అక్కడ మన క్రీడాకారిణులు క్షేమమే!
చెన్నై: సైనిక తిరుగుబాటుతో హింస తలెత్తి తీవ్ర ఉద్రిక్తంగా మారిన టర్కీలో 11మంది తమిళనాడు అథెట్లు చిక్కుకున్నారు. టర్కీలో జరుగుతున్న వరల్డ్ స్కూల్ గేమ్స్ మీట్ లో పాల్గొనేందుకు వివిధ స్కూళ్ల నుంచి విద్యార్థినులు వెళ్లారు. ఇంతలో సైనిక తిరుగుబాటు చోటుచేసుకోవడంతో వారి భద్రతపై ఆందోళన వ్యక్తంకాగా.. తాజాగా తమిళనాడు ప్రభుత్వం వారు క్షేమంగా ఉన్నారని తెలిపింది. వారి భద్రత గురించి ఆందోళన అవసరం లేదని, టర్కీ నుంచి విద్యార్థినులు క్షేమంగా తిరిగొచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని కోరినట్టు పేర్కొంది.
ఈమేరకు టర్కీలో తమిళనాడు అథ్లెట్ల భద్రత కోసం ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాలు జారీచేశారని ఆదివారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. స్కూల్ గేమ్స్ కోసం పలు భారత్ నుంచి 148 బాలలు వెళ్లగా.. వారు ప్రస్తుతం భద్రమైన జోన్ లో ఉన్నారని, అందులోనే 11మంది తమిళనాడు క్రీడాకారులు కూడా ఉన్నారని, జూలై 18న ఈ క్రీడలు ముగించుకొని వారు స్వదేశానికి తిరిగిరానున్నారని భారత రాయబార కార్యాలయం తమకు తెలియజేసిందని, కాబట్టి వారి భద్రత కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.