tudi devender reddy
-
11 నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈనెల 11 నుంచి పునః ప్రారంభమవుతుందని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన లోటస్‌పాండ్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గతేడాది అక్టోబర్ 20న ప్రారంభించిన షర్మిల పాదయాత్రకు ఎమ్మెల్సీ కోడ్‌తోపాటు కరోనా మూడో వేవ్ కారణంగా తాత్కాలిక విరామం ఏర్పడిందన్నారు. పాద యాత్రను ప్రారంభించకుండా ప్రభుత్వం పలు ఆంక్షలతో అడ్డుకుందని ఆరోపించారు. గత పాదయాత్రలో 21 రోజుల్లోనే 231 కిలోమీటర్లు, 5 మున్సిపాలిటీలు, 15 నియోజకవర్గాలు, 150 గ్రామాల్లో షర్మిల పాదయాత్ర చేశారని తెలిపారు. 11న నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని కొండపాకగూడెం నుంచి పాదయాత్ర పున:ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, నియోజకవర్గంలోని సగానికిపైగా మండలాల్లో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగదీక్ష కొనసాగుతుందని దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. -
డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్?
సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేరు ఖరారయ్యింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తూడి దేవేందర్‌రెడ్డి స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆయన స్థానం ఖాళీ అవుతోంది. శుక్రవారం దాకా తూడినే కొనసాగించాలని చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని, దీంతో బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ పేరు దాదాపు ఖరారు అయ్యిం దని చెబుతున్నారు. గతంలోనూ ఆయన పేరు ఓసారి తెరపైకి వచ్చినా, కార్యరూపం దాల్చలేదు. ఎన్నికల ముందు బీసీ వర్గాలను సంతృప్తిపరచడం, పూర్తిగా జిల్లా కాంగ్రెస్ ‘రెడ్డి’మయం అన్న అపప్రదను తొలగించుకునేందుకు పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కాగా, ఏఐసీసీ ఆమోదం తర్వాతే భిక్షమయ్య గౌడ్ పేరును పీసీసీ ప్రకటించే అవకాశం ఉంది.