంతో మండల పాలక వర్గాలను ఏర్పాటు చేసేందుకు పక్కా వ్యూహంతో ఉంది. అధికార పార్టీ కావడం, స్థానికంగా ఎమ్మెల్యే కూడా ఉండడం వంటి కారణాలతో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎంపీటీసీ సభ్యులు టీఆర్ఎస్కే జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల ఒకరూ, ఇద్దరు చొప్పున ఉన్న ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు సైతం టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. పెద్దగా కష్టపడకుండానే హంగ్ ఏర్పడిన మండలాల్లో మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే పరిస్థితే కనిపిస్తోంది. ఇదీ.. లెక్క మునుగోడు నియోజకవర్గం పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు 7. కాగా, టీఆర్ఎస్కు ఇక్కడ 4 సీట్లు చేతిలో ఉన్నాయి. మరో ఆరుగురు ఇండిపెండెంట్లు ఉండడంతో వీరిలో ముగ్గురిని తమవైపు లాగేసుకుంటే ఈ మండలం టీఆర్ఎస్ సొంతం అవుతుంది. నాంపల్లి మండలం అధ్యక్ష పదవిని దక్కించుకోవాలంటే 7 సీట్లు కావాలి. కాగా, టీఆర్ఎస్కు 4 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ చేతిలో 5 సీట్లున్నా, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలిచారు. వీరిని టీఆర్ఎస్ తమలో కలిపేసుకునే అవకాశం ఉంది. వీరు మొగ్గితే ఈ మండలమూ టీఆర్ఎస్ ఖాతాలో చేరిపోతుంది. ఆలేరు నియోజకవర్గం పరిధిలోని యాదగిరిగుట్ట మండలంలో పాలకవర్గం ఏర్పాటు చేయడానికి 9 సీట్లు కావాలి. కాగా, ఇక్కడ టీఆర్ఎస్ చేతిలో 8 సీట్లు ఉన్నాయి. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. దీంతో ఒక్కరి మద్దతు పొందితే చాలు, ఈ మండలమూ టీఆర్ఎస్ చేతిలోకి వెళ్లిపోతుంది. రాజాపేట మండలంలోనూ ఇదే రకమైన పరిస్థితి. పాలకవర్గం ఏర్పాటు చేయడానికి 6 సీట్లు అవసరం కాగా, టీఆర్ఎస్కు 5 సీట్లున్నాయి. మరో ఇండిపెండెంటు కూడా ఉన్నారు. ఈయన మద్దతుతో మండల అధ్యక్ష పదవి టీఆర్ఎస్దే. ఇక్కడ కాంగ్రెస్‌కు 4 సీట్లే వచ్చాయి. తుర్కపల్లి మండలంలో టీఆర్ఎస్ 5 సీట్లు గెలుచుకున్నా, పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒక సీటు తక్కువగా ఉండడంతో ఇతరుల వైపు చూస్తోంది. ఒక సీటు చేతిలో ఉన్న టీడీపీ మద్దతు కూడగ ట్టడం కానీ, లేదంటే 4 సీట్లున్న కాంగ్రెస్ నుంచి ఒకరిని లాగేసుకోవడం కానీ ఇప్పుడు టీఆర్ఎస్ చేయాల్సి ఉంది. ఎమ్మెల్యే ఉండడం కలిసొచ్చే అంశం గుండాలలో ఆరు సీట్లున్న వారే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాగా, టీఆర్ఎస్ చేతిలో 4 సీట్లున్నాయి. కాంగ్రెస్, సీపీఐలకు చెరో రెండు సీట్లున్నా, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉండడంతో వారికి టీఆర్ఎస్ గాలం వేస్తోంది. ఇదే జరిగితే, ఈ మండలమూ టీఆర్ఎస్ ఖాతాలో చేరినట్లే. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని అర్వపల్లిలో 7 సీట్లుంటే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ, టీఆర్ఎస్ చేతిలో 5 సీట్లే ఉండడంతో, 3 సీట్లున్న ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకొనే పనిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కేవలం 2 సీట్లే ఉండడంతో ఆ పార్టీ కనీస ప్రయత్నం చేసే పరిస్థితి కూడా లేదు. ఈ మండలాలే కాకుండా మర్రిగూడ, తిరుమలగిరి, శాలీగౌరారం మండలాల్లోనూ ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని ఉండడం, ఈ మండల్లాల్లోనూ హంగ్ ఏర్పడినందున మెజారిటీ తక్కువగా ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నందున పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని కూడగట్టే పనిలో ఉన్నారు.