Tuition
-
కాలేజీకి భారీ విరాళం.. ట్యూషన్ ఫీజు మాఫీ!
ఆ మెడికల్ కాలేజీకి ఊహించని రీతిలో ఒక బిలియన్ డాలర్లు(రూ. 10 కోట్లు) విరాళంగా అందాయి. దీంతో ఆ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ట్యూషన్ ఫీజులను మాఫీ చేసి, వారికి ఫీజు భారాన్ని తగ్గించింది. యునైటెడ్ స్టేట్స్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ ఉదంతం చోటుచేసుంది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ విద్యా సంస్థకు భారీ విరాళం అందడంతో, ఆ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులందరి వార్షిక ట్యూషన్ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కళాశాలకు అనుబంధ ఆసుపత్రి, మోంటెఫియోర్ మెడికల్ సెంటర్ ఉన్నాయి. ఈ కాలేజీ యునైటెడ్ స్టేట్స్‌లోని వెనుకబడిన ప్రాంతంలో ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ట్యూషన్ ఫీజు మాఫీకి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ప్రకటన విన్న విద్యార్థులంతా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఆ వీడియోలో కనిపించారు. ఈ విరాళాన్ని ఐన్‌స్టీన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్, మాంటెఫియోర్ హెల్త్ సిస్టమ్ బోర్డ్ మెంబర్ రూత్ ఎల్ గాట్స్మాన్ అందించారని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. We are profoundly grateful that Dr. Ruth Gottesman, Professor Emerita of Pediatrics at @EinsteinMed, has made a transformational gift to #MontefioreEinstein—the largest to any medical school in the country—that ensures no student has to pay tuition again. https://t.co/XOy9HZLbfD pic.twitter.com/1ijv02jHFk — Montefiore Health System (@MontefioreNYC) February 26, 2024 -
ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి
నిరుపేద కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యనందిస్తున్నప్పటికీ, బడిలో నేర్చున్న పాఠాలను ఇంట్లో వల్లెవేయించడానికి గానీ, హోంవర్క్ చేయించడానికి కానీ ఎవరూ ఉండరు. పిల్లలకు సొంతంగా హోమ్‌వర్క్ ఎలా చేయాలో తెలియదు. దీంతో వాళ్లు మరుసటి రోజు టీచర్ హోంవర్క్ అడుగుతుందని స్కూలుకు వెళ్లడానికి భయపడి మధ్యలోనే స్కూలు మానేసి అరకొర చదువులతో భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి 70 ఏళ్ల శివస్వామి, మహాలక్ష్మి దంపతులు ఏర్పాటు చేసిన ఉచిత సెంటరే ‘కల్వితునై’. ‘ఉచితంగా నేర్చుకుని ఉన్నతంగా ఎదగండి’ అని చెబుతున్నారు ఈ దంపతులు. కోయంబత్తూరుకు చెందిన మహాలక్ష్మి దంపతులు 2010 లో రిటైర్ అయ్యారు. ‘సమాజం ఇచ్చినదాన్ని తిరిగి ఇవ్వాలి’ అన్న ఆలోచనా దృక్పథం కలిగిన వారు కావడంతో.. నిరుపేద పిల్లలు పడుతోన్న ఇబ్బందులను గమనించి వారికోసం ఏకంగా నలభై లక్షల రూపాయలను పెట్టి 2014లో ‘కల్వితునై’ పేరిట విద్యాసంస్థను ఏర్పాటుచేశారు. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒక బ్యాచ్‌గా, తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు రెండోబ్యాచ్గా పిల్లలకు ట్యూషన్ చెబుతున్నారు. అలా ఈ సెంటర్లో నిత్యం 130 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీరికోసం టీచర్లకు జీతాలు చెల్లించి చదువు చెప్పిస్తున్నారు ఈ దంపతులు. ఇప్పటిదాకా వెయ్యిమందికిపైగా విద్యార్థులు ఇక్కడ చదువుకోగా, 350 మందికిపైగా మంచి ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. చదువుతోపాటు... పాఠాలేగాక కథలు చెప్పించడం, మొక్కలు నాటించడం, కల్చరల్ ఈవెంట్స్, జాతీయ పర్వదినాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇంకా సమ్మర్ క్యాంప్‌లు, టూర్లకు తీసుకెళ్లడం, సేంద్రియ వ్యవసాయం గురించి వివరించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలికలకు మెనుస్ట్రేషన్ సెషన్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ తయారీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లోనూ జారిపోకుండా ఉండేందుకు వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులు, సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణను మొదలు పెట్టారు. బేసిక్ కంప్యూటర్ కోర్సులు, బయట యాభైవేల రూపాయలు ఖరీదు చేసే సీఏ ఫౌండేషన్ కోర్సును 4,500కే అందించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్‌ను బంగారు మయం చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి నెలకు లక్షరూపాయలు ఖర్చు అవుతుంది. సీఎస్ఆర్, బాష్, విప్రో, ఇంకా ఇతరులు ఇచ్చే విరాళాల ద్వారా సెంటర్‌ను నడిపిస్తున్నారు. వీరి వద్ద చదువుకున్న వాళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇదంతా చూస్తుంటే ఇలాంటి వారు మన రాష్ట్రాల్లోనూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. చదువునుంచి దృష్టి మరల్చకుండా... నిరుపేదలకు కనీస అవసరాలు తీరాలన్నా కష్టమే. అందుకే వాళ్లు డబ్బు సంపాదన మీదే దృష్టిపెడతారు. పిల్లల చదువుల గురించి శ్రద్ధ తీసుకునే అవగాహన, సమయం వారికి ఉండదు. దానివల్ల వారి భవిష్యత్ తరాలు కూడా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ఇటువంటివారికి ఉచితంగా ట్యూషన్ చెప్పడం ద్వారా వారి భవిష్యత్ మారుతుందని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. దీనిద్వారా కొంతమంది టీచర్లకు ఉపాధి దొరకడంతోపాటు విద్యార్థులకు చక్కని బోధన అందుతుంది. ఎప్పుడూ చదువే కాకుండా వివిధ రకాల విజ్ఞాన, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సంక్రాంతి సమయంలో కొత్తబట్టలు ఇవ్వడం, రోజూ ఆరోగ్యకరమైన స్నాక్స్ అందిస్తూ చదువునుంచి పిల్లల దృష్టి మరలకుండా చూస్తున్నాం’’ – శివస్వామి, మహాలక్ష్మి -
లాక్డౌన్: ఇదే సార్ మా మేడం ఇల్లు!
చంఢీగర్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి తరగతులు నిర్వహిస్తున్న ఓ ట్యూటర్ బాగోతాన్ని ఐదేళ్ల బాలుడు బయటపెట్టాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా బటాలాలో శనివారం ఈ సంఘటన వెలుగుచూసింది. తాతరి మొహల్లా ప్రాంతంలో ఓ వ్యక్తి తన మేనల్లుడు (5), మేనకోడల్ని తీసుకెళ్తూ పోలీసుల కంటబడ్డాడు. చిన్నారులను తీసుకుని ఎక్కడకి వెళ్తున్నారని ప్రశ్నించగా.. అతను పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. అయితే, బాలుడు ఇచ్చి సమాచారంతో వారు ట్యూషన్ క్లాసులకు వెళ్తున్నారని పోలీసులు గ్రహించారు. (చదవండి: జూలై చివరి వరకూ అదే మంచిది!) కానీ, పోలీసులు ఆ చిన్నారుల మేనమామ నుంచి ట్యూషన్ నిర్వహిస్తున్న ఇంటి అడ్రస్ రాబట్టలేక పోయారు. దాంతో పోలీసులు మరోసారి బుడ్డోడి సాయం తీసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆ చిన్నారి ట్యూటర్ ఇంటికి స్వయంగా తీసుకెళ్లాడు. రాత్రింబవళ్లు.. మైకులు పెట్టుకుని మరీ చెప్తున్నా.. మీకు వినిపించడం లేదా..? ట్యూషన్ నిర్వహించుకోమని మీకు ప్రత్యేక వెసులుబాటు ఏమైనా కల్పించారా? అని సదరు మహిళా ట్యూటర్కు పోలీసులు చీవాట్లు పెట్టారు. మళ్లీ ఇలాంటి తప్పు చేస్తే కటకటాల్లోకి పంపుతామని హెచ్చరించి వదిలేశారు. ఇక అడ్రస్ చెప్పకుండా ఇబ్బంది పెట్టిన చిన్నారుల మామయ్యను పోలీసులు మందలించారు. లాక్డౌన్లో పిల్లల్ని బయటకు తీసుకెళ్లి వాళ్ల ప్రాణాలను రిస్కులో పెట్టొదని హితవు పలికారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (చదవండి: వైరల్.. జీవాతో ధోని బైక్ రైడ్) -
5 లక్షలు, నగలు లేవు.. గుండె గుభేల్మంది సంగీతకి!
సమాజంలో చీకటి తెలియడం లేదు. ఆశలోని చీకటి తెలియడం లేదు.వ్యసనంలోని చీకటి తెలియడం లేదు.పెంపకంలోని చీకటి తెలియడం లేదు.చీకటి చుట్టూ ఉంది. వాస్తవికత అనే కిటికీ తెరిస్తేనే వెలుతురు పడుతుంది.స్కూల్లో పాఠాలు ఉంటాయి. ట్యూషన్‌లోనూ పాఠాలు ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలను ఈ పాఠాలకు అప్పజెప్పి తమ లోకంలో తాముంటే ఏదో ఒకరోజు గుణపాఠం ఎదురవుతుంది. ‘రఘూ.. ఇంకా ట్యూషన్‌కి వెళ్లకుండా ఏం చేస్తున్నావ్? టైమ్ అవడంలేదా?’ వంటింట్లో నుంచే అరిచింది కల్యాణి. ‘వెళుతున్నానమ్మా..’ బ్యాగ్ తీసుకొని బయటకు పోతూ సమాధానమిచ్చాడు రఘు. కల్యాణి బయటకు వచ్చి కొడుకు వెళ్లిన వైపుగా చూసి తిరిగి తన పనిలో పడిపోయింది. రఘు కల్యాణికి ఒక్కగానొక్క కొడుకు. 8వ తరగతి చదువుతున్నాడు.కాసేపట్లోనే రఘు తిరిగి వచ్చాడు.‘అదేంట్రా.. అప్పుడే వచ్చావ్’ ‘ట్యూషన్ టీచర్ ఇంట్లో దొంగలు పడ్డారంట. ట్యూషన్ లేదు..’ అంటూ పరిగెత్తుకుపోయాడు.‘అయ్యో.. టీచర్ కూతురు పెళ్లి దగ్గరలోనే ఉంది. దొంగలు పడితే వాళ్ల పరిస్థితి ఏంటి?’ చేస్తున్న పని వదిలేసి తాళం వేసి పక్కింటి మీనాక్షితో కలిసి ట్యూషన్ టీచర్ ఇంటికి బయల్దేరింది.వీళ్లు వెళ్లేసరికి పోలీసుల విచారణ నడుస్తోంది.ఆ ఇంట్లో వారంతా ఆందోళనగా ఉన్నారు. ట్యూషన్లు చెప్పే సంగీత కాన్వెంట్లో చాలా ఏళ్లుగా టీచర్. భర్త చిరుద్యోగి. వీరి ఒక్కగానొక్క కూతురి పెళ్లి ఇటీవల కుదిరింది. పెళ్లి మరో పదిహేనురోజులు ఉంది. పెళ్లివారికి ఇవ్వాల్సిన కానుకల కోసమని, షాపింగ్ కోసమని తెచ్చిన 5 లక్షల రూపాయలను, 20 తులాల బంగారు నగలను బెడ్రూమ్లోని బీరువాలో ఉంచింది. ప్రయివేట్ స్కూల్ కనుక శాలరీ కట్ ఎందుకని ఇంకా సెలవు పెట్టకుండా ఆ రోజు యధావిథిగా స్కూల్‌కు వెళ్లింది. కూతురేమో షాపింగ్ కోసం వెళ్లింది. సంగీత భర్త ఉద్యోగానికి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తాళం తీసేసరికి బీరువా తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. బట్టలన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. చూస్తే 5 లక్షల రూపాయలు, నగలు లేవు. గుండె గుభేల్మంది సంగీతకి.వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి.. లోపల దొంగతనం ఎలా జరిగింది?!ముచ్చెమటలు పోశాయి. భర్తకు, కూతురికి ఫోన్లు చేసింది. వాళ్లు వచ్చి, పరిస్థితి అర్ధమయ్యి పోలీసులకు ఫోన్ చేశారు. కూతురి పెళ్లి కోసం పోగేసిందంతా పోయింది. ఇప్పుడు పెళ్లి ఎలా చేయాలో దిక్కుతోచకుండా ఉంది ఆ కుటుంబానికి. పోలీసులు ఇంట్లోవారితోబాటు, చుట్టుపక్కల వారినీ విచారించారు. ఎవరికీ ఏమీ తెలియడం లేదు. దొంగలు ఎక్కణ్ణుంచి వచ్చే అవకాశం ఉందో అన్నిచోట్లా వెతికారు. వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి... దొంగలు ఇంట్లోకి ఎలా వచ్చినట్టు?అందరిలోనూ ఇదే అనుమానం.‘ఎవరో తెలిసినవారి పనే అయి ఉండాలి’ అన్నాడు ఎస్సై.ఆధారాల కోసం అణువణువూ గాలిస్తున్న పోలీసులకు కిచెన్‌కు ఆనుకుని ఉన్న కిటికీ దగ్గర 6వ నంబర్ ఎడమకాలి చెప్పు ఒకటి దొరికింది. దానిని తీసుకొని, మరికొన్ని వివరాలు సేకరించి వెళ్లిపోయారు పోలీసులు. ‘అమ్మా... నేనా ట్యూషన్‌కి వెళ్లను..’ అన్నాడు రఘు.‘పిల్లాడు భయపడినట్టున్నాడు. అయినా ఇలాంటి టైమ్‌లో ఆ టీచర్ ఇక ట్యూషన్ ఏం చెబుతుంది’ అనుకున్న తల్లి ‘వద్దులే నాన్నా. మీ నాన్నతో చెప్పి మరో టీచర్ని వెతుకుదాం’ అంది. బ్యాగ్ తీసుకొని బయటకెళుతున్న రఘుని ‘ట్యూషన్ లేదు కదరా. ఇప్పుడెక్కడికి? బ్యాగ్ ఎందుకు?’ ‘మా ఫ్రెండ్స్ కిరణ్, జాన్, విఘ్నేష్ ఉన్నారు కదమ్మా. మేమంతా కలిసి చదువుకుంటాం. హోమ్‌వర్క్ చేసుకొని వస్తాను’ ‘సరే.. త్వరగా వచ్చేయ్’ కొడుకును మురిపెంగా చూసుకుంటూ అంది.అలాగేనంటూ వెళ్లిపోయాడు రఘు.ఇప్పటికే ఏడాదిలో మూడు ట్యూషన్లు మార్చాం. మూణ్ణెళ్లుగా ఈ టీచర్ వద్ద పిల్లవాడు చక్కగా చదువుకుంటున్నాడు అనుకుంటే ఇప్పుడీ సమస్య వచ్చింది. ట్యూషన్ చెప్పేవాళ్ల గురించి వాకబు చేయాలనుకుంటూ లోపలకు వెళ్లిందామె. టీచర్ ఇంట్లో దొంగతనం జరిగి నాలుగు రోజులు గడిచాయి. ఫిబ్రవరి12, 2016.సాయంత్రం 6 గంటల సమయం.చలికాలం కావడంతో అప్పటికే చీకటిపడినట్టుగా ఉంది వాతావరణం.ఇంటì కాలింగ్‌బెల్ మోగుతుండటంతో ఎవరూ అంటూ తలుపులు తీసింది కల్యాణి. ఎదురుగా ఉన్న వ్యక్తులను చూసి నోట మాటరాలేదు.పోలీసులు.‘మీ అబ్బాయి రఘు ఎక్కడ?’‘ఏ.. ఏమైంది’ మాటలు వింటూనే లోపల గదిలో నుంచి పోలీసులను చూసిన రఘు వెనుక గుమ్మం నుంచి పరుగందుకున్నాడు. అప్రమత్తమైన ఒకరిద్దరు పోలీసులు రఘుని వెంబడించారు. ‘మీ వాడ్ని దొంగతనం నేరం కింద అరెస్ట్ చేస్తున్నాం..’ అన్నాడు ఎస్సై.గుండెలదిరిపోయాయి కల్యాణికి. ‘ఏంటి సార్. మావాడు చదువుకుంటున్నాడు. చిన్న పిల్లాడిని పట్టుకొని మీరిలాంటి నిందలు వేయడం మంచిది కాదు’ ధైర్యం తెచ్చుకొని అంది .‘ఈ శాండల్ మీ పిల్లాడిదే కదా’ ‘..అవును. ఐతే..’‘ఇది టీచర్ సంగీత ఇంట్లోని వంటగదికున్న కిటికీ బయట కట్టెల్లో దొరికింది’ కల్యాణి నోటమాట రానట్టు బిగుసుకుపోయింది.ట్యూషన్నుంచి వస్తుంటే దారిలో కుక్కలు వెంటబడ్డాయని, పరిగెత్తేటప్పుడు శాండల్ నాడ ఊడి జారిపోయిందని ఒకటే శాండల్‌తో ఇంటికి వచ్చిన రఘు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది కల్యాణికి.పోలీసుల పక్కనే తలదించుకుని ఉన్న మహేష్, విఘ్నేష్, జాన్‌లు కనిపించారు. అప్పుడే వచ్చిన రఘు తండ్రి విషయం అంతా విని షాకయ్యాడు. ఖమ్మం పోలీస్ స్టేషన్.ఫిబ్రవరి13, 2016.రఘు, కుమార్, విగ్నేష్, జాన్.. (పేర్లు మార్చాం) నలుగురు పిల్లలను పోలీసులు విచారిస్తున్నారు. భయంతో జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టారు వాళ్లు. ఆ నల్గురూ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఒకే స్కూల్ కూడా. అయితే రఘు, కుమార్ ఎయిత్ క్లాస్ అయితే విఘ్నేష్, జాన్ టెన్త్‌క్లాస్. నలుగురికీ సినిమా పిచ్చి. స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లే అలవాటు వల్ల‡ క్లోజ్‌ఫ్రెండ్స్ అయ్యారు వీరంతా. చిన్న చిన్న సరదాలకు అలవాటు పడి ఇంట్లోవారిని డబ్బులివ్వమని వేధించేవారు. ఇవ్వకపోతే ఇంట్లోనే పది, వంద రూపాయలు కొట్టేసేవారు. కానీ, అవి ఏ మూలకూ సరిపోయేవి కావు. మార్కులు ఎక్కువ రావాలని తల్లిదండ్రులు ట్యూషన్‌కి పంపిస్తే కొన్ని రోజులకు ఆ ఇళ్లలోనూ వారికి తెలియకుండా చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. ఆ తర్వాత ఆ ట్యూషన్ నచ్చలేదనో, టీచర్ సరిగా చెప్పడం లేదనో, ఇంటికి దూరమనో ఏడాదికి కాకుండానే నాలుగు ట్యూషన్లు మార్చేవారు. రెండునెలలుగా సంగీత టీచర్ వద్ద సాయంత్రాలు ట్యూషన్‌కు వస్తున్నారు. వీరితో పాటు మరో పదిమంది పిల్లలు కూడా ట్యూషన్‌కు వచ్చేవారు. ఆ ఇంట్లో చిన్న చిన్న వస్తువులు పోతూ ఉండేవి. సంగీతకి అర్థమయ్యేది కాదు. పనిమనిషి మీద అనుమానం వచ్చి పని మాన్పించింది. కానీ, ట్యూషన్‌కి వచ్చే పిల్లల పని అని సంగీతకి తెలియదు. త్వరలోనే టీచర్ కూతురు పెళ్లి అని, ఇంట్లో డబ్బు, బంగారం ఉందని ఫోన్లలో మాట్లాడుకునే మాటలద్వారా ఈ నలుగురూ గ్రహించారు. టీచర్ ఉదయం స్కూల్‌కి వెళితే సాయంత్రం ఇంటికి వస్తుంది. భర్త డ్యూటీకి వెళ్లిపోతాడు. కూతురు బయటకు వెళ్లిన సమయంలో దొంగతనం చేయవచ్చని అనుకున్నారు. ఆ రోజు అలాగే టీచర్ ఇంటికి చేరుకున్నారు. ట్యూషన్ పిల్లలే కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదు. వాళ్లు తాళం వేసున్న ఆ ఇంట్లోకి వెళ్లడానికి అన్ని దారులనూ వెతికారు. వెనకవైపు వంటగది కిటికీ సందు ఒకటి కనిపించింది. నలుగురిలో బక్కపలచగా ఉండే రఘు కొంత ప్రయత్నం చేస్తే కిటికీ గుండా లోపలకి వెళ్లొచ్చు అనుకున్నారు. రఘును ఎంకరేజ్ చేశారు మిగిలిన ముగ్గురూ. రఘు కిటికీ ఊచల సందులో నుంచి అతి కష్టంగా లోపలకి దిగాడు. బీరువా తాళాలు ఎక్కడ పెడతారో రఘుకు ముందే తెలుసు కాబట్టి త్వరగానే దొరికాయి. డబ్బు, బంగారం తీసుకొని కిటికీ గుండా బయటకు ఇచ్చేశాడు. తర్వాత తను కూడా మెల్లగా బయటకు వచ్చేశాడు.మిగతా ముగ్గురు డబ్బులు, బంగారం స్కూల్ బ్యాగ్‌లో పెట్టేసుకుని బయటకు వెళ్లిపోయారు. అయితే కిటికీ నుంచి బయటకు దూకేటప్పుడు అక్కడే ఉన్న కట్టెలలో రఘు కాలు ఇరుక్కుపోయింది. పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న రఘు కాలు బయటకు లాగేటప్పుడు శాండల్ కట్టెలలో ఇరుక్కుపోయింది. దానిని విదిలించుకుని అలాగే బయటకు పరిగెత్తి ముగ్గురు స్నేహితులలో కలిసిపోయాడు. ఎక్కడా చిన్న ఆధారమూ కూడా దొరక్కపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. కిటికీ వద్ద దొరికిన శాండల్ని చూస్తే చిన్న పిల్లవాడిదిలా అనిపించింది. ఇలాంటి దొంగతనాలు ఆరితేరిన దొంగలే చేస్తారు అని బలంగా నమ్మిన పోలీసులు శాండల్ని సంగీత టీచర్‌కి చూపించారు. తమ వద్దకు ట్యూషన్‌కి వచ్చే పిల్లల్లో ఎవరిదో అయి ఉంటుందని చెప్పిందామె. అలా అనుకుంటే ఇంటిముందు ఉండాల్సిన శాండల్ వెనుక వైపు అదీ కిటికీ వైపుగా ఎందుకు వెళ్లింది? డౌట్‌తో ట్యూషన్‌కి వచ్చే ఒక్కో పిల్లవాడిని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు పోలీసులు. మిగతా పిల్లలు తమకేమీ తెలియదని చెప్పారు. కానీ, కిరణ్మాత్రం భయపడిపోయాడు. జరిగిన విషయం చెప్పేశాడు. దీంతో రఘు, జాన్, విఘ్నేష్లతో కలిసి చేసిన దొంగతనాన్ని బయటపెట్టాడు. పిల్లలు చెప్పిన విషయం అంతా విన్న పోలీసులు నలుగురి పిల్లల తల్లిదండ్రులను హెచ్చరించారు. పిల్లలను జువైనల్ హోమ్‌కి తరలించారు. తల్లిదండ్రులు పిల్లలను గమనించుకోవాలి.వారిని ఎప్పుడూ సరైన దిశలో నడిపిస్తుండాలి. ఏమరుపాటుగా ఉంటే ఏమైనా జరగొచ్చు. బీ కేర్‌ఫుల్. – నిర్మలారెడ్డి ఇన్పుట్స్: గిరిధర్ రావుల, ఎఎస్పీ, మహబూబాబాద్ -
ఆ భయం ఉండాలి... ఆ బెత్తం కావాలి!
ఆచార్య దేవోభవ మా వీధిలో ఒక మాస్టారు ఉండేవారు. పేరు శ్యామ్ సుందర్. అప్పటికి ఆయనకు ఓ నలభయ్యేళ్లుంటాయి. రోజూ సాయంత్రాలు ప్రైవేటు(ట్యూషన్) చెప్పేవారు. ఆయనకు కాస్త కాలు అవుకు (ఫిజికల్లీ ఛాలెంజ్డ్). గొడుగు కర్రను పోలి ఉండే ఒక చేతికర్ర సాయంతో నడిచేవారు. చెప్పిన పాఠం సరిగా అప్పజెప్పలేని పిల్లలు భయంతో వెనక్కి వెనక్కి వెళిపోతుంటే... ఆ కర్రనే తిరగేసి మెడకో, కాలికో వేసి తన దగ్గరగా లాక్కునేవారు. దగ్గరగా వెళ్లేసరికే సగం పాఠం గుర్తొచ్చేసేది. లేకపోతే ఒక్క తొడపాశం, మరుసటిరోజు పాఠం అప్పజెప్పేవరకు గుర్తుండేది. బడినుంచి ఇంటికొచ్చాక పుస్తకం ముట్టుకోని పిల్లల్ని ఆయన దగ్గర ప్రైవేటుకు పంపేవాళ్లు. స్కూల్లో మాట వినని అల్లరోళ్లని అక్కడికే పంపించమని తల్లిదండ్రులకు టీచర్లే రికమండ్ చేసేవాళ్లు. పిల్లల్ని చదివించడంలో... చదువును దారిలో పెట్టడంలో ఆయనకు అంత పేరు. హైస్కూల్లో సుబ్బారావుగారు కూడా అంతే. హెడ్ మాస్టర్. టేబుల్ మీద ఎప్పుడూ రూళ్ల కర్ర, చెక్క స్కేలు మెరుస్తూ ఉండేవి. దెబ్బ బాగా తగలడానికి రోజూ మాస్టారు వాటికి ఏదో కొత్తరకం నూనె రాస్తున్నారని మేమంతా చెప్పుకునేవాళ్లం. మాస్టారు కంటే ముందు మేము వాటినే చూసేవాళ్లం. ఆయన చేతికి అవి ఎంత దగ్గరగా ఉంటే మేము ఆయనకు అంత దూరంగా నిలబడేవాళ్లం. సుబ్బారావు మాస్టారు ఉన్నారన్న ఉనికే స్కూల్ మొత్తాన్ని అటెన్షన్ లో ఉంచేది. దెబ్బ తినేంత తప్పు చేసినవాళ్లు, మెచ్చుకునేంత ఒప్పు చేసినవాళ్లు తప్ప ఆయనకు చేతికందే దూరంలో నిలబడిన విద్యార్థులు ఎవరూ లేరు. అలాగని బాగా కొట్టి భయపెట్టేవారా అంటే కాదు. ఆయన పిల్లల చేతిమీద కొట్టిన దానికంటే బల్లమీద కొట్టిందే ఎక్కువ. ఆ శబ్దం చాలు క్లాసురూము లైబ్రరీగా మారడానికి, చేతులు కట్టుకుని దూరంగా నిలబడిన విద్యార్థి కాళ్లు వణకడానికి. ఇప్పుడు స్కూల్లోనే టీచరు. అప్పుడు ఊళ్లోనూ టీచరే. వాళ్లు తిరిగే వీధిలో ఆటల్లేవు.. వాళ్లు ఎక్కిన బస్సుల్లో అల్లరిలేదు. కాలం మారింది. ఇప్పుడంతా ఫ్రెండ్లీ కల్చర్. ఈ ఫ్రెండ్లీ కల్చర్ గురుశిష్యులు కలిసి సరదాలు పంచుకోడానికి ఎంత పనికొస్తుందో, విద్యార్థులకు విలువల్ని నేర్పడానికి ఉపాధ్యాయులకు అంతగా అడ్డొస్తోంది. భయం, బెత్తం లేక ఫ్రెండ్లీ కల్చర్ కారణంగా ఏర్పడిన దగ్గరతనం వల్ల కొన్నిసార్లు వినకూడని విషయాల్లో ఉపాధ్యాయుల పేర్లు వినాల్సి వస్తోంది. మంచి చెడు తేడా తెలియని పసివాళ్లను, ఆడపిల్లల్ని తమ ఒడినుంచి బడికి పంపిస్తున్న కన్నవాళ్ల గుండెల్ని కుదిపేసే దారుణాలు చూడాల్సివస్తుంది. ఒక ఘోరం జరిగింది అనే బాధకంటే, అందుకు ఒక టీచర్ కారణం అనే వేదన సమాజాన్ని తొలిచేస్తుంది. ఆచార్యదేవోభవః అనడానికి నాలుక తడబడుతుంది. ఊళ్లో పిల్లలు ఎవరైనా తప్పుచేస్తే నువ్వు ఎవరి తాలూకు అని అడగడంకంటే ముందు ‘నీకు చదువు చెప్పింది ఎవర్రా?’ అనేవారు. అదీ సమాజంలో టీచర్ స్థానం. ఇప్పుడు అదే ప్రశ్న చెవుల్లో తిరుగుతోంది. టీచరంటే కాస్త భయం.. ఆ టేబుల్ మీద ఒక బెత్తం రేపటి సమాజానికి అవసరమనిపిస్తోంది. బెత్తంతో ఒక్క దెబ్బ కొడితే మారిపోయే జీవితాలు... చట్టంతో, సంకెళ్లతో భయపెట్టినా పట్టనంత ఘోరంగా మారిపోయాయి. దేశ భవిష్యత్తే కాదు... మనిషిలో సరైన ఆలోచనా నిర్మాణం కూడా తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. అదే సరైన సమాజాన్ని నిర్మిస్తుంది. అందుకోసం... ఉపాధ్యాయుల ముందు చేతులు కట్టుకునేంత భయం, ఆ భయాన్ని గుర్తుచేసే బెత్తం కావాల్సిందే! ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంగా కాక, సామాజిక బాధ్యతగా, కొన్ని తరాలను నడిపించే దిక్సూచిగా భావించి ప్రేమిస్తున్న ప్రతి గురువుకు వందనం. - పూడి శ్రీనివాసరావు -
పాపం అతిథి
-
పాపం అతిథి
వర్షపు నీటి ఉధృతికి కాలువలో పడిన ఆరేళ్ల చిన్నారి వెంటనే కొట్టుకుపోయిన వైనం రక్షించేందుకు స్థానికులు విఫలయత్నం దొరకని పాప ఆచూకీ మద్దిలపాలెం (విశాఖ) : ట్యూషన్‌కు వెళ్లొస్తూ ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు గెడ్డలో కొట్టుకుపోయిన వైనమిది. సీతమ్మధారలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్.అండ్ బి ఇంజినీర్ సి.హెచ్.రమణమూర్తి మనుమరాలు అతిథి(6) టింపనీ స్కూల్లో 1వ తరగతి చదువుతుంది. గురువారం సాయంత్రం ట్యూషన్ సెంటర్‌కి వెళ్లింది. 6 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు, కాలువలు పూర్తిగా జలమయమయ్యాయి. ట్యూషన్ నుంచి తిరిగి వస్తూ చిన్నారి రోడ్డుపై ఉన్న నీటిలో దిగి కారు ఎక్కబోయింది. పక్కడే డ్రెయిన్ కాలువ ఉండటంతో వర్షపు నీటి ఉధృతికి అతిథి అందులో పడిపోయింది. వెంటనే కొట్టుకుపోయింది. అక్కడివారు వెంటనే వెతికేందుకు ప్రయత్నించారు. కాలువపై 200 మీటర్ల మేరకు అక్రమంగా సిమెంట్ పలకలతో కప్పేయడంతో రక్షించడానికి ఫలితం లేకపోయింది. అయినప్పటికి స్థానికులు సాహసించి కాలువలో దూకి వెతికేందుకు ప్రయత్నించారు.అయినా ఫలితం లేకపోయింది. అతిథి సుమారు 6 గంటల ప్రాంతంలో గల్లంతయినప్పటికి అధికారులు 8 గంటల వరకు సంఘటనా స్థలానికి చేరకుకోలేదు. గాలింపు చర్యలు చేపట్టలేదు సరికదా కనీసం ప్రొక్లైనర్స్‌ని తీసుకొచ్చి సిమెంట్ దిమ్మలను తొలగించలేదు. దీంతో స్థానికులు ఆగ్రహించారు. ఎట్టకేలకు 9 గంటల సమయంలో ప్రొక్లైనర్తో త్రవ్వకాలు చేపట్టారు. జీవీఎంసీ నిర్లక్ష వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. మరో ప్రక్క ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చినప్పటికి టార్చ్లైట్లు చార్జింగ్‌లేవనే సాకుతో, సహాయక చర్యలు చేపట్టకపోవడం విచారకరం. పాప తల్లితండ్రులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. -
బాలికపై లైంగిక దాడి
ట్యూషన్‌కు వెళ్లగా ఘటన యాకుత్‌పురా: అభం..శుభం తెలియని చిన్నారిపై ఓ మానవ మృగం లైంగికదాడికి పాల్పడింది. రెయిన్‌బజార్ ఠాణా పరిధిలో ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... యాకుత్‌పురా బ్రాహ్మణ్‌వాడీ ప్రాంతానికి చెందిన బాలిక (6) స్థానిక పాఠశాలలో యూకేజీ చదువుతోంది. పాఠశాల నుంచి వచ్చాక ఇదే ప్రాంతంలోని ఓ ఇంటికి ట్యూషన్‌కు వెళ్తోంది. రోజు మాదిరిగానే గతనెల 29న ట్యూషన్‌కు వెళ్లగా.. ఆ సమయంలో ట్యూషన్ టీచర్ ఇంట్లో లేడు. అక్కడే ఉన్న అతని బంధువు నర్సింహ (25) బాలికను లోపలికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక ఎవరీకి చెప్పలేదు. ఈనెల 2న చిన్నారికి తీవ్రజ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు లైంగికదాడి జరిగినట్టు గుర్తించారు. తల్లిదండ్రులు బాలికను నిలదీయగా.. అసలు విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడు నర్సింహ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.