టర్బో మేఘ టేకాఫ్‌కు లైన్‌క్లియర్
డీజీసీఏ నుంచి నిర్వహణ అనుమతి
♦ 10న వివరాలు ప్రకటించనున్న ప్రమోటర్ రాంచరణ్
♦ 12 నుంచి ట్రూజెట్ పేరుతో విమాన సర్వీసులు!
సాక్షి, న్యూఢిల్లీ : సినీ నటుడు రాంచరణ్ తేజ ప్రమోటర్‌గా ఉన్న టర్బో మేఘ ఎయిర్‌లైన్స్‌కు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఆపరేటర్ పర్మిట్‌ను జారీచేసింది. ఈ అనుమతి పత్రాలను ఈ ఎయిర్‌లైన్స్‌కు మరో ప్రమోటర్ అయిన వంకాయలపాటి ఉమేశ్‌కు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు మంగళవారం సాయంత్రం ఇక్కడి రాజీవ్‌భవన్‌లో అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘టర్బో మేఘ ఎయిర్‌లైన్స్‌కు నిర్వహణ అనుమతి ఇచ్చాం.
గత ఏడాది కాలంలో ఇలా కొత్తగా సేవలు అందిస్తున్న నాలుగో ఎయిర్‌లైన్స్ ఇది. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణభారత ప్రాంతంలో ఈ ఎయిర్‌లైన్స్ సంస్థ ‘ట్రూజెట్’ బ్రాండ్‌తో సేవలు అందిస్తుంది. హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-ఔరంగాబాద్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగుళూరు వంటి ప్రాంతాలకు ఈ సంస్థ సర్వీసులు అం దుబాటులోకి వస్తాయి. గోదావరి మహా పుష్కరాల సందర్భంగా భక్తుల అవసరాల దృష్ట్యా రాజమండ్రికి సర్వీసులు నడపాలని కోరాం. అందుకు వారు అం గీకరించారు. రాజమండ్రి-హైదరాబాద్, రాజమండ్రి-చెన్నై, రాజమండ్రి-బెంగళూరు మార్గాల్లో పుష్కరాల సమయంలో వారు నడుపుతామన్నారు. 70 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలిగే రెండు ఎయిర్ క్రాఫ్టులు ఉన్నాయి’ అని ఆయన వివరించారు.
డిసెంబర్ నాటికి ఐదు విమానాలు: ఉమేశ్
విలేకరుల సమావేశం అనంతరం ప్రమోటర్ ఉమేష్ మాట్లాడుతూ.. ‘అన్ని అనుమతులు త్వరగా రావడం సంతోషంగా ఉంది. ట్రూజెట్ పేరుతో నడిపే ఈ సర్వీసులు, మా సేవలను మా మరో ప్రమోటర్ రాంచరణ్ తేజ ఈనెల 10న వివరిస్తారు. 12న సేవలు ప్రారంభించాలనుకుంటున్నాం. వచ్చే నెలలో మరో విమానం వస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఐదు విమానాలు అందుబాటులోకి వస్తాయి. పౌర విమానయాన రంగాన్ని దగ్గరగా చూసిన నేను.. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరల్లో సేవలు అందిస్తాం. ముందుగా పుష్కరాలకు దక్షిణాదిలోని అన్ని నగరాల నుంచి రాజమండ్రికి విమాన సర్వీసులు అందిస్తాం’ అని చెప్పారు.