ఏఈఈ, ఏవో పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 17, 18వ తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు (సీబీఆర్టీ) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. హైదరాబాద్లో 48 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు దాదాపు 18 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు చెప్పారు.
హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు 17న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, 18న ఉదయం ఆప్షనల్ పేపర్ ఉంటుందని... అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు 17న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుందని... ఏఈఈ పోస్టులకు 18న ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుందని వివరించారు. జనరల్ స్టడీస్ పేపర్ తెలుగు, ఇంగ్లిషు రెండు మాధ్యమాల్లోనూ ఉంటుందని.. ఆప్షనల్ (సబ్జెక్టు) పేపర్ మాత్రం ఇంగ్లిషులోనే ఉంటుందని తెలిపారు.
వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్ష కేంద్రాన్ని ముందుగానే చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. పరీక్ష కేంద్రంలో రిజిస్ట్రేషన్, తనిఖీలకు సమయం పడుతుందని, అందువల్ల ముందుగానే పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. ఉదయం పరీక్షకు 8:30 నుంచి 9:15 లోపే, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి 1:45 లోపే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించారు.
పరీక్షల పర్యవేక్షణకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పకడ్బందీగా నిర్వహించేందుకు నలుగురు జోనల్ అధికారులను, 800 మంది ఇన్విజిలేటర్లను, 700 మంది సపోర్టింగ్ స్టాఫ్, 150 మంది కమిషన్ అబ్జర్వర్లు, 12 స్పెషల్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్సైట్లో (tspsc.gov.in) పొందవచ్చని వివరించారు.