ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన అవసరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. ఏ రంగంలో విధాన నిర్ణయం తీసుకున్నా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తామన్న విషయానికి ప్రాధాన్యం ఇవ్వాలని.. యువతకు ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల సిలబస్ విడుదల సందర్భంగా హరగోపాల్ మాట్లాడారు.
ప్రైవేటు రంగంలో కూడా పరిశ్రమలు వస్తే అందులో రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్న అంశాన్నే ప్రభుత్వం ప్రధానంగా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కేబినెట్ ఏ నిర్ణయం తీసుకున్నా నిరుద్యోగులకు ఎంతమేరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్న దానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర యువత కు ప్రయోజనం చేకూరేలా సిలబస్ రూపకల్పన పూర్తి చేశామని.. ఈ పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాల్లో చేరే యువత చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. 20-30 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందించాల్సిన ఉద్యోగాల్లో చేరే యువత రాష్ట్రం పట్ల అంకితభావంతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందులో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని, పోటీ పరీక్షల్లో బాలికలే ఎక్కువ మంది వస్తున్నారని చెప్పారు. మీడియా అనవసరపు వివాదాలు ప్రచారం చేయవద్దని... దాని వల్ల రాష్ట్రానికి, నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉందని సూచించారు. తెలంగాణ ఆకాంక్షలు తెలిసిన వారే సిలబస్‌ను రూపొందించారని విద్యావేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు. విద్యార్థుల ఆవేదన తెలిసిన వారు కాబట్టే వీలైనంత వరకు ఎక్కువ మార్పులు లేకుండా సరైన విధంగా సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చారని చెప్పారు.
మనం మార్చుకున్నట్లే ఏపీ కూడా..
పాఠ్య పుస్తకాలు, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాల్లో సిలబస్‌ను తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు మనం మార్చుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ కూడా సిలబస్‌ను మార్చుకుందని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో సిలబస్ మార్పు అనివార్యమన్నారు. ఇటీవల ఏపీ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ సిలబస్‌ను తొలగిస్తున్నారన్న అంశంపై విమర్శల నేపథ్యంలో హరగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.