5 లక్షలు, నగలు లేవు.. గుండె గుభేల్మంది సంగీతకి! | Family crime story of the week 26 dec 2018 | Sakshi
Sakshi News home page

చీకటి కిటికీ

Published Wed, Dec 26 2018 1:05 AM | Last Updated on Wed, Dec 26 2018 11:41 AM

Family crime story of the week 26  dec 2018 - Sakshi

సమాజంలో చీకటి తెలియడం లేదు. ఆశలోని చీకటి తెలియడం లేదు.వ్యసనంలోని చీకటి తెలియడం లేదు.పెంపకంలోని చీకటి తెలియడం లేదు.చీకటి చుట్టూ ఉంది. వాస్తవికత అనే కిటికీ తెరిస్తేనే వెలుతురు పడుతుంది.స్కూల్లో పాఠాలు ఉంటాయి. ట్యూషన్‌లోనూ పాఠాలు ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలను ఈ పాఠాలకు అప్పజెప్పి తమ లోకంలో తాముంటే ఏదో ఒకరోజు గుణపాఠం ఎదురవుతుంది.


‘రఘూ.. ఇంకా ట్యూషన్‌కి వెళ్లకుండా ఏం చేస్తున్నావ్‌? టైమ్‌ అవడంలేదా?’ వంటింట్లో నుంచే అరిచింది కల్యాణి. ‘వెళుతున్నానమ్మా..’ బ్యాగ్‌ తీసుకొని బయటకు పోతూ సమాధానమిచ్చాడు రఘు. కల్యాణి బయటకు వచ్చి కొడుకు వెళ్లిన వైపుగా చూసి తిరిగి తన పనిలో పడిపోయింది. రఘు కల్యాణికి ఒక్కగానొక్క కొడుకు. 8వ తరగతి చదువుతున్నాడు.కాసేపట్లోనే రఘు తిరిగి వచ్చాడు.‘అదేంట్రా.. అప్పుడే వచ్చావ్‌’ ‘ట్యూషన్‌ టీచర్‌ ఇంట్లో దొంగలు పడ్డారంట. ట్యూషన్‌ లేదు..’ అంటూ పరిగెత్తుకుపోయాడు.‘అయ్యో.. టీచర్‌ కూతురు పెళ్లి దగ్గరలోనే ఉంది. దొంగలు పడితే వాళ్ల పరిస్థితి ఏంటి?’ చేస్తున్న పని వదిలేసి తాళం వేసి పక్కింటి మీనాక్షితో కలిసి ట్యూషన్‌ టీచర్‌ ఇంటికి బయల్దేరింది.వీళ్లు వెళ్లేసరికి పోలీసుల విచారణ నడుస్తోంది.ఆ ఇంట్లో వారంతా ఆందోళనగా ఉన్నారు. 

ట్యూషన్లు చెప్పే సంగీత కాన్వెంట్‌లో చాలా ఏళ్లుగా టీచర్‌. భర్త చిరుద్యోగి. వీరి ఒక్కగానొక్క కూతురి పెళ్లి ఇటీవల కుదిరింది. పెళ్లి మరో పదిహేనురోజులు ఉంది. పెళ్లివారికి ఇవ్వాల్సిన కానుకల కోసమని, షాపింగ్‌ కోసమని తెచ్చిన 5 లక్షల రూపాయలను, 20 తులాల బంగారు నగలను బెడ్‌రూమ్‌లోని బీరువాలో ఉంచింది. ప్రయివేట్‌ స్కూల్‌ కనుక శాలరీ కట్‌ ఎందుకని ఇంకా సెలవు పెట్టకుండా ఆ రోజు యధావిథిగా స్కూల్‌కు వెళ్లింది. కూతురేమో షాపింగ్‌ కోసం వెళ్లింది. సంగీత భర్త ఉద్యోగానికి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తాళం తీసేసరికి బీరువా తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. బట్టలన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. చూస్తే 5 లక్షల రూపాయలు, నగలు లేవు. గుండె గుభేల్మంది సంగీతకి.వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి.. లోపల దొంగతనం ఎలా జరిగింది?!ముచ్చెమటలు పోశాయి. భర్తకు, కూతురికి ఫోన్లు చేసింది. వాళ్లు వచ్చి, పరిస్థితి అర్ధమయ్యి పోలీసులకు ఫోన్‌ చేశారు. 

కూతురి పెళ్లి కోసం పోగేసిందంతా పోయింది. ఇప్పుడు పెళ్లి ఎలా చేయాలో దిక్కుతోచకుండా ఉంది ఆ కుటుంబానికి. పోలీసులు ఇంట్లోవారితోబాటు, చుట్టుపక్కల వారినీ విచారించారు. ఎవరికీ ఏమీ తెలియడం లేదు. దొంగలు ఎక్కణ్ణుంచి వచ్చే అవకాశం ఉందో అన్నిచోట్లా వెతికారు. వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి... దొంగలు ఇంట్లోకి ఎలా వచ్చినట్టు?అందరిలోనూ ఇదే అనుమానం.‘ఎవరో తెలిసినవారి పనే అయి ఉండాలి’ అన్నాడు ఎస్సై.ఆధారాల కోసం అణువణువూ గాలిస్తున్న పోలీసులకు కిచెన్‌కు ఆనుకుని ఉన్న కిటికీ దగ్గర 6వ నంబర్‌ ఎడమకాలి చెప్పు ఒకటి దొరికింది. దానిని తీసుకొని, మరికొన్ని వివరాలు సేకరించి వెళ్లిపోయారు పోలీసులు.

‘అమ్మా... నేనా ట్యూషన్‌కి వెళ్లను..’ అన్నాడు రఘు.‘పిల్లాడు భయపడినట్టున్నాడు. అయినా ఇలాంటి టైమ్‌లో ఆ టీచర్‌ ఇక ట్యూషన్‌ ఏం చెబుతుంది’ అనుకున్న తల్లి ‘వద్దులే నాన్నా. మీ నాన్నతో చెప్పి మరో టీచర్‌ని వెతుకుదాం’ అంది. బ్యాగ్‌ తీసుకొని బయటకెళుతున్న రఘుని ‘ట్యూషన్‌ లేదు కదరా. ఇప్పుడెక్కడికి? బ్యాగ్‌ ఎందుకు?’ ‘మా ఫ్రెండ్స్‌ కిరణ్, జాన్, విఘ్నేష్‌ ఉన్నారు కదమ్మా. మేమంతా కలిసి చదువుకుంటాం. హోమ్‌వర్క్‌ చేసుకొని వస్తాను’ ‘సరే.. త్వరగా వచ్చేయ్‌’ కొడుకును మురిపెంగా చూసుకుంటూ అంది.అలాగేనంటూ వెళ్లిపోయాడు రఘు.ఇప్పటికే ఏడాదిలో మూడు ట్యూషన్లు మార్చాం. మూణ్ణెళ్లుగా ఈ టీచర్‌ వద్ద పిల్లవాడు చక్కగా చదువుకుంటున్నాడు అనుకుంటే ఇప్పుడీ సమస్య వచ్చింది. ట్యూషన్‌ చెప్పేవాళ్ల గురించి వాకబు చేయాలనుకుంటూ లోపలకు వెళ్లిందామె.


టీచర్‌ ఇంట్లో దొంగతనం జరిగి నాలుగు రోజులు గడిచాయి. ఫిబ్రవరి12, 2016.సాయంత్రం 6 గంటల సమయం.చలికాలం కావడంతో అప్పటికే చీకటిపడినట్టుగా ఉంది వాతావరణం.ఇంటì కాలింగ్‌బెల్‌ మోగుతుండటంతో ఎవరూ అంటూ తలుపులు తీసింది కల్యాణి. ఎదురుగా ఉన్న వ్యక్తులను చూసి నోట మాటరాలేదు.పోలీసులు.‘మీ అబ్బాయి రఘు ఎక్కడ?’‘ఏ.. ఏమైంది’ మాటలు వింటూనే లోపల గదిలో నుంచి పోలీసులను చూసిన రఘు వెనుక గుమ్మం నుంచి పరుగందుకున్నాడు. అప్రమత్తమైన ఒకరిద్దరు పోలీసులు రఘుని వెంబడించారు. ‘మీ వాడ్ని దొంగతనం నేరం కింద అరెస్ట్‌ చేస్తున్నాం..’ అన్నాడు ఎస్సై.గుండెలదిరిపోయాయి కల్యాణికి. ‘ఏంటి సార్‌. మావాడు చదువుకుంటున్నాడు. చిన్న పిల్లాడిని పట్టుకొని మీరిలాంటి నిందలు వేయడం మంచిది కాదు’ ధైర్యం తెచ్చుకొని అంది .‘ఈ శాండల్‌ మీ పిల్లాడిదే కదా’ ‘..అవును. ఐతే..’‘ఇది టీచర్‌ సంగీత ఇంట్లోని వంటగదికున్న కిటికీ బయట కట్టెల్లో దొరికింది’ కల్యాణి నోటమాట రానట్టు బిగుసుకుపోయింది.ట్యూషన్‌నుంచి వస్తుంటే దారిలో కుక్కలు వెంటబడ్డాయని, పరిగెత్తేటప్పుడు శాండల్‌ నాడ ఊడి జారిపోయిందని ఒకటే శాండల్‌తో ఇంటికి వచ్చిన రఘు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది కల్యాణికి.పోలీసుల పక్కనే తలదించుకుని ఉన్న మహేష్, విఘ్నేష్, జాన్‌లు కనిపించారు. అప్పుడే వచ్చిన రఘు తండ్రి విషయం అంతా విని షాకయ్యాడు.

ఖమ్మం పోలీస్‌ స్టేషన్‌.ఫిబ్రవరి13, 2016.రఘు, కుమార్, విగ్నేష్, జాన్‌.. (పేర్లు మార్చాం) నలుగురు పిల్లలను పోలీసులు విచారిస్తున్నారు. భయంతో జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టారు వాళ్లు. 
ఆ నల్గురూ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఒకే స్కూల్‌ కూడా. అయితే రఘు, కుమార్‌ ఎయిత్‌ క్లాస్‌ అయితే విఘ్నేష్, జాన్‌ టెన్త్‌క్లాస్‌. నలుగురికీ సినిమా పిచ్చి. స్కూల్‌ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లే అలవాటు వల్ల‡ క్లోజ్‌ఫ్రెండ్స్‌ అయ్యారు వీరంతా. చిన్న చిన్న సరదాలకు అలవాటు పడి ఇంట్లోవారిని డబ్బులివ్వమని వేధించేవారు. ఇవ్వకపోతే ఇంట్లోనే పది, వంద రూపాయలు కొట్టేసేవారు. కానీ, అవి ఏ మూలకూ సరిపోయేవి కావు. మార్కులు ఎక్కువ రావాలని తల్లిదండ్రులు ట్యూషన్‌కి పంపిస్తే కొన్ని రోజులకు ఆ ఇళ్లలోనూ వారికి తెలియకుండా చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. ఆ తర్వాత ఆ ట్యూషన్‌ నచ్చలేదనో, టీచర్‌ సరిగా చెప్పడం లేదనో, ఇంటికి దూరమనో ఏడాదికి కాకుండానే నాలుగు ట్యూషన్లు మార్చేవారు. రెండునెలలుగా సంగీత టీచర్‌ వద్ద సాయంత్రాలు ట్యూషన్‌కు వస్తున్నారు. వీరితో పాటు మరో పదిమంది పిల్లలు కూడా ట్యూషన్‌కు వచ్చేవారు. ఆ ఇంట్లో చిన్న చిన్న వస్తువులు పోతూ ఉండేవి. 

సంగీతకి అర్థమయ్యేది కాదు. పనిమనిషి మీద అనుమానం వచ్చి పని మాన్పించింది. కానీ, ట్యూషన్‌కి వచ్చే పిల్లల పని అని సంగీతకి తెలియదు. త్వరలోనే టీచర్‌ కూతురు పెళ్లి అని, ఇంట్లో డబ్బు, బంగారం ఉందని ఫోన్లలో మాట్లాడుకునే మాటలద్వారా ఈ నలుగురూ గ్రహించారు. టీచర్‌ ఉదయం స్కూల్‌కి వెళితే సాయంత్రం ఇంటికి వస్తుంది. భర్త డ్యూటీకి వెళ్లిపోతాడు. కూతురు బయటకు వెళ్లిన సమయంలో దొంగతనం చేయవచ్చని అనుకున్నారు. ఆ రోజు అలాగే టీచర్‌ ఇంటికి చేరుకున్నారు. ట్యూషన్‌ పిల్లలే కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదు. వాళ్లు తాళం వేసున్న ఆ ఇంట్లోకి వెళ్లడానికి అన్ని దారులనూ వెతికారు. వెనకవైపు వంటగది కిటికీ సందు ఒకటి కనిపించింది. నలుగురిలో బక్కపలచగా ఉండే రఘు కొంత ప్రయత్నం చేస్తే కిటికీ గుండా లోపలకి వెళ్లొచ్చు అనుకున్నారు. రఘును ఎంకరేజ్‌ చేశారు మిగిలిన ముగ్గురూ. రఘు కిటికీ ఊచల సందులో నుంచి అతి కష్టంగా లోపలకి దిగాడు. బీరువా తాళాలు ఎక్కడ పెడతారో రఘుకు ముందే తెలుసు కాబట్టి త్వరగానే దొరికాయి. డబ్బు, బంగారం తీసుకొని కిటికీ గుండా బయటకు ఇచ్చేశాడు. తర్వాత తను కూడా మెల్లగా బయటకు వచ్చేశాడు.మిగతా ముగ్గురు డబ్బులు, బంగారం స్కూల్‌ బ్యాగ్‌లో పెట్టేసుకుని బయటకు వెళ్లిపోయారు. అయితే కిటికీ నుంచి బయటకు దూకేటప్పుడు అక్కడే ఉన్న కట్టెలలో రఘు కాలు ఇరుక్కుపోయింది. పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న రఘు కాలు బయటకు లాగేటప్పుడు శాండల్‌ కట్టెలలో ఇరుక్కుపోయింది. దానిని విదిలించుకుని అలాగే బయటకు పరిగెత్తి ముగ్గురు స్నేహితులలో కలిసిపోయాడు. 

ఎక్కడా చిన్న ఆధారమూ కూడా దొరక్కపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. కిటికీ వద్ద దొరికిన శాండల్‌ని చూస్తే చిన్న పిల్లవాడిదిలా అనిపించింది. ఇలాంటి దొంగతనాలు ఆరితేరిన దొంగలే చేస్తారు అని బలంగా నమ్మిన పోలీసులు శాండల్‌ని సంగీత టీచర్‌కి చూపించారు. తమ వద్దకు ట్యూషన్‌కి వచ్చే పిల్లల్లో ఎవరిదో అయి ఉంటుందని చెప్పిందామె. అలా అనుకుంటే ఇంటిముందు ఉండాల్సిన శాండల్‌ వెనుక వైపు అదీ కిటికీ వైపుగా ఎందుకు వెళ్లింది? డౌట్‌తో ట్యూషన్‌కి వచ్చే ఒక్కో పిల్లవాడిని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు పోలీసులు. మిగతా పిల్లలు తమకేమీ తెలియదని చెప్పారు. కానీ, కిరణ్‌మాత్రం భయపడిపోయాడు. జరిగిన విషయం చెప్పేశాడు. దీంతో రఘు, జాన్, విఘ్నేష్‌లతో కలిసి చేసిన దొంగతనాన్ని బయటపెట్టాడు. పిల్లలు చెప్పిన విషయం అంతా విన్న పోలీసులు నలుగురి పిల్లల తల్లిదండ్రులను హెచ్చరించారు. పిల్లలను జువైనల్‌ హోమ్‌కి తరలించారు. తల్లిదండ్రులు పిల్లలను గమనించుకోవాలి.వారిని ఎప్పుడూ సరైన దిశలో నడిపిస్తుండాలి.
ఏమరుపాటుగా ఉంటే ఏమైనా జరగొచ్చు. బీ కేర్‌ఫుల్‌.
– నిర్మలారెడ్డి
ఇన్‌పుట్స్‌:  గిరిధర్‌ రావుల, ఎఎస్పీ, మహబూబాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement