ఈ నెల 6న టీఎస్ ఈసెట్
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: కన్వీనర్
సాక్షి, హైదరాబాద్: ఈనెల 6న జరిగే టీఎస్ ఈసెట్-2017 పరీక్షకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ పద్ధతిలో జరిగే ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 25,138 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నగరాల్లో 81 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో కరీంగనర్‌లో 5, ఖమ్మంలో 5, వరంగల్‌లో 6, హైదరాబాద్-1 పరిధిలో 25, హైదరాబాద్-2 పరిధిలో 13, హైదరాబాద్-3 పరిధిలో 12, హైదరాబాద్-4 పరిధిలో 15 కేంద్రాలున్నాయి.
హాల్‌టికెట్లను ecet.tsche.ac.in వెబ్సైట్ నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని, వెబ్సైట్లో మరింత సమాచారం పొందవచ్చని ఈసెట్ కన్వీనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందే సందర్శించాలని సూచించారు. పరీక్ష రోజున మధ్యాహ్నం 12.30 గంటల నుంచి కేంద్రంలోకి అనుమతిస్తారని, పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించమని కన్వీనర్ స్పష్టం చేశారు. హాల్‌టికెట్‌తో ఆన్లైన్ దరఖాస్తు పత్రం, ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలని చెప్పారు.