ఏ నిమిషానికి ఏమి జరుగునో..!
44 డివిజన్లో హైడ్రామా
కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎప్పుడు.. ఎవరు ఏ పార్టీలోకి మారుతారో తెలియని పరిస్థితి. ఈ రోజు ఈ పార్టీలో ఉన్న వ్యక్తి రేపు మరో పార్టీ కండువాతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని త్రీటౌన్ 44వ డివిజన్లో శనివారం ఓ హైడ్రామా చోటుచేసుకుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఐఎన్టీయూసీ నగర అధ్యక్షులు నున్నా మాధవరావు ఇంటికి మంత్రి తుమ్మల నాగేశ్వరావు అకస్మాత్తుగా వచ్చారు. మంత్రి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న 42, 43, 44 డివిజన్ల కాంగ్రెస్ కార్యర్తలు, నాయకులు మాధవరావు ఇంటి వద్దకు చేరుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా ‘తుమ్మల గోబ్యాక్..’
అని నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని కాం గ్రెస్ నాయకులు, కార్యకర్తలను అక్కడ నుంచి తరిమేశారు. మంత్రి మాధవరావుతో మాట్లాడి వెళ్లాక తిరిగి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పార్టీ మారవద్దని, కాంగ్రెస్‌లోనే కొనసాగాలని మాధవరావు ఇంటి ఎదుట ధర్నా చేశారు.
ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ హుటాహుటిన మాధవరావు ఇంటికి వచ్చి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి అజయ్ మాట్లాడుతూ డివిజన్లలో ముమ్మర ప్రచా రం చేయాలని పిలుపునిచ్చి వెళ్లారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు. - ఖమ్మం గాంధీచౌక్