హ్యాకర్ల గుప్పిట్లో ఐఫోన్ల డేటా: కంపెనీని బ్లాక్మెయిల్
హ్యాకర్ల బారిన పడకుండా ఎంతో సురక్షితమైన ఫోన్ గా ఐఫోన్ కు పేరుంది. అందుకే ఆపిల్ ఐఓఎస్ సిస్టమ్ అంత పాపులారిటీ చూరగొంది. కానీ ఐఫోన్లు కూడా హ్యాకర్ల బారిన పడతాయని వెల్లడవుతోంది. తాజాగా మిలియన్ల కొద్దీ ఐఫోన్ల డేటా హ్యాకర్ల చేతికి వెళ్లిపోయిందట. ఆ ఐఫోన్ అకౌంట్ల ఫోటోలు, వీడియోలు, మెసేజ్లు అన్ని హ్యాకర్లు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారట. 'టర్కిస్ క్రైమ్ ఫ్యామిలీ' అనే హ్యాకర్ల గ్రూప్ ఈ చోరీ చేసినట్టు వెల్లడవుతోంది.
ఐక్లౌడ్, ఇతర ఆపిల్ ఈమెయిల్ అకౌంట్ల డేటాను తొలగించాలటే తమకు 75వేల డాలర్లను బిట్ కాయిన్ లేదా ఇథేరియన్ రూపంలో ఇవ్వాలని లేదా లక్ష డాలర్ల విలువైన ఐట్యూన్స్ గిఫ్ట్ కార్డులను తమకు ఇవ్వాల్సి ఉంటుందని ఆ హ్యాకర్ల గ్రూప్ కంపెనీని బ్లాక్ మెయిల్ చేస్తుందని తెలిసింది. కానీ ఆపిల్ కంపెనీ మాత్రం అసలు ఈ హ్యాకింగే జరుగలేదని తోసిపుచ్చింది. ఐక్లౌడ్, ఆపిల్ ఐడీలకు సంబంధించి ఎలాంటి ఆపిల్ సిస్టమ్స్ దొంగతనానికి గురికాలేదని తేల్చిచెబుతోంది. దాదాపు 559 మిలియన్ల(55కోట్లకుపైగా) ఆపిల్ ఈమెయిల్, ఐక్లౌడ్ అకౌంట్లను హ్యాకర్లు దొంగతనం చేసినట్టు చెబుతున్నారు. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఆపిల్స్ సెక్యురిటీ టీమ్ కు పంపిస్తున్నారు.