Turbo Cloud Airlines
-
జాతీయ క్యారియర్‌గా ట్రూజెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా రెండున్నరేళ్ల కిందట ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ఆరంభించిన ట్రూ జెట్.. జాతీయ స్థాయి సంస్థగా ఆవిర్భవిస్తోంది. టర్బో మేఘా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ సంస్థ... తాజాగా మరో 20 రూట్లలో విమాన సేవలు ఆరంభించేందుకు అనుమతులు సాధించినట్లు ప్రకటించింది. ప్రాంతీయంగా కనెక్టివిటీకి ఉద్దేశించిన ఉడాన్ పథకం రెండో దశ కింద ఈ 20 రూట్లలో తాము లైసెన్సులు పొందినట్లు టర్బో మేఘా ఎయిర్వేస్ హెడ్ (కమర్షియల్ విభాగం) సెంథిల్ రాజా తెలియజేశారు. కొత్త రూట్లలో అహ్మదాబాద్ – పోర్బందర్, జైసల్మేర్, నాసిక్, జల్గామ్, గౌహతి– కుచిహార్, బర్నపూర్, తేజు, తేజపూర్ తదితరాలున్నాయి. ‘‘ఇప్పటిదాకా ట్రూజెట్ ద్వారా 10 లక్షల మంది ప్రయాణించారు. తాజా రూట్లతో పశ్చిమ, తూర్పు తీరంతో పాటు ఈశాన్య భారత్‌లో కూడా సేవలు విస్తరించినట్లు అవుతుంది. ఈ నెల 25న చెన్నై–సేలం రూట్లో విమాన సేవలు ప్రారంభిస్తున్నాం. ప్రమోషనల్ ఆఫర్‌గా టికెట్‌ను రూ.599కే ఆఫర్ చేస్తున్నాం’’ అని రాజా వివరించారు. ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ దిగ్గజం ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)లో టర్బోమేఘా ఎయిర్వేస్ భాగంగా ఉంది. మరో ఏడు విమానాల కొనుగోలు.. ట్రూజెట్‌కు ప్రస్తుతం 5 విమానాలున్నాయి. వీటితో 13 ప్రాంతాలకు రోజుకు 32 సర్వీసులు నడుపుతోంది. త్వరలోనే మరో ఏడు విమానాలను సమకూర్చుకోనున్నట్లు రాజా చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఔరంగాబాద్ రూట్లతో పాటు ఉడాన్ స్కీమ్ కింద కడప, ఔరంగాబాద్, మైసూరు ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా రోజూ సుమారు 2 వేల మందిని వివిధ ప్రాంతాలకు చేరుస్తున్నట్లు తెలియజేశారు. సీఎఫ్ఎంతో స్పైస్‌జెట్ భారీ డీల్ గురుగ్రామ్: విమానయాన సేవల సంస్థ స్పైస్‌జెట్ తాజాగా జెట్ ఇంజిన్ల తయారీ సంస్థ సీఎఫ్ఎం ఇంటర్నేషనల్‌తో 12.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. లీప్ 1బీ ఇంజిన్ల కొనుగోలు, సర్వీసులకు ఈ డీల్ ఉపయోగపడనుంది. ప్రస్తుతం తమ విమానాల్లో ఉపయోగిస్తున్న సీఎఫ్ఎం56 కన్నా లీప్–1బీ ఇంజిన్లు సమర్థమంతంగా ఉండగలవని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం 38 పైచిలుకు ’సీఎఫ్ఎం56–7బి’ ఇంజిన్ల ఆధారిత బోయింగ్ ’737’ రకం విమానాలు స్పైస్‌జెట్ ఉపయోగిస్తోంది. -
టర్బో మేఘ టేకాఫ్‌కు లైన్‌క్లియర్
డీజీసీఏ నుంచి నిర్వహణ అనుమతి ♦ 10న వివరాలు ప్రకటించనున్న ప్రమోటర్ రాంచరణ్ ♦ 12 నుంచి ట్రూజెట్ పేరుతో విమాన సర్వీసులు! సాక్షి, న్యూఢిల్లీ : సినీ నటుడు రాంచరణ్ తేజ ప్రమోటర్‌గా ఉన్న టర్బో మేఘ ఎయిర్‌లైన్స్‌కు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఆపరేటర్ పర్మిట్‌ను జారీచేసింది. ఈ అనుమతి పత్రాలను ఈ ఎయిర్‌లైన్స్‌కు మరో ప్రమోటర్ అయిన వంకాయలపాటి ఉమేశ్‌కు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు మంగళవారం సాయంత్రం ఇక్కడి రాజీవ్‌భవన్‌లో అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘టర్బో మేఘ ఎయిర్‌లైన్స్‌కు నిర్వహణ అనుమతి ఇచ్చాం. గత ఏడాది కాలంలో ఇలా కొత్తగా సేవలు అందిస్తున్న నాలుగో ఎయిర్‌లైన్స్ ఇది. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణభారత ప్రాంతంలో ఈ ఎయిర్‌లైన్స్ సంస్థ ‘ట్రూజెట్’ బ్రాండ్‌తో సేవలు అందిస్తుంది. హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-ఔరంగాబాద్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగుళూరు వంటి ప్రాంతాలకు ఈ సంస్థ సర్వీసులు అం దుబాటులోకి వస్తాయి. గోదావరి మహా పుష్కరాల సందర్భంగా భక్తుల అవసరాల దృష్ట్యా రాజమండ్రికి సర్వీసులు నడపాలని కోరాం. అందుకు వారు అం గీకరించారు. రాజమండ్రి-హైదరాబాద్, రాజమండ్రి-చెన్నై, రాజమండ్రి-బెంగళూరు మార్గాల్లో పుష్కరాల సమయంలో వారు నడుపుతామన్నారు. 70 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలిగే రెండు ఎయిర్ క్రాఫ్టులు ఉన్నాయి’ అని ఆయన వివరించారు. డిసెంబర్ నాటికి ఐదు విమానాలు: ఉమేశ్ విలేకరుల సమావేశం అనంతరం ప్రమోటర్ ఉమేష్ మాట్లాడుతూ.. ‘అన్ని అనుమతులు త్వరగా రావడం సంతోషంగా ఉంది. ట్రూజెట్ పేరుతో నడిపే ఈ సర్వీసులు, మా సేవలను మా మరో ప్రమోటర్ రాంచరణ్ తేజ ఈనెల 10న వివరిస్తారు. 12న సేవలు ప్రారంభించాలనుకుంటున్నాం. వచ్చే నెలలో మరో విమానం వస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఐదు విమానాలు అందుబాటులోకి వస్తాయి. పౌర విమానయాన రంగాన్ని దగ్గరగా చూసిన నేను.. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరల్లో సేవలు అందిస్తాం. ముందుగా పుష్కరాలకు దక్షిణాదిలోని అన్ని నగరాల నుంచి రాజమండ్రికి విమాన సర్వీసులు అందిస్తాం’ అని చెప్పారు.