హంగ్.. కింగ్
పాగా వేసేందుకు దృష్టి సారించిన టీఆర్ ఎస్
- ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలపై కన్ను
- అధికార పార్టీ అని ఇండిపెండెంట్ల మొగ్గు
- 10 మండలాలపై కన్నేసిన గులాబీ నేతలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ, ప్రాదేశిక ఎన్నికలు ముగిశాక, వెలువడిన ఫలితాలతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఒకింత నిరాశకే గురయ్యాయి. అటు జెడ్పీ, ఇటు ఎంపీపీల విషయంలో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. 59 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా 43చోట్ల గెలిచింది. టీఆర్‌ఎస్ 13 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన సీట్లు 30 కాగా, కాంగ్రెస్‌కు అదనంగా మరో 13 సీట్లు చేతిలో ఉన్నాయి. దీంతో జెడ్పీ పీఠాన్ని తారుమారు చేసే అవకాశం ఎవరికీ కనిపించడం లేదు.
కానీ, మండలాల్లో అధ్యక్ష పదవులను కైవసం చేసుకోవడానికి ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు అవకాశం కలిసొచ్చింది. వాస్తవానికి 59 మండలాలకు గాను కాంగ్రెస్ 25 చోట పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి ఆయా మండలాల్లో అవసరమైన మెజారిటీ సాధిచింది. కాగా, టీఆర్‌ఎస్ కేవలం 3 మండలాల్లోనే పాలకవర్గాలను ఏర్పాటు చేసేంత మెజారిటీ పొందింది. కానీ, 28 మండలాల్లో ఏ పార్టీకి అవసరమైన మెజారిటీ రాక హంగ్ ఏర్పడింది. ఇపుడదేఁహంగ్ మండలాలను తన ఖాతాలో వేసుకునేందుకు టీఆర్‌ఎస్ వ్యూహరచన చేస్తోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన తుంగతుర్తి, ఆలేరు, మునుగోడు మండలాల్లోని అత్యధిక మండలాలను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.
ఇండిపెండెంట్ల సాయంతో మండల పాలక వర్గాలను ఏర్పాటు చేసేందుకు పక్కా వ్యూహంతో ఉంది. అధికార పార్టీ కావడం, స్థానికంగా ఎమ్మెల్యే కూడా ఉండడం వంటి కారణాలతో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎంపీటీసీ సభ్యులు టీఆర్‌ఎస్‌కే జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల ఒకరూ, ఇద్దరు చొప్పున ఉన్న ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు సైతం టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. పెద్దగా కష్టపడకుండానే హంగ్ ఏర్పడిన మండలాల్లో మెజారిటీ స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లే పరిస్థితే కనిపిస్తోంది.
ఇదీ.. లెక్క
మునుగోడు నియోజకవర్గం పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు 7. కాగా, టీఆర్‌ఎస్‌కు ఇక్కడ 4 సీట్లు చేతిలో ఉన్నాయి. మరో ఆరుగురు ఇండిపెండెంట్లు ఉండడంతో వీరిలో ముగ్గురిని తమవైపు లాగేసుకుంటే ఈ మండలం టీఆర్‌ఎస్ సొంతం అవుతుంది.
నాంపల్లి మండలం అధ్యక్ష పదవిని దక్కించుకోవాలంటే 7 సీట్లు కావాలి. కాగా, టీఆర్‌ఎస్‌కు 4 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ చేతిలో 5 సీట్లున్నా, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలిచారు. వీరిని టీఆర్‌ఎస్ తమలో కలిపేసుకునే అవకాశం ఉంది. వీరు మొగ్గితే ఈ మండలమూ టీఆర్‌ఎస్ ఖాతాలో చేరిపోతుంది.
ఆలేరు నియోజకవర్గం పరిధిలోని యాదగిరిగుట్ట మండలంలో పాలకవర్గం ఏర్పాటు చేయడానికి 9 సీట్లు కావాలి. కాగా, ఇక్కడ టీఆర్‌ఎస్ చేతిలో 8 సీట్లు ఉన్నాయి. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. దీంతో ఒక్కరి మద్దతు పొందితే చాలు, ఈ మండలమూ టీఆర్‌ఎస్ చేతిలోకి వెళ్లిపోతుంది.
రాజాపేట మండలంలోనూ ఇదే రకమైన పరిస్థితి. పాలకవర్గం ఏర్పాటు చేయడానికి 6 సీట్లు అవసరం కాగా, టీఆర్‌ఎస్‌కు 5 సీట్లున్నాయి. మరో ఇండిపెండెంటు కూడా ఉన్నారు. ఈయన మద్దతుతో మండల అధ్యక్ష పదవి టీఆర్‌ఎస్‌దే. ఇక్కడ కాంగ్రెస్‌కు 4 సీట్లే వచ్చాయి.
తుర్కపల్లి మండలంలో టీఆర్‌ఎస్ 5 సీట్లు గెలుచుకున్నా, పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒక సీటు తక్కువగా ఉండడంతో ఇతరుల వైపు చూస్తోంది. ఒక సీటు చేతిలో ఉన్న టీడీపీ మద్దతు కూడగ ట్టడం కానీ, లేదంటే 4 సీట్లున్న కాంగ్రెస్ నుంచి ఒకరిని లాగేసుకోవడం కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్ చేయాల్సి ఉంది. ఎమ్మెల్యే ఉండడం కలిసొచ్చే అంశం
గుండాలలో ఆరు సీట్లున్న వారే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాగా, టీఆర్‌ఎస్ చేతిలో 4 సీట్లున్నాయి. కాంగ్రెస్, సీపీఐలకు చెరో రెండు సీట్లున్నా, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉండడంతో వారికి టీఆర్‌ఎస్ గాలం వేస్తోంది. ఇదే జరిగితే, ఈ మండలమూ టీఆర్‌ఎస్ ఖాతాలో చేరినట్లే.
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని అర్వపల్లిలో 7 సీట్లుంటే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ, టీఆర్‌ఎస్ చేతిలో 5 సీట్లే ఉండడంతో, 3 సీట్లున్న ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకొనే పనిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కేవలం 2 సీట్లే ఉండడంతో ఆ పార్టీ కనీస ప్రయత్నం చేసే పరిస్థితి కూడా లేదు.
ఈ మండలాలే కాకుండా మర్రిగూడ, తిరుమలగిరి, శాలీగౌరారం మండలాల్లోనూ ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని ఉండడం, ఈ మండల్లాల్లోనూ హంగ్ ఏర్పడినందున మెజారిటీ తక్కువగా ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నందున పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని కూడగట్టే పనిలో ఉన్నారు.