హంపిలోనే ఐఐటీ స్థాపించాలి
హొస్పేట : ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న విజయనగర సామ్రాజ్య హంపి ప్రాంతంలోనే ఐఐటీ కేంద్రాన్ని స్థాపించాలని తుంగభద్ర బోర్డు కార్యదర్శి డీ.రంగారెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివారం నగరంలోని ప్రౌఢదేవరాయ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా ఆలుమ్ని మీట్-2015 ప్రౌఢ మిలన అనే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఐఐటీ కేంద్రం స్థాపనకు స్థలం సమస్య ఉందన్నారు.
ఈ ప్రాంతంలో ఐఐటీ కేంద్రాన్ని స్థాపిస్తే హంపికి మరింత ఆదరణ పెరుగుతుందన్నారు. ఐటీ రంగంలో కర్ణాటక ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్నారు. అమెరికా, చైనా, జపాన్, న్యూజిలాండ్ తదితర దేశాలలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తినప్పుడు బెంగళూరులోని విజ్ఞాన నిపుణుల సలహాలను తీసుకుంటారన్నారు. బళ్లారి జిల్లా నుంచి ప్రతి ఏటా సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టాలు పొందుతున్నారని తెలిపారు.
ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించకుండా ఇతర ఉపాధి మార్గాలను ఎంచుకోవాలన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశాలు వెదుక్కొంటూ వస్తాయన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాలేజీ పాలక మండలి అధ్యక్షుడు గోనాళ్ ఎం.విరుపాక్షగౌడ, సభ్యులు కల్గుడి మంజునాథ్, డాక్టర్ నాగరాజ్, డాక్టర్ ఏవీ విజయకుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్బీ శివకుమార్, ఉపన్యాసకులు, విద్యార్థులు పాల్గొన్నారు.