Tushar Gandhi
-
గాంధీ హత్యపై పునర్విచారణ నిలిపివేయండి
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ హత్యపై పునర్విచారణను వ్యతిరేకిస్తూ ఆయన మునిమనవడు తుషార్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మళ్లీ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో కోర్టు సహాయకుడిగా ఉన్న అమరేందర్ శరణ్ నివేదిక అందించేందుకు గడువు కోరారు. గాంధీ హత్య కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని కోరుతూ అభినవ్ భారత్ సంస్థ ట్రస్టీ పంకజ్ ఫడ్నవిస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై అక్టోబర్ 6న విచారించిన న్యాయస్థానం విచారణకు సాయం చేయాలని కోరుతూ మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ అమరేందర్ శరణ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది. అయితే ఈ కేసులో పంకజ్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ తుషార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జోక్యం చేసుకునే హక్కు పంకజ్‌కు లేదని పేర్కొన్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. ‘అయితే గాంధీ హత్య కేసులో జోక్యం చేసుకునే హక్కు తుషార్‌కు ఉందా ?’ అని ప్రశ్నించింది. ప్రస్తుతం గాంధీ హత్య కేసులో అనేక అనుమానాలు తలెత్తాయని.. అమికస్ క్యూరీ నివేదిక వచ్చేంత వరకు తుషార్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
మోదీపై గాంధీ మునిమనవడి ఫైర్
ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) క్యాలెండర్‌పై బాపూజీ ఫొటోకు బదులు ప్రధాని ఫొటో ఉండటంపై మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. బాపూజీ బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లేటప్పుడు కూడా ఖద్దరు ధరించే వెళ్లారు తప్ప 10 లక్షల రూపాయల సూట్ వేసుకెళ్లలేదని మోదీని విమర్శించారు. ''చేతిలో చరఖా, మనసులో గాడ్సే. టీవీలలో జోకర్ని జోకర్ అని పిలవడంలో తప్పులేదు'' అంటూ, కేవీఐసీని మూసేయాలని డిమాండ్ చేశారు. 1931 సంవత్సరంలో బాపూజీ బ్రిటన్ వెళ్లినపపుడు ఐదో జార్జి రాజును, మేరీని కలిసినప్పుడు కూడా ఆయన తన ట్రేడ్‌మార్కు ధోవతి, శాలువా మాత్రమే ధరించి వెళ్లిన విషయాన్ని తుషార్ గాంధీ ప్రస్తావించారు. అయితే.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015 జనవరిలో భారతదేశానికి వచ్చినప్పుడు ప్రధాని మోదీ రూ. 10 లక్షల విలువైన సూట్ ధరించడంతో పెద్ద వివాదం చెలరేగింది. తొలుత 2వేల రూపాయల నోటు మీద బాపూజీ అదృశ్యం అయ్యారని, ఇప్పుడు కేవీఐసీ క్యాలెండర్ నుంచి కూడా మాయమయ్యారని అన్నారు. అవినీతిపరులైన రాజకీయ నాయకుల చేతుల్లో నలిగే నోట్ల మీద ఉంచేకంటే.. అసలు బాపూజీ ఫొటోను పూర్తిగా కరెన్సీ నోట్ల నుంచి తీసేయడమే నయమని కూడా ఆయన మండిపడ్డారు.